బిసిల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలి - ప్రొఫెసర్‌ దుర్గాప్రసాద్‌, జమలయ్య డిమాండ్‌

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, బిసిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన వేదిక రాష్ట్ర గౌరవ సలదారులు ప్రొఫెసర్‌ ఎ.దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్‌ ఛైర్మన్‌ గంటా శ్రీరామ్‌ అధ్యక్షతన స్థానిక వివేకానంద హాలులో ఆదివారం జిల్లా సదస్సు జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. బిసిల నివాస ప్రాంతాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయని తెలిపారు. అందువల్ల జనాభా ప్రాతిపదికన బిసి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్‌ 
చేశారు. దీని సాధనకు ఐక్యతగా ముందుకు పోవాలన్నారు. సబ్‌ప్లాన్‌పై ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులను నిలదీయాలని పిలుపునిచ్చారు. మేధావులు, అవగాహన ఉన్న వారితో కమిటీ వేసి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందన్నారు. 
పోరాట వేదిక రాష్ట్ర నాయకులు పి.జమలయ్య మాట్లాడుతూ విద్యా, ఉద్యోగాల్లో బిసిలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగం దెబ్బతినడం వల్ల అవి అందని ద్రాక్షలా ఉన్నాయని తెలిపారు. ప్రయివేటు కంపెనీలకు భూమి, నీరు, విద్యుత్‌ ఇతర రాయితీలను ప్రభుత్వం కల్పిస్తున్నా రిజర్వేషన్లు అమలు జరగడం లేదన్నారు. ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పోస్టుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు గుడాల సత్యనారాయణ, బిసి ఐక్య వేదిక నాయకులు గొర్లి బాబూరావు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రా దేముడు, ఆంధ్రప్రదేశం మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొవిరి అప్పలరాజు, చేతి వృత్తిదారుల సంఘాల రాష్ట్ర నాయకులు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ చేతి వృత్తిదారులకు ఆర్థిక సహకారం అందించేందుకు చట్టపరంగా ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బిసిలకు సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఈ సదస్సులో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌ గంగాధర్‌, పి.అజరుకుమార్‌, చొప్పా బాబూరావు, వియ్యపు భూలోకనాయుడు, మొళ్లి రమణ, ఉరుకూటి శివసూర్యనారాయణ, జి.దేముడు, రజక సంఘం నాయకులు ఎం.ఈశ్వరరావు, మత్స్యకార సంఘం నాయకురాలు టి రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. 
పోరాట వేదిక నూతన కమిటీ ఎన్నిక
బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన పోరాట వేదిక నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. 30 మందితో ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ దుర్గాప్రసాద్‌, కన్వీనర్‌గా కొవిరి అప్పలరాజు, కో కన్వీనర్‌గా గొర్ల బాబూరావు, గౌరవ సలహదారులుగా పి అజరుకుమార్‌, గుడాల సత్యనారాయణ, చొప్పా బాబూరావు, వియ్యపు భూలోకనాయుడు, మొల్లి రమణబాబు, ఉరుకూటి శివసూర్యనారాయణ, జి దేముడునాయుడు, యర్రా దేముడు, ఒనుం శ్రీనివాసరావు, టి రాములమ్మ ఎన్నికయ్యారు..