బాబు పాలనలో ఎక్కడి సమస్యలక్కడే,- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పి.మధు నిశిత విమర్శ

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఏ సమస్యా పరిష్కారం కాలేదని, ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలుగానే మిగిలాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిమ్మగడ్డ రామ్మోహనరావు నగర్‌లో ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రారంభ సభకు మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు, ఎం.పకీరయ్య అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతులకు అరచేతిలో స్వర్గం చూపించిన ప్రభుత్వం వారి నుంచి భూములను సమీకరించి ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల్లేక వెలవెలబోతున్న యూని వర్సిటీలను సంరక్షించకుండా రాజధాని ప్రాంతంలో ప్రయివేటు యూనివర్సిటీకి వందల ఎకరాలు అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తమ పార్టీ చేపట్టిన పాదయాత్రలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, అయినా ఆగబోవని స్పష్టం చేశారు. భూమి, ఇసుక, మైనింగ్‌, క్వారీ దందాల కోసమే ఇతరులు టిడిపిలోకి చేరుతున్నారని ప్రజలే తమ దృష్టికి తెచ్చారన్నారు. ప్రజా సమస్యలపై చేపడుతున్న ఉద్యమాల్లో వైసిపి ఇప్పటికైనా భాగస్వామ్యం కావాలని సూచించారు.