బాబుకు భూ దాహం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భూ దాహం ఎక్కువైందని భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ దడాల.సుబ్బారావు అన్నారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు 15 రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు బుధవారం సంఘీభావం తెలిపిన అనంతరం సుబ్బారావు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని కార్పొరేట్‌, విదేశీ సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో భూ బ్యాంక్‌ పేరుతో 15 లక్షల ఎకరాలను తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. రైతులు, కూలీల పొట్ట కొట్టే భూ బ్యాంక్‌ను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పగటి వేషగాడిలా ఎన్నికల ముందు ఒకలా, గద్దెనెక్కిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ హయాంలో కాకినాడ సెజ్‌కు సేకరించిన భూములను అధికారంలోకొస్తే, తిరిగి అప్పగిస్తామని ఎన్నికల్లో హామీనిచ్చారని గుర్తుచేశారు.