బాక్సైట్ తవ్వకాలపై తీవ్ర నిరసన..

విశాఖ ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో గిరిజనులు, సిపిఎం, వివిధ ప్రజాసంఘాల నిరసనల మధ్య అరకు ఉత్సవ్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. బాక్సైట్‌ జిఒ 97, స్థానికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఉత్సవాలు చేపట్టడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల మనుగడకు ముప్పు కలిగించే బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేయాలని, హుదూద్‌ తుపాన్‌లో నష్టపోయిన రైతులకు, గిరిజనులకు, కూలీలకు పరిహారం చెల్లించాలని, స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అరకులోయ మ్యూజియం వద్ద నిరసన తెలుపుతుండగా తొమ్మిది మంది సిపిఎం, గిరిజన సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సమస్యలను పరిష్కరించిన తరువాతే అరకు ఉత్సవాలను నిర్వహించాలని, ఇప్పుడు చేపట్టడం వల్ల గిరిజనులకు ఒరిగిందేమీ లేదని పెద్దయెత్తున నినాదాలు చేశారు.