బహుళజాతి సంస్థల సామ్రాజ్యానికి బాటలు

 ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌ (టిటిఐపి) ఒప్పందంపై అమెరికా, ఐరోపా యూనియన్‌ (ఇయు) మధ్య చర్చలు జరుగు తున్నాయి. ఈ ఒప్పందాన్ని ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) ఒప్పందానికి అనుబంధ ఒప్పందంగా అమెరికా పరిగ ణిస్తున్నది. దుస్తులు, రసాయనాలు, మందులు, కాస్మటిక్స్‌, వైద్య పరికరాలు, కార్లు, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, యంత్రాలు, ఇంజనీరింగ్‌, క్రిమి సంహారకాలు, శానిటరీ అండ్‌ ఫైటో శానిటరీ మెజర్స్‌, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, తదితరాల వాణిజ్యంలో ఆటంకాలను తొలగించటం, ఇంధన, ముడి పదార్థాలు, వర్తకం, సుస్థిర అభివృద్ధి, శ్రమ, పర్యావరణం, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి, పోటీ విధానం, తదితర అనేక అంశాలపై తీసుకోవలసిన చర్యలు ఈ చర్చల పరిధిలో ఉన్నాయి. చర్చించాల్సిన అంశాలను 24 విభాగాలుగా చేసి, ప్రతి విభాగానికి సంబంధించిన అంశాలపై చర్చించి, తగిన ఒప్పందాన్ని రూపొందించేందుకు ఒక్కో విభాగానికి ఒక్కో గ్రూపును నియమించారు. ప్రతి గ్రూపులోనూ అమెరికా, ఇయుల నుంచి ప్రతినిధులుంటారు. మొదటగా గ్రూపు ప్రతిపాదనలను రూపొందిస్తుంది. ప్రతి గ్రూపులోనూ ప్రతివారి ప్రతిపాదనలను రెండవవారికి ఇచ్చి ఉభయుల అంగీకారంతో పత్రాలను రూపొందిస్తారు. ఇరువురూ అంగీకరించిన అంశాలను మినహాయించి ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఆ అంశాలను బ్రాకెట్లలో పెడతారు. చివరిలో మొత్తంగా ఒక అంశానికి సంబంధించి ఒప్పందాన్ని రూపొందిస్తారు. ఒప్పందానికి ముందు ఒప్పందంలోని ప్రతి అంశాన్ని గురించి వివరంగా చర్చిస్తారు. ఈ ఒప్పందం ప్రపంచ వాణిజ్యంలో మూడవ వంతును సరళీకరిస్తుంది.
2013లో టిటిఐపి ఒప్పందం కోసం చర్చలను ప్రారంభించారు. 2014 చివరి నాటికి చర్చలను పూర్తిచేసి, ఒప్పందం చేసుకోవాలని మొదట నిర్ణయించారు. కానీ 2014 నాటికి చర్చలు పూర్తికాలేదు. ఇప్పుడు 2019-20 నాటికి చర్చలను ముగించి ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పందానికి సంబంధించి మొదటి రౌండు చర్చలు 2013 జులై 7-12 తేదీల మధ్య వాషింగ్టన్‌లో జరిగాయి. 12వ రౌండ్‌ సమావేశాలు 2016 ఫిబ్రవరి 22- 26 తేదీల మధ్య బ్రస్సెల్స్‌లో జరిగాయి. చర్చలు ఏ మాత్రం పారదర్శకత లేకుండా రహస్యంగా జరుగుతున్నాయి. చర్చలకు సంబంధించి ఆయా గ్రూపులు రూపొందిస్తున్న ముసాయిదా పత్రాలు కూడా కొద్దిమంది ముఖ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఐరోపా పార్లమెంటు సభ్యులకు పత్రాలను చదవటానికి మాత్రమే అవకాశం ఉంది. పత్రాలను ఉంచిన చోటుకు స్కానింగ్‌, ఫొటోస్టాట్‌, చివరకు సెల్‌ఫోన్‌లు తీసుకువెళ్ళటం కూడా నిషేధింపబడింది. అమెరికా ప్రభుత్వం ఒప్పంద పత్రాల అందుబాటుపై ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. టిటిఐపి ఒప్పందం వల్ల అమెరికా, ఐరోపాల మధ్య వాణిజ్యం పెరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌లోని దేశాలలో 12,000 కోట్ల పౌండ్లు, అమెరికాలో 9,000 కోట్ల పౌండ్లు, ఇతర దేశాలలో 10,000 కోట్ల పౌండ్ల చొప్పున వార్షిక వాణిజ్యం పెరుగుతుందని చెబుతున్నారు. టిటిఐపి ప్రపంచ వాణిజ్యంలో మూడవ వంతును సరళీకరిస్తుందని, ప్రపంచ దేశాలలో లక్షలాది నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందని ఒప్పందాన్ని బలపరిచే వారు ప్రచారం చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌లోని వివిధ దేశాల ప్రజలు, ట్రేడ్‌ యూనియన్లు, ధార్మిక సంస్థలు, పర్యావరణవేత్తలు, ఇతర సంస్థలు ఒప్పందాన్ని వ్యతి రేకిస్తున్నాయి. ఒప్పందం అమల్లోకి వస్తే ఆహారం, పర్యావరణం, బ్యాంకింగ్‌ చట్టాలు నీరుగారతాయి. దేశాల సార్వభౌమత్వానికి విఘాతం కలుగుతుంది. ఒప్పందం వల్ల ఇయులోని దేశాలలో 6,80,000 ఉద్యోగాలు పోతాయని ఇయు కమిషన్‌ పరిశీలనలో తేలిందని, అయినా ఈ అంశాల ను ప్రచారం చేయగూడదని ఇయు కమిషన్‌ నిర్ణయించిందని చెబుతున్నారు.
ప్రపంచ జిడిపిలో అమెరికా, ఇయుల జిడిపి 60 శాతంగా ఉన్నది. సరుకుల వాణిజ్యంలో 33 శాతం, సేవల వాణిజ్యంలో 42 శాతం వీరి వాటా ఉన్నది. వీరిరువురి మధ్య జరుగుతున్న వాణిజ్యంపై సుంకాలు 3 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ మూడు శాతంలో కూడా 97 శాతం వరకు సుంకాలను తగ్గించుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నా రని రహస్య చర్చల్లో వెల్లడైన అంశాలు స్పష్టం చేస్తున్నాయి. సుంకాలు కాకుండా ఉన్న ఆటంకాలను తొలగించటం ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యంగా ఉన్నది. బ్యాంకులు, బీమా, మంచి నీరు, తదితర ప్రజా సేవలను క్రమబద్ధీకరించటానికి ప్రభుత్వం చట్టాలు రూపొందించటం, అమలు చేయటంపై పరిమితులను విధించేలా ఒప్పందాలలోని అంశాలున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవటం, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జాతీయం చేయటం లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవ టాన్ని నిరోధించే విధంగా నిబంధనలను రూపొందిస్తు న్నారు. ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు ఒప్పందంలోని అంశాలకు విరుద్ధంగా ఉంటే అవి చట్ట వ్యతిరేకం అవుతాయి. ఒప్పందంలో ఇండివిడ్యువల్‌ స్టేట్‌ డిస్ప్యూట్‌ సెటిల్‌మెంట్‌ (ఐయస్‌డియస్‌) క్లాజుననుసరించి ప్రభుత్వం, వ్యక్తిగత సంస్థల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ ప్రత్యేక న్యాయస్థానం వద్దకు వెళతారు. మధ్యవర్తిత్వ ప్రత్యేక న్యాయస్థానాలు బహుళజాతి సంస్థల పెట్టుబడులకు ప్రభుత్వంతో సమాన హోదాను ఇస్తాయి. మధ్యవర్తిత్వ ప్రత్యేక న్యాయస్థానాలు శాశ్వత ప్రాతిపదికపై ఏర్పడినవి కావు. వివాదం తలెత్తినప్పుడు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసేవారు బహుళజాతి సంస్థలకు దగ్గరగా ఉండే లాయర్లు, అధికారులు. కాబట్టి వారు బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించే వారినే జడ్జీలుగా నియమిస్తారు. తమ అనుభవంలో జాతీయ ప్రయోజనాలకు నష్ట కరమని రుజువైన వాటి విషయంలో కూడా బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు విరుద్ధమైన అంశాలపై ప్రభుత్వాలు చట్టాలు చేయటానికి వీలులేదు. అటువంటి చట్టాలను చేసిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బహుళజాతి సంస్థలు అంతర్జాతీయ వివాద పరిష్కార కోర్టులకు వెళతాయి. ఫుకుషిమా అణు ప్రమాదం జరిగినప్పుడు జర్మనీ ప్రభుత్వం అణు విద్యుత్‌ ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వీడిష్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ వెట్టెన్‌ఫాల్‌ 370 కోట్ల పౌండ్ల నష్ట పరిహారాన్ని కోరుతూ దావా వేసింది. అమెరికా, ఇయులోని దేశాల మధ్యనే ప్రస్తుతం ఒప్పందం జరుగుతున్నా వారికే పరిమితమై ఉండదు. తర్వాత ప్రపంచ దేశాలన్నింటిపైనా ఈ ఒప్పందాన్ని రుద్దుతారు. గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) ఏర్పాటు సందర్భంగా అమెరికా, ఇయులు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోవటం అవసరం. వ్యవసాయం, పెట్టుబడులు, మేధోసంపత్తి హక్కులు, బట్టలు, సేవలను గాట్‌లో చేర్చేందుకు అమెరికా, ఇయులు 1986లో చర్చలను ప్రారంభించాయి. చర్చలను ప్రారంభిం చేటప్పుడు 1990 నాటికి చర్చలను ముగించాలని భావించారు. కానీ వ్యవసాయం, వాణిజ్య సంస్కరణలకు సంబంధించి వారి మధ్య విభేదాలు రావటంతో 1992 నవంబరు వరకు చర్చలు జరిగాయి. ఆ తర్వాత 1994 ఆగస్టు నాటికి మొత్తం 123 దేశాల ప్రతినిధుల చేత సంతకాలు చేయించారు. తమ మధ్య విభేదాలు పరిష్కార మైన తర్వాత దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్న చందంగా వ్యవహరించాయి. వర్ధమాన దేశాలు ఆ ఒప్పందం తమకు లాభం చేస్తుందా, నష్టం కలిగిస్తుందా అని ఆలోచించుకోవటానికి, భిన్నాభిప్రాయాలు తెలియజేయ టానికి అవకాశం ఇవ్వకుండా 'అంగీకరిస్తే మొత్తం ఒప్పందాన్ని అంగీకరించటం లేదా మొత్తాన్ని తిరస్క రించటం' అని ఒత్తిడి చేసి, బలవంతంగా ఆమోదింపజేశారు. ప్రస్తుతం చర్చిస్తున్న టిటిఐపి ఒప్పందాన్ని కూడా వారి మధ్య చర్చలు పూర్తయిన తర్వాత మిగతా వర్ధమాన దేశాలపై ఇదేవిధంగా రుద్దుతారు. వర్ధమాన దేశాల్లో నయా ఉదార వాద విధానాలను బలపరిచే ప్రభుత్వాలు అధికారంలో ఉండటం, ఈ ప్రభుత్వాలు బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుండటంతో పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఒప్పందాన్ని ఆమోదింప జేసుకోగలుగుతారు. ఈ ఒప్పందం వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. అమెరికా, ఇయుల మధ్య ఒప్పందం పూర్తయిన తర్వాత ఆ దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుంది. వర్ధమాన దేశాల ఎగుమతులు తగ్గుతాయి. వర్ధమాన దేశాలలోకి సామ్రాజ్యవాద దేశాల ఉత్పత్తులు వెల్లువలా వచ్చిపడతాయి. ఫలితంగా వర్ధమాన దేశాలలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు తీవ్రంగా నష్టపోతాయి. గతం నుంచీ ఈ విధానాల ద్వారా వర్ధమాన దేశాల ఆర్థికవ్యవస్థలపై పెత్తనం చేస్తున్న సామాజ్యవాద దేశాలు ఇప్పుడు ఈ ఒప్పందంతో ప్రభుత్వాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది.
మనదేశంలో ప్రస్తుతం సరళీకరణ విధానాలను అమలు జరుపుతున్న ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నాయి. దేశ, విదేశీ పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తూ, సామాజిక సంక్షేమ పథకాలపై పరిమితులను విధిస్తున్నాయి. ఉపాధి హామీ చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ లాంటి వాటిని దెబ్బతీయటానికి పూనుకున్నాయి. విద్య, వైద్యాలను పూర్తిగా ప్రయివేటువారికి అప్పగించేందుకు వేగంగా మార్పులు తెస్తున్నాయి. రైతాంగం నుంచి బలవంతంగా భూములను లాక్కొని కార్పొరేట్‌, బహుళజాతి సంస్థలకు అప్పగిస్తున్నాయి. పిపిపి విధానం పేరుతో వ్యవసాయ భూములపై కార్పొరేట్‌ సంస్థలకు పెత్తనం కట్టబెట్టే విధానాలను రూపొందిస్తు న్నాయి. యజమానులు ఇష్టారాజ్యంగా దోపిడీ చేయటానికి వీలుగా కార్మిక చట్టాలకు సవరణలు చేస్తున్నాయి. ఈ విధానాల ఫలితంగా గతంలో ఎన్నడూలేని విధంగా అసమానతలు పెరిగాయి. దారిద్య్రం, నిరుద్యోగం పెరిగింది. సామ్రాజ్యవాద దేశాల ప్రభుత్వాలు, బహుళజాతి సంస్థలు పరోక్షంగా పెత్తనం చేస్తుంటేనే ప్రజలు ఇటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక టిపిపి, టిటిఐపిలలో మనదేశం భాగస్వామి అయితే వలస పాలన కాలం నాటి దుస్థితిని ఎదుర్కొంటాం.
- ఎ కోటిరెడ్డి