బలవంతపు భూసేకరణను అడ్డుకుంటాం

   ప్రజా ఉద్యమం తప్పదు : సిపిఎం
        ప్రభుత్వం మొండిగా వ్యహరించి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు సిద్ధపడితే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం నక్కపల్లి డివిజన్‌ కన్వీనర్‌ ఎం.అప్పలరాజు హెచ్చరించారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు కోర్టును ఆశ్రయించారని, కోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం తన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సామాజిక ప్రభావ నివేదికను బహర్గతం చేయాలన్నారు. అవేమి లేకుండా ప్రభుత్వ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.         

              విశాఖ-చెన్నై ఇండిస్టియల్‌ కారిడార్‌ కోసం ప్రభుత్వం మొండిగా వ్యవహరించి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చెపడితే అడ్డుకుంటామని భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు తళ్ళ అప్పలస్వామి స్పష్టం చేశారు.  రైతులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వకుండా అధికారులు గ్రామాల్లో పర్యటించడం సరైన పద్ధతి కాదన్నారు. కనీసం గ్రామంలో దండోరా కూడా వేయలేదన్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, ఆ భూములను ప్రభుత్వం లాక్కుంటే ఎలా బతుకుతామని ఆయన ప్రశ్నించారు. ఈ భూములపై ఆధారపడి రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, ఇతర వృత్తిదారులు జీవనం సాగిస్తున్నారని, వీటిని తీసుకుంటే వారంతా రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కూలీలు, ఇతర వృత్తిదారులతో చర్చించకుండా అధికారులు నేరుగా గ్రామాల్లోకి వచ్చి ఎకరానికి రూ.18 లక్షలు ఇస్తాం, బ్యాంకులో జమచేస్తామంటూ చెప్పడం దారుణమన్నారు. వారి పరిస్థితి ఏమిటో చర్చించకుండా ఆఘమేఘాలపై భూములు లాక్కోవడం సరైన పద్ధతి కాదని హితవుపలికారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.