ప్రశ్నలూ ప్రతిఘటనల ప్రకంపనాలు..

ఇటీవలి కాలంలో కేంద్రంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వెంటవెంట జరుగుతున్న పరిణామాలు చూసే వారికి ప్రజాస్వామిక భావజాలం, ప్రజా ఉద్యమాల వారసత్వబలం తెలిసి వస్తున్నాయి. ఏడాది కూడా తిరక్కుండానే మూడు ప్రభుత్వాల పాలకులు తమను తాము సమర్థించుకోలేని స్థితిలో పడిపోతున్నారు. తమ ఆధిక్యత శాశ్వతమైనట్టు విర్రవీగినవారు అంతకంటే వేగంగా ఆత్మరక్షణ మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ఎజెండాలు లోపల పెట్టుకుని రాజకీయ బీరాలు పలికిన వారు రాజీ రాగాలాల పిస్తున్నారు. ఈ రాజీల వెనక రహస్యాలేమనే సందేహాలు, సవాళ్లు మీడియాలోనూ, సమాజంలోనూ వ్యక్తమవుతుంటే సర్దుకోలేక సతమతమవుతున్నారు. ఏతావాతా ఇదంతా వారి స్వయం కృతమైతే ప్రజా స్పందన తత్ఫలితం.
దిగజారిన ప్రచారం
నరేంద్ర మోడీ అంటే తిరుగులేని నేత అన్న మోత మొన్నటి ఎన్నికల్లో బిజెపిని గద్దెక్కించింది. సంఘ పరివార్‌ విజృంభణకు అవకాశమచ్చింది. ఆయన తేనీరు సేవించినా, రహదారుల్లో లాంఛనంగా ఊడ్చినా ప్రతిదీ ప్రచార పటాటోపానికి సందర్భమైంది. దేశ విదేశాలనే తేడా లేకుండా ఆయన కాలూనిన ప్రతిచోటా కోట్ల ఖర్చుతో అట్టహాసం. ఒకప్పుడు ఇందిరే ఇండియా భజనను మించి పోయే స్థాయిలో నమో నామ స్మరణ నడిచింది. కానీ ఒక్కసారి బీహార్‌ ఎన్నికల రంగం పరిశీలిస్తే అదంతా ఎంత త్వరగా కలలా కరిగిపోతున్నదీ కళ్లకు కడుతుంది. బీహార్‌ ఎన్నికల ప్రచార భారమంతా ఒంటిచేత్తో నడిపించి విజయం వొళ్లో వేస్తారన్న భ్రమలు పటాపంచలు కాగా ఒకో దశకూ, దఫాకూ ఎదురు గాలి తీవ్రమై పోయింది. రాష్ట్రంలో ఏ నాయకుడికీ ప్రాధాన్యతనివ్వని బయిటి మోత ఏమిటన్న భావన బిహారీ వర్సెస్‌ బాహరీ వాదనకు దారితీసింది. దాని మంచిచెడ్డలు ఒకటైతే నేను బాహరీనా? ఒక ప్రధానమంత్రి తన దేశంలో బయిటివాడవుతాడా అని ఆక్రోశించాల్సిన స్థితి మోడీకి ఇంత త్వరగా సంప్రాప్తిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. పైగా ఆ ప్రశ్నకు ప్రజల నుంచి బలమైన స్పందన రాకపోగా తనే చెప్పుకోవలసిన స్థితి. తర్వాతి దశలో మరో అడుగు వేసి తనకూ, సోనియా గాంధీకి పోటీ పెట్టుకుని మాట్లాడుకోవడం. ఈ మధ్యలో ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్లు తగ్గించి ముస్లిములకు ఇచ్చే కుట్ర జరుగుతున్నదని స్థాయికి తగని ఆరోపణలు చేయడం.
దేశంలో మత విద్వేషాలు పెంచే విధంగా మాట్లాడుతున్నది సంఘ పరివార్‌ సంస్థల ప్రతినిధులే తప్ప తమకు వాటితో సంబంధం లేదన్నట్టు ప్రభుత్వం, బిజెపి అగ్రనేతలు ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్నారు. కానీ మోడీ అన్న ఈ మాటలైనా అధికారపూర్వకంగా తీసుకో వద్దా? ప్రధానికి, పార్లమెంటుకు తెలియకుండా రెండు ప్రాంతీయ పార్టీలు దళితుల రిజర్వేషన్లు రద్దు చేసి ముస్లిములకు ఇవ్వడం సాధ్యమేనా? ప్రధాని ఈ విధంగా మతాల వారీగా మాట్లాడితే ప్రజలపై ఎలాటి ప్రభావం పడుతుంది? రాజస్థాన్‌లో గుజ్జర్లు, గుజరాత్‌లో పటేళ్ల విషయంలో బిజెపి ద్వంద్వ వైఖరి అనుసరించడంలో ఎలాటి కుట్ర లేదా? ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని ప్రతిపాదించడం ద్వారా మొత్తానికి ఎసరు పెట్టారనే భావం దేశమంతటా వ్యక్తం కాలేదా? దానిపై నిరసన పెల్లుబికిన బీహార్‌లోనూ ఎదురు కొడుతుందన్న భయం మోడీ వ్యాఖ్యల వెనకలేదా? రిజర్వేషన్లపై కుట్రలే జరిగితే ఢిల్లీలో చక్రం తిప్పుతున్న తమ ద్వారా జరగవచ్చు గాని రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తాయి? ఇన్ని విద్వేష వ్యాఖ్యల తర్వాత కూడా బీహార్‌లో బిజెపి గెలిచే అవకాశాలు లేవనే ఆ పార్టీ ప్రముఖులు కూడా అంగీకరిస్తున్నారు.
నిరసనాగ్నిపై సంపాదక శాపాలు
ఇక బిజెపి సర్కారుకు, పరివార్‌కు బొత్తిగా జీర్ణం కానిది దేశంలో మేధావులు, రచయితలు, కవుల నుంచి వ్యక్తమవుతున్న ధర్మాగ్రహం. అక్షరాగ్ని. కల్బుర్గి హత్య నుంచి దాద్రీ నరమేధం వరకూ జరిగిన అమానుష మతతత్వ దాడులు వారిని ఆగ్రహోదగ్రులను చేశాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పురస్కారాలను, బిరుదులను తిరస్కరించడం ద్వారా వారు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. భారత దేశ లౌకిక, ప్రజాస్వామిక విలువలను, మత సామరస్యాన్ని కాపాడుకోవాలనే విషయంలో దేశం ఎంత ఏకాభిప్రాయంతో ఉందో మేధావుల నిరసన వెల్లడి చేసింది. ఘర్‌ వాపసీ కాస్తా అవార్డు వాపసీగా మారిపోవడం మోడీ సర్కారును, బిజెపి నాయకత్వాన్నీ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంత ప్రజ్వలనను వారు ఊహించలేదు. ఊహించలేరు కూడా. ఆలస్యంగా తేరుకుని వారిపై ఎదురు దాడి మొదలు పెట్టారు. మేధావి ముద్రతో మొదట్లో అసహనం తగదని హితవచనాలు చెప్పినట్టు నటించిన కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ స్వయంగా వీరంతా ప్రభుత్వ వ్యతిరేకులు, కాంగ్రెస్‌ అనుకూలురన్నట్టు నోరు పారేసుకున్నారు. దారుణమైన దాడులకు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులకు వ్యతిరేకంగా వారు అవార్డులు తిరస్కరిస్తే ఆ తిరస్కరణే అపరాధమన్నట్టు ఆయన లాటి వారు మాట్లాడుతున్నారు. తెలుగులో కూడా సంఘ పరివార్‌ సంస్మరణకు అంకితమైన ఒక 'శాస్త్రీయ సంపాదక మహాశయుడు' 'వీరు మేధావులా? వెర్రి గొర్రెలా?' అనే చౌకబారు సంపాదకీయం రాసి తన అక్కసును లేదా కక్కూసును బయిట పెట్టుకున్నారు. పద్మభూషణ్‌ను వెనక్కుకొట్టిన ప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు పిఎం భార్గవతో సహా ఎందరో రచయితలు, విమర్శకులు ఈ సంపాదకులకు వెర్రిగొర్రెల్లా కనిపించడం మూర్ఖత్వానికి పరాకాష్ట. అర పేజీ అక్కసు రాతలో అక్షరమైనా సంఘ పరివార్‌ అసహన దాడులను ఖండించడానికి వినియోగించని ఈ ప్రబుద్ధుడు సంయమనానికి, సమతుల్యతకు మారుపేరైన సంపాదక ప్రతిష్టకే కళంకమని చెప్పవలసి ఉంటుంది. ఈ శాపనార్థాలకే చెదిరిపోయేంత బలహీనంగా ప్రగతిశీల బుద్ధిజీవుల శిబిరం లేదని తెలుసుకోవడం మంచిది.
అసంబద్ధ పోలికలు
1984లో సిక్కులపై ఊచకోత సమయంలో ఎందుకు ఇలాటి నిరసన తెల్పలేదనేది బిజెపి వారి విమర్శల్లో ముఖ్యమైంది. అందుకు గాను కాంగ్రెస్‌ అనుకూలత అంటగడుతున్నారు. గుజరాత్‌ మారణకాండ సమయంలోనూ రచయితలు నిరసన తెలిపారు గాని ఈ స్థాయిలో అవార్డులు వెనక్కు ఇవ్వలేదు. దాని అర్థం వారంతా బిజెపికి చెందినవారనా? నిజానికి ఈ రెండు సందర్భాల్లోనూ లౌకికవాద రచయితలు, మేధావులు తీవ్రస్థాయిలోనే నిరసన గళం వినిపించారు. కాకుంటే ఇప్పుడు మోడీ పూర్తి మెజారిటీతో గద్దెక్కిన తర్వాత ఒక క్రమపద్ధతిలో సైద్ధాంతికంగానూ, ప్రత్యక్షంగానూ దాడులు, హత్యలు జరుగుతున్నాయి గనకా - అవి కూడా దేశమంతటా విస్తరిస్తున్నాయి గనకా- రచయితలు, కళాకారులను లక్ష్యంగా చేసుకున్నారు గనకా వారి స్పందన తీవ్రంగా ఉంది. వారి ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకుని దుర్మార్గాలను అరికట్టే బదులు వారందరినీ కాంగ్రెస్‌ అనుకూల ముద్ర వేసి అవమానించడం తగని పని. వారిలో అత్యధికులు వాస్తవానికి కాంగ్రెస్‌, బిజెపియేతర వామపక్ష, లౌకిక స్రవంతికి చెందిన ప్రగతివాదులు! విజ్ఞులైన అలాటివారు విష ప్రచారాలకే భయపడి పోవడం జరగదని పరివార్‌ ప్రచారకులు తెలుసుకుంటే మంచిది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా వీటిపై ఆవేదన వ్యక్తం చేయడం, ఆ మాటలు ప్రధాని మొక్కుబడిగా ఉటంకించడం జరిగిందంటే దానికేమంటారు? భావజాలంపైన, జీవ చైతన్యంపైన దాడి జరుగుతున్నది కాబట్టే మేధావులు ఇంతగా ఆగ్రహించారనేది అసలు నిజం. అదే స్వాగతించదగిన విషయం.
ఉభయ చంద్ర విన్యాసం
ఈ విధంగా దేశమంతటా మూఢత్వంపైన నిరసన పెల్లుబుకుతుంటే తెలుగు రాష్ట్రాల నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా బిజెపితో పాలన పంచుకుంటుంటే, చంద్రశేఖర రావు కూడా వారిని ఆకట్టుకోవడానికి ఆరాటపడుతున్నారు. వారిని మించిపోయి యజ్ఞయాగాలలో మునిగితేలుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో దేశాధినేతలను తన యాగానికి ఆహ్వానించి వచ్చారే గాని ఆత్మహత్య చేసుకున్న వందలాది రైతులకు సహాయం అందించేందుకు రమ్మని పిలవలేదు. ఇక అమరావతికి మట్టి, నీరు తెచ్చి సరిపెట్టిన మోడీ సర్కారు ప్రత్యేక హోదా ప్రసక్తి లేదని తేల్చిచెప్పినా చంద్రబాబు నాయుడు నిలదీయడం లేదు. పైగా ఆ పని చేస్తున్న ప్రతిపక్షాలపైనే దాడి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సహజీవనం వాంఛనీయం, అవసరం. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయంగా పరస్పరం సర్దుబాటు చేసుకుని ఢిల్లీలోని మతతత్వ పాలకులతోనూ చేతులు కలిపి నడవాలని చూడటం మాత్రం పైన చెప్పుకున్న లౌకిక స్ఫూర్తికి పూర్తి భిన్నమైన పరిణామం. నష్టం చేసే విషయం. అమరావతిలోనూ, ఇతర చోట్ల బలవంతపు భూ సేకరణకు నడుం కట్టిన తెలుగు దేశం ప్రభుత్వం ప్రజా నిరసనకు ఆజ్యం పోస్తున్నది. రాజధాని తరలింపు ఉద్యోగులకు వసతి వంటి విషయాలపైనా అస్పష్టతను పెంచుతున్నది. గత పాఠాలు మర్చిపోయి ప్రాజెక్టుల ప్రాధాన్యతలలోనూ, విధాన నిర్ణయాలలోనూ రాయలసీమ వాసులలో అసంతృప్తిని, అశాంతిని పెంచుతున్నది. ఆశా వర్కర్లపై అణచివేత తప్ప పరిష్కారం చూపని తెలంగాణ ప్రభుత్వం కూడా అదే విధమైన నిర్వాకాలకు పాల్పడుతున్నది. తెలంగాణ టిడిపిలోనూ, టిఆర్‌ఎస్‌లోనూ అసంతృప్తులూ, అంతర్గత విభేదాలూ తీవ్రమవుతుండడం బహిరంగంగానే కనిపిస్తున్నది. వరంగల్‌ ఉప ఎన్నికతో బహుశా తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితి తేలిపోవచ్చు. కాగా అమరావతిలో వేసే తదుపరి అడుగులు, ఇతర అంశాలూ బాబు సర్కారు భవితను మరింతగా ప్రభా వితం చేస్తాయి. పెరుగుతున్న ధరలూ, అర్థం కాని అయోమయ పరిస్థితులు ప్రజల ఉద్యమాలను ఇంకా తీవ్రం చేస్తుంటే ప్రచా రాస్త్రాలు అక్కరకు రావు. ఈ నేపథ్యంలో ఉభయ ముఖ్య మంత్రులపై సిబిఐ, ఎసిబి కేసుల భాగోతాలు కమ్ముకోవడం అనుమానాలు పెంచుతున్నది. వాటిపై అధికారిక వివరణ కూడా లేదు. తెలుగుదేశంకు చెందిన కేంద్ర మంత్రి కూడా ఒకటికి రెండుసార్లు కోర్టులలో అక్షింతలు వేయించుకుంటున్నా గప్‌చిప్‌గా నెట్టుకురావాలని చూడటం ఎంతో కాలం కుదరదు.
- తెలకపల్లి రవి