ప్రభుత్వ వైఖరి వల్లే ఆత్మహత్యలు : పి.మధు

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోడితాడిపర్రులో దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న తమ భూములను బలవంతంగా వేలం వేయాలని దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆరుగురు రైతుల్లో మరొకరు బుధవారం ఉదయం మృతి చెందారు.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న వీర్లపాటి చెత్తయ్య(70) బుధవారం ఉదయం మృతిచెందాడు. దీంతో బాధితులు మరింత ఆగ్రహంతో ప్రభుత్వాస్పత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో గుంటూరు-అమరావతి రోడ్డులో ప్రభుత్వాస్పత్రి మార్చురి వద్ద రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖ అధికారుల వైఖరి వల్లే గత్యంతరం లేని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితేర్పడిందన్నారు. ప్రభుత్వంపై రైతులు నమ్మకం కోల్పోయారని తెలిపారు. వందేళ్లుగా సాగుచేసుకుంటున్న వారిని బలవంతంగా నెట్టేశారని, దీంతో తమకు తిండిపెట్టే భూములు లేనప్పుడు తాము జీవించి వ్యర్థమని భావించి ఆత్మహత్య చేసుకునే వరకూ వెళ్లారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణమైన మూడు శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పేదలకు కొత్తగా భూములు ఇవ్వకపోగా దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న భూములను ఏదో రూపంలో లాగేసుకోవడానికి ఏడాది కాలంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న వారికి పట్టాలివ్వాలని, రైతులకు రక్షణ కల్పించాలని, బినామి పేర్లతో వేలంలో పాల్గొని భూములను కాజేయడానికి ప్రయత్నించిన వారిపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా మధు తమ డిమాండ్లను కలెక్టర్‌ ముందుంచారు. వీటిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగావకాశం కల్పిస్తామన్నారు. సాగుదారులకు భూములపై హక్కు కల్పిస్తూ పట్టాలిస్తామన్నారు