ప్రభుత్వ భూదందా సాగదు:రఘు

పారిశ్రామిక అభివృద్ధికే భూసమీకరణ అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టును అడ్డం పెట్టుకుని పరిశ్రమల పేరుతో పెద్దఎత్తున భూములు లాక్కొంటోందన్నారు. అక్కడ వేలాది ఎకరాలను దశాబ్దాల తరబడి స్థానికులు సాగు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ భూదందాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. టిడిపి, కారగ్రెస్‌ నేతలపై జరిగిన తిరుగుబాటే దీనిని నిదర్శనమన్నారు. ప్రభుత్వం బేషరతుగా భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించటానికి ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ లేదన్నారు. స్థానికుల ఐక్యతను దెబ్బతీసి లబ్ధిపొందాలని చూస్తోందన్నారు. ఉపాధి హామీ పథకం పనులకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. తాగు, సాగునీరు లేక ఉపాధి దొరక్క ప్రజలు అలమటిస్తున్న తరుణంలో భూ సమీకరణను తెరపైకి తెచ్చి వారి బతుకుల్ని అతలాకుతలం చేస్తోందని విమర్శించారు. ప్రజలను భూముల నుంచి గెంటేసిన తర్వాత ప్రభుత్వం బావుకునేది ఏమీ ఉండబోదన్నారు.