ప్రపంచబ్యాంకు పథకం ''మేక్‌ ఇన్‌ ఇండియా''

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను రూపొందించిన పథకమం టూ గొప్పగా ప్రచారం చేసుకొంటు న్న ''మేక్‌ ఇన్‌ ఇండియా'' ప్రపంచ బ్యాంకు రూపొందించిన పథకమని స్పష్టమౌతున్నది. 2015 సెప్టెంబ రులో ప్రపంచబ్యాంకు రూపొందించిన ''అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌'' నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. తయారీ సరుకుల ఎగుమతులను, భారతదేశంలో తయారైన సరుకుల పోటీత త్వాన్ని పెంచటానికి సహకరించాలని ప్రధాని మోడీ 2014లో ప్రపంచబ్యాంకును కోరి నట్లు నివేదికకు రాసిన ముందుమాటలో ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్‌ ఒన్నో రుహుల్‌ పేర్కొన్నాడు. ప్రధాని ప్రకటించిన ''మేక్‌ ఇన్‌ ఇండియా'' కార్యక్రమంలో భారతదేశాన్ని సరుకుల తయారీ కేంద్రంగా రూపొందించటం, ఎగుమతులను పెంచటం ప్రధానాంశాలుగా ఉన్నాయి. మోడీ ప్రకటించిన ''మేక్‌ ఇన్‌ ఇండియా'' కార్యక్రమం, ఆయన తమను కోరినట్లు ప్రపంచబ్యాంకు చెప్పిన అంశాలు ఒకటిగానే ఉన్నాయి. మోడీ అప్పటికే ''మేక్‌ ఇన్‌ ఇండియా'' పథకాన్ని ప్రకటించి ఉంటే, ఆ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతూ ప్రపంచబ్యాంకుతో చర్చించి ఉండాలి. కానీ సరుకుల ఎగుమతులు, పోటీతత్వాన్ని పెంచటానికి సహకరించాలని ప్రపంచబ్యాంకుతో చర్చించారు కాబట్టి సరుకుల తయారీ, పోటీతత్వాన్ని పెంచటానికి సహకరించాలని మోడీ కోరిన తర్వాత, ప్రపంచబ్యాంకు తన సంస్కరణల అమలును వేగవంతం చేయాలని మోడీపై ఒత్తిడిని పెంచింది. తక్షణమే అమలు చేయాల్సిన సంస్కరణల జాబితాను మోడీకి ఇచ్చి, ''మేక్‌ ఇన్‌ ఇండియా'' పేరుతో అమలు జరపమని ఆదేశించారు. తన ఆదేశాలను ఆ దేశాల పాలకుల కార్యక్రమాలుగా అమలు జరపమని ప్రపంచ బ్యాంకు ఆయా దేశాల పాలకులకు సలహాలిస్తుంది. కాబట్టి ప్రపంచబ్యాంకు ఆదేశాలను తమ బుర్రలో పుట్టిన గొప్ప ఆలోచనలుగా ప్రచారం చేసుకొంటూ పాలకులు అమలు చేస్తుంటారు. 1997లో మన రాష్ట్రంలో మొదటగా ప్రపంచ బ్యాంకు సంస్కరణల అమలును ప్రారంభించినప్పుడు చంద్రబాబునాయుడు ప్రపంచబ్యాంకు పథకాలను తన ఆలోచనలుగా ప్రచారం చేసుకోవటం, తర్వాత ప్రపంచ బ్యాంకు షరతులు వెల్లడికావటంతో ఆయన పథకాల బండారం బట్టబయలు కావటాన్ని చూశాం. ఆ విధంగానే ఇప్పుడు మోడీ ప్రపంచబ్యాంకు సంస్కరణలను తన స్వంత కార్యక్రమంగా ''మేక్‌ ఇన్‌ ఇండియా'' పేరుతో అమలు చేయటానికి పూనుకున్నారు. అందువల్లనే డిసెంబరులో జరిగిన ''మేక్‌ ఇన్‌ ఇండియా'' వర్క్‌షాపులో 98 అంశాలతో కూడిన సంస్కరణల కార్యక్రమాన్ని ప్రపంచబ్యాంకు రూపొందించింది. ఇప్పుడు వాటి అమలు తీరును సమీక్షిస్తూ తిరిగి నివేదికను తయారు చేసింది.
మోడీ 2014 సెప్టెంబరు 25న ''మేక్‌ ఇన్‌ ఇండియా'' పథకాన్ని ప్రకటించారు. 2014 డిసెంబరు 29వ తేదీన ''మేక్‌ ఇన్‌ ఇండియా'' అమలును వేగవంతం చేయటం కోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డిఐపిపి) వర్క్‌షాపు జరిపింది. ఈ వర్క్‌షాపులో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, పారిశ్రామికవేత్తలు, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో రాష్ట్రాల స్థాయిలో అమలు జరపాల్సిన సంస్కరణలకు సంబంధించి 98 అంశాల కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ 98 అంశాలను ఏ రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేశాయో 2015 జూన్‌లో పరిశీలించి ర్యాంకులివ్వాలని నిర్ణయించారు. ఆ విధంగానే రాష్ట్రాలు సంస్కరణలను అమలు జరిపిన తీరును పరిశీలించి రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయిస్తూ 2015 సెప్టెంబరులో ప్రపంచబ్యాంకు నివేదికను రూపొందించింది.
సరళీకరణ విధానాల అమలులో భాగంగా ద్రవ్య పెట్టుబడులకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆటంకాలను తొలగించాలని సామ్రాజ్యవాదులు ఒత్తిడిని తీవ్రం చేస్తున్నారు. దేశ, విదేశీ పెట్టుబడిదారుల కోర్కెలకు అనుగుణంగా ''మేక్‌ ఇన్‌ ఇండియా'' పేరుతో సంస్కరణలను వేగవంతం చేయటానికి బిజెపి ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే 2013లో పార్లమెంటు ఆమోదించిన భూ సేకరణ చట్టానికి సవరణలు చేయటం కోసం మూడుసార్లు ఆర్డినెన్స్‌ను జారీచేసింది. రాజ్యసభలో మెజారిటీ లేకపోవటం, బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ప్రభుత్వరంగ సంస్థల షేర్ల అమ్మకాన్ని వేగవంతం చేయటం, పిఎఫ్‌ నిధులను షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టటానికి నిర్ణయించటం, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల రాకకు ఉన్న పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచటం, రైల్వేలలో మౌలిక వసతుల కల్పన రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ప్రవేశం కల్పించటం, తదితర చర్యలు తీసుకున్నారు. కేంద్రంలో సంస్కరణల అమలును వేగవంతం చేయటంతో పాటు, సంస్కరణలను వేగంగా అమలు జరపాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నారు.
రాష్ట్రాలలో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల ప్రభుత్వాలు మాత్రమే కాక, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, సంస్కరణల అమలు విషయంలో ముందే ఉంటున్నారు. సంస్కరణల అమలును వేగవంతం చేయటం వల్ల రైతుల నుంచి భూములు లాక్కోవటం, కార్మిక చట్టాలకు సవరణలు చేసి, కార్మికుల హక్కులను హరించటం తీవ్రం అవుతున్నది. ప్రజలపై భారాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ప్రపంచబ్యాంకు సంస్కరణలను అమలు చేయటంలో దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెండవ స్థానాన్ని పొందింది. రాష్ట్రంలోకి పరిశ్రమలు వెల్లువలా రాబోతున్నాయని, ఆ పరిశ్రమలకు కేటాయించటానికి ప్రభుత్వం వద్ద భూములుండాలని, అందుకోసం 15 లక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ, రైతుల వద్ద భూములు లాక్కుంటున్నారు. రాష్ట్రంలో నిర్మించబోతున్నామని చెబుతున్న బందరు ఓడరేవు, భోగాపురం విమానాశ్రయం, తదితరాలకు వాస్తవంగా అవసరమైన దానికన్నా పది రెట్లకు మించి అదనంగా భూములు తీసుకుంటున్నారు. ఈ భూములతో మంత్రులు, అధికార పార్టీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు.
మన రాష్ట్రంలో అమలు జరుపుతున్న తీరులోనే దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా సంస్కరణల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది. ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసిన తర్వాత రాష్ట్రాలకు నిధుల కేటాయింపును కేంద్రం తన చేతిలో పెట్టుకొని, సంస్కరణలు అమలు జరపని రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నది. రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను సంస్కరణలను వేగవంతం చేయటానికి, తమ రాజకీయ అవసరాలను నెరవేర్చుకోవటానికి వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్య పెట్టుబడులకు నమ్మకమైన ప్రతినిధిగా పనిచేస్తూ, దేశ, విదేశీ పెట్టుబడిదారులు దేశ సంపదను కొల్లగొట్టటానికి మార్గాన్ని సుగమం చేస్తున్నది.
''మేక్‌ ఇన్‌ ఇండియా'' ప్రపంచబ్యాంకు పథకమే అయినా పరిశ్రమలు వచ్చి, ఉత్పత్తి, ఎగుమతులు పెరిగితే దేశం అభివృద్ధి చెందుతుంది కదా అని భావించేవారున్నారు. ప్రపంచబ్యాంకు మనదేశానికే కాదు. తన ఉచ్చులో పడిన ప్రతిదేశానికీ ఇదే విధమైన సంస్కరణల అమలు కార్యక్రమాన్ని ఇస్తున్నది. అందుకోసం ఇటువంటి పేర్లతోనే పథకాలు రూపొందించి, వారి స్వంత పథకాలుగా అమలు చేయమని చెబుతున్నది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించుకోవాలని ఆంక్షలు పెడుతూ, ద్రవ్యపెట్టుబడులు ప్రజల కొనుగోలుశక్తిని క్షీణింపజేస్తున్నాయి. 
మరోవైపు ''మీ దేశంలో సంస్కరణలు అమలు చేయండి. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి. ఎగుమతులు పెరుగుతాయి'' అని చెబుతున్నది. అన్ని దేశాలకూ ఇదే చెబుతూ, అందరినీ మభ్యపెడుతున్నది. ప్రజల కొనుగోలుశక్తి తగ్గిపోయి అన్ని దేశాలూ మాంద్యంలో కూరుకుపోతుంటే, అన్ని దేశాల్లో ఉన్న పరిశ్రమలు మూతబడటం, ఉద్యోగులను తొలగించటం చేస్తుంటే కొత్తగా పరిశ్రమలు పెట్టి, ఉత్పత్తి అయిన సరుకుల్ని ఎక్కడికి ఎగుమతి చేస్తారు? ఎక్కడ అమ్ముతారు? అందువల్ల ప్రపంచబ్యాంకు సంస్కరణలు ఆయా దేశాలను అభివృద్ధి చేయటానికి దోహదం చేయవు. వారి సంపదలను ద్రవ్య పెట్టుబడులు దోచుకోవటానికి మార్గాన్ని సుగమం చేస్తాయి.
ప్రపంచబ్యాంకు నివేదికలో సంస్కరణలను అమలు జరపటంలో భారతదేశం 189 దేశాలలో 142వ స్థానంలో ఉందని చెప్పారు. 2017 నాటికి మొదటి 50 దేశాలలో స్థానం సంపాదించుకోవటం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. 142వ స్థానంలో ఉంటేనే భూములు లాక్కుంటున్నారు. కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తున్నారు. సేవల పన్నులు, ఇతర పన్నుల పేరుతో ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నారు. 
ఇక 50వ స్థానంలోకి వస్తే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో? కాబట్టి అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, మధ్యతరగతి ప్రజానీకం మేల్కొని కార్మిక, కర్షక వర్గాల్ని, ప్రజలను చైతన్యపరచి, ఈ సంస్కరణలను ప్రతిఘటించకపోతే మన దేశం అధోగతికి దిగజారిపోతుంది.
- ఎ కోటిరెడ్డి