పోలీస్ కేసులకు భయపడొద్దు:మధు

'పోలీసు కేసులకు భయపడితే ఎయిర్‌పోర్టుకు భూములు పోవడం ఖాయం. కేసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది.' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. గురువారం ఆయన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఒకటైన కౌలువాడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడారు. ప్రజాప్రతిఘటన ముందు అన్నీ బలాదూరేనని అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు కావాలని ప్రభుత్వం తొలుత చెప్పిందని, ప్రజల తిరుగుబాటుతో వెనక్కి తగ్గి 5,551 ఎకరాలకు దిగివచ్చిందని తెలిపారు. చంద్రబాబు పేదల భూములతో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు కార్పొరేట్‌ కంపెనీలకు భూములు అప్పగించే పనిలో పడ్డారని విమర్శించారు. భూములను ప్రభుత్వం లాక్కొంటే చిన్న, సన్నకారు రైతులు బతకలేరని అన్నారు. ఎయిర్‌పోర్టు వద్దని ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తానని, అక్రమ కేసుల్లో ఉన్న 23 మందిని బయటకు తెచ్చే బాధ్యత సిపిఎం తీసుకుంటుందని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు వల్ల ప్రజలకు నష్టమని, చంద్రబాబుకు లాభమని తెలిపారు. అందుకే ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భూములు లాక్కొనేందుకు ప్రభుత్వం సిద్దపడుతోందన్నారు.