పోలవరం ముంపు మండలాల్లో 20న బంద్‌కు పిలుపు..

ముంపు మండలాల సమస్యలపై ఈనెల 20వ తేదీన బంద్‌ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ముంపు మండలాల్లో స్థానిక సిపిఎం నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. కనీసం అధికారుల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వెంటనే ఆర్‌డిఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామాలకూ రెవెన్యూ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. ముంపునకు గురవుతున్న ఆరు మండలాల పరిధిలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలూ ఏర్పాటు చేయలేదని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రాంభమై మూడునెలలు గడుస్తున్నా ఇంతవరకు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయలేదని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు రావడం లేదని, విద్యార్థులు నిర్వహించుకునే హాస్టళ్లలో పరిస్థితి మరీ దయనీయంగా ఉందని చెప్పారు.