'పెట్టుబడి' గ్రంధాన్ని చదవాలి

పెట్టుబడి దారి వ్యవస్థలో పాలకులు అవలంభిస్తున్న వైఖరి వల్ల దేశంలో దోపిడీ, ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ పేర్కొన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'పెట్టుబడి గ్రంథం ప్రాముఖ్యత' అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు జరిగింది. శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో శర్మ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారి వ్వవస్థ నుంచి మార్పును, విప్లవాన్ని కోరుకునే వారు తప్పని సరిగా కారల్‌ మార్క్స్‌ రాసిన పెట్టుబడి గ్రంధం చదవాలని కోరారు. పెట్టుబడీదారీ విధానానికి జీవకణం సరుకు అని, నీటిని, అంతరిక్షాన్ని సరుకుగా మార్చి సంపదగా కొంత మంది దోచుకుంటున్నారని అన్నారు. మానవ శ్రమ లేకుండా సరుకు ఉండదని, శ్రమను బట్టే సరుకు విలువ ఇస్తున్నారని తెలిపారు. సరుకును సృష్టిస్తున్న కార్మికుడికి దానిని అనుభవించే హక్కు లేకుండా చేస్తూ అందరి శ్రమను కొల్లగొడుతున్నారని చెప్పారు. .కార్మికులకు శ్రమశక్తిని ఇవ్వకుండా, రైతుల పంటకు ధర రాకుండా పెట్టుబడీదారులు దోచుకుంటున్నారని వివరించారు. తోటి పెట్టుబడీ దారులను సైతం కూల్చే స్వభావం దీనికి ఉంటుందన్నారు. 2008 ఆర్థిక సంక్షోభం అమెరికాలో ఇంకా కొనసాగుతుందన్నారు. ఆకలి, వైద్యం, ఆరోగ్యం వంటి సమస్యలను సోషలిస్టు దేశాలు అధికారంలోకి వచ్చిన 15ఏళ్లల్లోనే రూపుమాపాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడీ కోసమే మోడీ ఒకే దేశం ఒక పన్ను పేరుతో జిఎస్టీ తీసుకొచ్చారని వివరించారు. జిఎస్టీ వల్ల చిన్న చిన్న వ్యాపారవేత్తలు దివాళా తీస్తున్నారని చెప్పారు. దేశ సంపదలో 53శాతం కేవలం 10మంది వద్దే పొగుపడి ఉందని, వీరే బ్యాంకులకు రూ.లక్షలకోట్లు ఎగ్గొట్టారని వివరించారు. ప్రభుత్వం మాత్రం వీరికే పన్ను రాయితీలను కల్పిస్తుందన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ తగ్గుతున్నా, పెట్రోల్‌, డిజీల్‌ ధరలను తగ్గించకుండా మోడీ ప్రభుత్వం రూ.5లక్షల కోట్లను సామాన్య ప్రజల నుంచి కొల్లగొట్టిందన్నారు. పెట్టుబడి దారులను పక్కన పెట్టి కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకొస్తే భారతదేశం అగ్రదేశంగా ఉంటుందని చెప్పారు. 1950లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే భూములు లాక్కుంటారనే ప్రచారం చేశారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల భూములు ఊడగొడుతూ రాష్ట్రవ్యాప్తంగా 13లక్షల ఎకరాలు లాక్కున్నారని వివరించారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ పేదలకు, కార్మిక వర్గానికి ప్రతినిధులని, వారి పక్షానే పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. కార్మిక వర్గం పోరాటం ద్వారానే సోషలిజం వస్తుందని, విప్లవం కావాలని కోరుకునే వారు మార్క్స్‌ రచించిన పెట్టుబడీ దారీ గ్రంధాన్ని తప్పకుండా చదవాలని సూచించారు.