పింఛన్ల నిలిపివేత..దళితుల ఆవేదన

రాజధానికి శంకుస్థాపన జరిగిన గ్రామాల్లో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. పేదలకివ్వాల్సిన పెన్షన్లు ఎగ్గొట్టేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఇటీవల నిరు పేద దళితులకు పొలాలున్నాయంటూ పెన్షన్లు ఆపేశారు. ఈ సమస్య శంకుస్థాపన చేసిన గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. పేద దళితులకు కనీసం పని కూడా కల్పించటం లేదు. వారిలో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తమకు పొలాలు లేకపోయినా ఉన్నాయనే పేరుతో పెన్షన్లు ఎత్తేశారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలినెలలో అర్హులుగా గుర్తించి, రెండోనెల నుండి పింఛన్లు ఇవ్వడం లేదని, అదేమంటే తమకు పొలాలున్నాయని అంటున్నారని పేదలు వాపోతున్నారు. పొలాలు ఎక్కడున్నాయో చెబితే దానికి తగిన విధంగా పరిహారమూ, కౌలు చెల్లించాలని వారు కోరుతున్నారు.