''పాలకులే'' పీడకులైతే..

 ''పాలకులు మారినంత మాత్రాన ప్రజలకేమీ ఒరగదు. దోపిడీ వర్గాలు తమ సాంస్కతిక భావజాలాల ద్వారా ప్రజా జీవితాన్ని ప్రస్తుత దుర్భర స్థితిలోనే కొనసాగించడానికి సర్వప్రయత్నాలూ చేస్తూ ఉంటాయి. పీడితవర్గ పక్షపాత దక్పథం కలిగిన నాయకులు అధికారం చేపట్టాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది'' అని ఇటలీ తత్వవేత్త ఆంటోనియో గ్రాంసి అన్నారు. అతి పెద్ద దేశాలలో ఒకటైన మన దేశంలో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. ఒకటి రెండు రాష్ట్రాలలో తప్ప అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ పాలక ముఖ్యులు 'ముఖ్య కార్యనిర్వాహక అధికారులు'గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనే కాదు పార్టీలలోనూ ప్రజాస్వామ్యం అడుగంటింది. అందరూ రాజులుగా, చక్రవర్తులుగా నిజం చెప్పాలంటే నియంతత్వమే నిత్యకత్యంగా రాజ్యాలేలుతున్నారు. రాజ్యాంగాన్ని బహిరంగంగానే బహిష్కరిస్తున్నారు. ప్రపంచ వేదికల మీద ఆ పదవుల స్థాయినే దిగజార్చుతున్నారు. 'జాతీయ న్యాయ నియామక బందం' రాజ్యాంగ విరుద్ధమని దాన్ని రద్దు చేసి 'కొలీజియం'ను పునరుద్ధరించమని భారత ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. నిజానికి ఈ రెండు వ్యవస్థల లోనూ లోపాలున్నాయి. వీటిని సవరించాలి. సంస్కరణలకు రెండు మార్గాలు. ఉన్న దాన్ని సరిదిద్దుకోవడం, కొత్త దాన్ని నిర్మించుకోవడం. సమయం, సందర్భాలను బట్టి వీటిలో ఏది మంచి పద్ధతి అన్నది ఆధారపడి ఉంటుంది. మొదటి పద్ధతిలో ఎంతో కొంత మేలే జరుగుతుంది. సంస్కర్తల స్వభావ, గుణగణాలు సందేహాస్పాదమైనవయితే రెండవ పద్ధతి అతి ప్రమాదకరమైనది. గత 18 నెలల్లో దేశంలో జరిగిన చారిత్రక, సాంస్కతిక, శాస్త్ర విజ్ఞాన, విద్య, పరిశోధనా సంస్థల అధిపతుల నియామకాలు దీన్ని నిరూపించాయి. 'జాతీయ న్యాయ నియామక బ ంద' నిర్మాణం పాలక వర్గానికి నియంతత్వ అధికారాలను కట్టబెట్టేదిగా ఉందని విజ్ఞుల అభిప్రాయం. దీనితో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడుతుందేమో!?
ప్రజాస్వామ్య పరిరక్షణాంగాలలో ఒక దాని కార్యక్రమాచరణలో ఇంకొకటి తలదూర్చకూడదని నియమం. చట్టసభలు రాజ్యాంగ పరిధిలోనే చట్టాలు చేయాలని, ఆ చట్టాలపై వ్యాఖ్యానించటం తప్ప వాటిని మార్చే, రద్దు చేసే అధికారం న్యాయవ్యవస్థకు లేదని రాజ్యాంగ నిబంధన. ప్రజా ప్రతినిధుల సభలైన చట్టసభలే మహోన్నతమైనవి. అయితే ఈ విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ''పెద్దలను గౌరవించవలెను'' అన్నది నీతి. ఈ పెద్దలు గురువులేనా? వీరు ఎంతటి అక్రమాచార్యులైనా, అవినీతి చక్రవర్తులైనా, సమాజ వినాశకులైనా ఈ నీతి వాక్య ఆచరణ జరగవలసిందేనా? స్వాతంత్య్రానికి ముందు, అటు తర్వాత కొంత కాలం దేశభక్తి కలిగినవారు, ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం మెండుగా ఉండేది. తర్వాత తమ స్వార్థప్రయోజనాలకై ప్రజాప్రతినిధుల అవసరాలను గుర్తించిన వర్గం వీరికి ఎన్నికలలో ''సహాయం'' చేసేది. వీరి చుట్టూ తిరిగి విసిగి పోయిన ఆ వర్గం చివరికి తామే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశాలను ఉపయోగించుకుంది. ఎన్నికల ప్రక్రియ కోట్ల రూపాయల వ్యాపారమయింది. వ్యాపారంలో లాభాపేక్ష అనివార్యం. ఈ సంతలో ప్రజలు, దేశం సర్వనాశనమైనా పట్టించుకునే ''నాథుడు'' లేడు. సరిగ్గా ఇక్కడే ప్రజా సేవకులు, దేశ నిర్మాతలు గాక స్వప్రయోజన దార్శనికులు, దేశ వినాశకులు చట్టసభల్లో ప్రవేశించడం మొదలైంది. రాను రాను 'పుచ్చిన వారు' 'కుళ్ళిన వారు' మాత్రమే ఎంపికకు ప్రజల ముందుకొస్తున్నారు. అనర్హులతో నిండిన చట్టసభలకు కూడా ''ప్రాధాన్యతలు'' కొనసాగవలసిందేనా? రాజు దుర్మార్గుడైనా సహించవలసిందేనా? దుర్మార్గులను మార్చే ప్రయత్నాలు చేయవలసిన బాధ్యత పౌర సమాజానిది.
అసలు ప్రజాప్రతినిధులే కాని వారిని, ఎగువ సభ సభ్యులను మంత్రి వర్గంలో చేర్చుకునే నిబంధనను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ ఏర్పాటు ద్వారా 'ఎన్నికలలో పోటీ చేసే ఆసక్తి, గెలిచే స్థోమత లేని పలు రంగాల నిపుణులను, ప్రజా ప్రయోజకులను ప్రజాసేవలో నిమగం చేయడమే' రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. అయితే అసమర్థులైన అస్మదీయులను అందలమెక్కించుకునే దురాచారానికి ఇది తెర లేపింది. అధికార పార్టీలు తమ ''బలం''తో అనర్హతను అర్హతగా మార్చుకుంటున్నాయి. ఇంకా విచిత్రమేమంటే ప్రజల చేతుల్లో ఘోర పరాజయానికి గురైనవారు కూడా చట్ట నిర్మాతలుగా మారుతున్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అనేక ప్రలోభాలకు, స్వలాభాలకు లోనై ప్రజలను మరిచి పోతున్నారు. నీతిబాహ్య ప్రవర్తన, ఓటుకు నోట్లు, ప్రశ్నలకు పైసలు, అవసర సమయంలో 'వాకౌట్‌'లు, అభిప్రాయ మార్పులు, అవకాశవాద రాజకీయాలు, అమెరికా ఆదేశిత పరిపాలన దీని ఫలితమే. 'జీతం ఉద్యోగంలో ఉన్నందుకు, లంచం పని చేసినందుకు', 'ఈ రోజుల్లో ఇది మామూలే' అనే భావనలకు వీళ్ళు నిర్మాతలు. వీరి చేతుల్లో పేదలే పావులు. ఈ పరిస్థితుల్లో చట్టసభలకు పవిత్రత ఉంటుందా? అని సామాన్యుని ప్రశ్న. ఈ అపవిత్రతకు కారణం నీవే కదా? అని ''ప్రతినిధుల'' 'ఉత్త'ర ప్రశ్న. ప్రజలను చైతన్యవంతులను చేయడం రాజ్యాంగ బద్ధ పాలక బాధ్యత కదా? పాలకులే కీచకులైతే ఎలా? అని అమాయకుల ప్రశ్న. పౌరసంఘాలు, ప్రజాపార్టీలు తమ విధి నిర్వహణలో విఫలమయ్యాయని పడక కుర్చీ పండితుల నింద. గత 30 సంవత్సరాలుగా భారత పౌర నిర్మాణ వేదికలైన విద్యాలయాలు మొదలు అనేక రంగాలు నిర్వీర్యం, నిష్ప్రయోజనం, ప్రజా వినాశకం చేయబడ్డాయి. ఈ విషపూరిత వ్యవస్థలలో తయారైన జనం జనహితాన్ని కోరే ప్రతినిధులను ఎలా ఎన్నుకోగలదు? ఈ జన వినాశక ప్రతినిధుల చట్టసభలు ప్రజాహిత చట్టాలనెలా చేయగలవు? సమాజ దురవస్థకు రోగగ్రస్తమైన రాజకీయ వ్యవస్థ కారణం. దీని ప్రక్షాళన మన చేతుల్లోనే ఉంది. ఇందుకు ప్రాయోజిత సమాజ నిర్మాణం జరగాలి. ఇప్పటికైనా మేల్కొని చైతన్య కార్యక్రమాలు మొదలు పెట్టాలి. విద్యాలయాలలో చొరబడి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం మొదటిది. దీనికి ప్రయివేటు విద్యాలయాల యాజమాన్యాలు సహకరించవు. అన్యధోరణులను అలవాటు చేసుకున్న అధిక సంఖ్యాక అయ్యవార్లు మాత్రం సహిస్తారా? ప్రపంచీకరణ ప్రక్రియలలో యువత కొన్ని ''సుగుణాలను'' సంతరించుకుంది. భావజాల మార్పుకు, సమన్వయ సాధనకు, సమాజ శ్రేయస్సుకు యువతతో భావాలను పంచుకొని కలిసి పయనించగల నేర్పు, సమయం నేటి ''పెద్దలకు'' లేదు. దంపతులుగా మారబోతున్న యువకులకు ఆదర్శ వైవాహిక, దాంపత్య జీవితాలు, వాటి అవసరాలను గురించి తెలియ పరచాలి. సమాజ ప్రయోజకులైన సంతానాన్ని పెంచవలసిన అవసరాన్ని తెలిపి, ఆ విధానాలలో శిక్షణనివ్వాలి. ఈ విధమైన గుణగణాలను సంతరించుకున్న ప్రజలే సమాజాన్ని గురించి ఆలోచించగలరు. సమాజ ప్రయోజకులైన ప్రతినిధులను ఎన్నుకోగలరు. ఈ కోవకు చెందిన ప్రతినిధులే రాజ్యాంగ వర్గ దక్పథాన్ని సవరించగలరు. పీడిత ప్రజలకు ప్రయోజనం చేకూర్చగల చట్టాలను చేయగలరు. క్రమశిక్షణా రాహిత్యంలో, అప్రజాస్వామిక పద్ధతులలో, మత్తులో మునిగిన సమాజంలో తమ హితాన్ని చూసుకునే ప్రజాకంటకులైన పాలకులు ఈ పనులు చేయరు. సమాజం నుంచి ప్రయోజనాలు పొంది ఉన్నత స్థితిలోనున్న ప్రజలు, ప్రగతిశీల సంఘాలు, ప్రజా రాజకీయ పక్షాలు ఈ కార్యక్రమాలను తమ విధిగా భావించాలి. ఈ పనులకు పూనుకోవాలి. ప్రత్యామ్నాయాలను నిర్మించి ప్రజలకు అందించవలసిన బాధ్యత కూడా వీరిదే. లేకపోతే రాక్షసులైన ''రాజులు'' తమ అమానవీయ అనుచరగణంతో మొత్తం సమాజాన్ని భయభ్రాంతుల పాలుజేసి, నాశనం చేయగలరు.
- సంగిరెడ్డి హనుమంత రెడ్డి 
(వ్యాసకర్త అఖిల భారత అభ్యుదయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)