పనులు లేకున్నా మద్యం తాగబోస్తున్నారు..

పనులు లేకుండా ఇళ్లల్లోని మగాళ్లతో మద్యాన్ని తాగబోస్తున్నారని అన్నవరప్పాడు మహిళలు వాపోయారు. పిల్లలను పోషించేందుకు అంతులేని అగచాట్లు పడుతున్నామని, కాస్తో కూస్తో కూలి డబ్బులున్నా వాటిని మార్చుకోడానికి బ్యాంకుల వద్ద పడే అగచాట్లు అన్నీ ఇన్ని కావని ఆవేదనను వెళ్లగక్కారు. సిపిఎం చేపట్టిన పాదయాత్ర నరసరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం నిర్వహించారు. అన్నవరప్పాడులోని మహిళలు సిపిఎం బృందానికి తమగోడు వెళ్లబోసుకున్నారు. విద్యుత్‌ 50 యూనిట్లయితే బిల్లు లేదని చెప్పినా తమ వద్ద వసూలు చేస్తున్నారని, పనుల్లేక మిర్చి తోడాలు తీయడానికి వెళ్తే ఊపిరి తిత్తుల సమస్యలు వేధిస్తున్నాయని, జ్వరమొచ్చినా మందుబిళ్ల కొనలేని దుస్థితి నెలకొందని కన్నీరు పెట్టుకన్నంత పని చేశారు. ఎస్‌సి కాలనీలో రేషన్‌ దుకాణం లేదని హైవే దాటి వెళ్లాల్సి రావడంతో ప్రమాదాలు పొంచివున్నాయని చెప్పారు. తాగునీరు రాదని, వీధిలైట్లు వెలగడం లేదని, ఇటీవల మహిళకు తేలు కుడితే రూ.30 వేలు ఖర్చయిందని వీరవట్నం ఎస్‌సి కాలనీ వాసులు బావురుమన్నారు. ఆరుతడి పంటలేసినా అప్పులే మిగిలాయని చెప్పారు.
తుంగపాడులోని పొలాలను సిపిఎం బృందం పరిశీలించగా తమ సమస్యలు విన్నవించుకుని సాగుదార్లు ఆవేదనకు గురయ్యారు. పంటకు దీటుగా కలుపు పెరిగి ఎకరాకు 70 మంది కూలీలను పెట్టాల్సి వస్తోందని, ఇక్కడ లాభం లేదని తెలంగాణకు వెళ్లి పత్తి సాగుచేస్తే మూడేళ్లు వరుసగా నష్టాలొచ్చాయని కౌల్దారు వాపోయాడు. కష్ణనష్టాలకోర్చి సాగు చేపట్టినా వర్షాలెక్కువై ఒకసారి, సాగునీరందక మరోసారి భారీ నష్టాన్ని చవిచూశానని పాలపాడుకు చెందిన కౌలురైతు దావల కోటయ్య గొల్లుమన్నాడు. మోటార్ల ద్వారా పొలానికి నీరు పెట్టుకోవాలంటే కిరాయి రూ.3500 వరకు అవుతోందని, ఏ పంటలు వేసినా నష్టాలే వస్తున్నాయని మరింకొదరు సాగుదార్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పచ్చవ రామారావు, రామకృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభుత్వాల విధానాలు కష్టం చేసుకునేవారి కాళ్లు విరగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. వాటికి వ్యతిరేకంగా సిపిఎం నిర్వహించే పోరాటంలో భాగస్వామ్యమవ్వాలన్నారు.