పచ్చని పల్లెలను విషతుల్యం చేయడమే అభివృద్ధా ?

భీమిలి మండలం చిప్పాడలో దివీస్‌ లేబొరేటరీస్‌ యూనిట్‌ 3 విస్తరణ ద్వారా పచ్చని పల్లెలు విషతుల్యమవుతాయని, అటువంటి అభివృద్ధిని ఎవ్వరూ కోరుకోరని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి అన్నారు. యూనిట్‌ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో సిటీ నగర్‌ జంక్షన్‌లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ప్రభావతి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను కాలుష్యంతో నింపడమేనా చంద్రబాబు అభివృద్ధి అని ప్రశ్నించారు. వాతావరణానికి హాని లేని, ఉపాధికి కొదువ లేని పరిశ్రమలనే ప్రజలు ఎప్పుడూ కోరుకుంటారని తెలిపారు ఇష్టారాజ్యంగా ఫార్మా కంపెనీల ఏర్పాటుతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత్య్స సంపద నశించిపోతుండటంతో మత్య్సకారులు వేటకు, ఉపాధికి దూరమవుతున్నారన్నారు. దివీస్‌లో స్థానికులకు ఉద్యోగావకాశాలు ఎండమావిగానే మిగిలాయన్నారు. నమ్మివానిపాలెం, కొసనవానిపాలెం గ్రామాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున సోమవారం దీక్షలు చేపట్టారు. సిపిఎం డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ కన్వీనర్‌ రవ్వ నర్సింగరావు, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కన్వీనర్‌ పేడ్డ రమేష్‌, సభ్యులు రవ్వ అప్పలరాము, కొసన రాము, అప్పలరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.