ధరల పెరుగుదల-పిడిఎస్‌ ప్రాధాన్యత

నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగిపోతున్నాయి. గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగాయి. ఇప్పుడు కందిపప్పు ధరలు ఆ విధంగానే పెరుగుతున్నాయి. మార్కెట్‌లో కిలో రూ.15 నుంచి రూ.20 లభించే ఉల్లిపాయల ధరలు రూ.80 దాటి పెరిగి, ఇప్పుడు రూ.25-30 వద్ద ఉన్నాయి. రూ.80-90 కందిపప్పు ధర గత నాలుగు మాసాల నుంచి పెరుగుతూ కోడిమాంసం ధరలను దాటి, ఏటమాంసం ధరలను అందుకొనే వైపుగా పరుగులు తీస్తున్నది. ఇతర పప్పుల ధరలు కూడా ఈ విధంగానే పెరుగుతున్నాయి. ఈ సరుకుల ధరలు పెరగటానికి కారణమేమిటి? ఏ సరుకైనా ఎక్కువగా ఉత్పత్తి జరిగి, మార్కెట్‌లో కావలసినంత మొత్తం అందుబాటులో ఉంటే ధరలు తక్కువగా ఉంటాయని, తగినంత ఉత్పత్తి జరగక, కొరత ఏర్పడితే ధరలు పెరుగుతాయని బడా వ్యాపారులు ప్రచారం చేస్తుంటారు. ప్రభుత్వం ఏ సరుకు ధర విషయంలోనూ జోక్యం చేసుకోకుండా అన్నింటినీ మార్కెట్‌కు వదిలివేయాలని, మార్కెట్టే సర్వస్వాన్నీ నిర్ణయిస్తుందని, ధరలపై ప్రభుత్వ నియంత్రణను రద్దుచేస్తే సరుకులు కారుచౌకగా ప్రజలకు లభిస్తాయని సరళీకరణవాదులు ప్రచారం చేస్తున్నారు. ప్రజాపంపిణీ విధానం ద్వారా పేద ప్రజలు పొందే సరుకులకు మారుగా, నగదు బదిలీ పథకం ద్వారా డబ్బులిస్తే ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారని, చౌక ధరల దుకాణాలలో నాణ్యతలేని సరుకులిస్తున్నారని, తూకం సరిగా ఉండటం లేదని ప్రచారం చేస్తున్నారు. సరుకులకు బదులుగా డబ్బులు తీసుకుంటే ప్రజలు తమ ఇష్టం వచ్చిన చోట నాణ్యమైన సరుకులు కొనుగోలు చేసుకోవచ్చునని, చౌక ధరల దుకాణాల వల్ల ఉపయోగంలేదని చెబుతున్నారు. ప్రజా పంపిణీ విధానాన్ని రద్దు చేయటం కోసం పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దుచేస్తే సరుకుల ధరలు ఏ విధంగా పెరుగుతాయో కందిపప్పు, ఉల్లిపాయల ధరలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ధరలు పెరగటానికి ఆ సరుకులు అవసరమైనన్ని లేకపోవటం కారణం కాదు. బడా వ్యాపారులు, అక్రమ నిల్వదారులు అనుసరిస్తున్న విధానాలే కారణం. ప్రస్తుతం కందిపప్పు ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా మార్కెట్టో ఆగస్టు నుంచి కందిపప్పు ధరలు పెరగటం ప్రారంభమై అక్టోబరు వచ్చేసరికి రూ.210 చేరింది. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి మన అవసరాల కన్నా తక్కువగా జరుగుతున్నది. 35 నుంచి 40 లక్షల టన్నుల పప్పుధాన్యాలను ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో కందుల ఉత్పత్తి 2012-13లో 30,20,700 టన్నులు కాగా, 2014-15లో 27,50,000 టన్నులు ఉంది. దిగుమతులు 5,06,000 టన్నుల నుంచి 4,43,000 టన్నులకు తగ్గాయి. 2012-13తో పోల్చుకున్నప్పుడు 2014-15లో కొరత 3,13,000 టన్నులు మాత్రమే. ఇది మొత్తం వినియోగంలో 10 శాతం కన్నా తక్కువగానే ఉంది. 10 శాతం కొరత వల్ల 150 శాతానికి పైగా ధరలు పెరిగాయి. 10 శాతం కొరతే 150 శాతానికి పైగా ధరలు పెరగటానికి కారణమైతే, పెసలు, మినుములు, తదితర పప్పుధాన్యాల లభ్యత అవసరానికన్నా ఐదు శాతం మాత్రమే తక్కువగా ఉన్నాయి. వాటి ధరలు కూడా ఇదే మోతాదులో ఎందుకు పెరుగుతున్నాయి? ధరలు ఇంతగా పెరగటానికి కొరత కారణం కాదు. కొరతే కారణమైతే పది లేదా పదిహేను శాతం ధరలు పెరగవచ్చు. బడా పెట్టుబడిదారులు, అక్రమ నిల్వదారులు అధిక లాభాల కోసం చేస్తున్న ప్రయత్నాలు, వారికి సహకరిస్తున్న ప్రభుత్వ విధానాలే ఇంత పెద్దమొత్తంలో ధరలు పెరగటానికి కారణం. అక్రమ నిల్వలను వెలికితీసి, ధరలను తగ్గించటానికి చర్యలు తీసుకోకపోగా, అక్రమంగా ధరలు పెంచుతున్న వ్యాపారులతో ఒప్పందం చేసుకొని కిలో రూ.140 అమ్ముకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. క్వింటాలు కందులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.3,000. కందులు మార్కెట్‌లోకి వస్తున్నప్పుడు సగటున క్వింటాలుకు రూ.5,000 ఇచ్చి రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. తరుగులు, ఇతర ఖర్చులు పోను వ్యాపారులు రెట్టింపుకుపైగా లాభానికి అమ్ముకోవటానికి ప్రభుత్వమే అవకాశం కల్పించింది. ధరల పెరుగుదలతో ఒకవైపు ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసే కందిపప్పు ధరను కిలోకు రూ.50 నుంచి రూ.90 పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒక్కసారిగా 80 శాతం ధర పెంచటం ద్వారా వ్యాపారులకు తానేమీ తీసిపోనంటూ ప్రభుత్వం పేదలపై పెద్ద భారాన్ని మోపింది.
అయితే 2008-09 నుంచి దేశంలో ఉల్లిపాయల ఉత్పత్తి వేగంగా పెరుగుతున్నది. ఆ సంవత్సరం దిగుబడి 136 లక్షల టన్నులుండగా, 2014-15లో 189 లక్షల 23 వేల టన్నులకు ఉత్పత్తి పెరిగింది. ఈ కాలంలో ప్రపంచంలో ఉల్లిపాయలను ఎగుమతి చేసే ప్రధాన దేశాలలో ఒకటిగా భారత్‌ రూపొందింది. 2013 ఏప్రిల్‌-జూన్‌ మధ్య మూడు మాసాల కాలంలో ఐదు లక్షల ఇరవై వేల టన్నుల ఉల్లిపాయలను మనదేశం ఎగుమతి చేసింది. దేశీయ మార్కెట్‌ అవసరాలకు మించినంత సరుకు అందుబాటులో ఉంది. అయినా ధరలు పెరగటానికి బడా వ్యాపారులు మారెట్‌ను అదుపు చేయటమే కారణం. ఈ విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు. ఆహారధాన్యాలను ప్రభుత్వం సేకరించి, నిల్వ చేయటం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించటమే వాటి ధరలు అదుపులో ఉండటానికి కారణం. నగదు బదిలీ పథకం పేరుతో ఈ విధానాన్ని రద్దు చేయటానికి ప్రభుత్వం పూనుకుంటున్నది. అందుకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పూర్తిచేస్తున్నది. ఉత్పత్తితో సంబంధం లేకుండా, రైతులకు గిట్టుబాటు కానంత తక్కువగా ప్రభుత్వం ఆహారధాన్యాల మద్దతు ధరలను నిర్ణయిస్తున్నది. గత సంవత్సరం లెవీ సేకరణను అంతకు ముందు సేకరిస్తున్న దానిలో 25 శాతానికి పరిమితం చేసింది. కేంద్రం ప్రకటించిన ధరకన్నా ఏ రాష్ట్రమైనా రైతులకు అదనంగా చెల్లిస్తే, ఆ రాష్ట్రానికి ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సరఫరాచేసే ఆహారధాన్యాలను అందజేయబోమని కేంద్రం హెచ్చరించింది. ప్రజా పంపిణీకి అవసరమైన ఆహారధాన్యాలను రాష్ట్రాలు కొనుగోలు చేసుకుంటేనే చౌక ధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేయగలుగుతాయి. ప్రభుత్వం వద్ద తగినన్ని ఆహారధాన్యాల నిల్వలు లేకుండా, బడా వ్యాపారులు, అక్రమ నిల్వదారుల వద్దకు ఆహారధాన్యాల నిల్వలు చేరితే ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? కందిపప్పు, ఉల్లిపాయల ధరలు ఏ విధంగా పెరిగాయో అదే విధంగా బియ్యం, గోధుమల ధరలు కూడా పెరుగుతాయి. ఒక్కొక్క సరుకు ధరలు 200-400 శాతం వరకూ పెరిగాయి. అదే పెరుగుదల బియ్యం, గోధుమల ధరలలో చోటు చేసుకుంటే పేదల పరిస్థితి ఏమిటి? బియ్యం ధరలు కిలోకు రూ.10 పెరిగితేనే అల్లాడిపోయే సామాన్య ప్రజలు ఒక్కసారిగా ధరలు రెట్టింపు నుంచి నాలుగు రెట్లు పెరిగితే భరించగలరా? బ్రిటిష్‌ పాలనలో కరువులు, ఆకలితో లక్షలాదిగా ప్రజలు మరణించారు. ఈ రోజు తిరిగి అటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది.
సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేయాలని ద్రవ్యపెట్టుబడులు ఒత్తిడి చేస్తున్నాయి. గతంలో పాలించిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ అందుకు సాహసించలేదు. ప్రస్తుతం పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజా పంపిణీ విధానాన్ని రద్దుచేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రజలు చైతన్యంతో ఈ ప్రయత్నాలను ప్రతిఘటించకపోతే పూడ్చలేనంత నష్టం జరుగుతుంది.
- ఎ కోటిరెడ్డి