దేశానికి చేటు..

కేంద్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డిఐ) కిటికీలు తెరవగా ప్రస్తుత బిజెపి సర్కారు తలుపులు బార్లా తెరిచి కాంగ్రెస్‌ కంటే 'విభిన్నత'ను చాటుకుంది. గతేడాది నవంబర్‌లో కొన్ని కీలక రంగాల్లోకి ఎఫ్‌డిఐలను స్వేచ్ఛగా ఆహ్వానిస్తూ మోడీ ప్రభుత్వం తీర్మానించగా తాజాగా సోమవారంనాడు ఆదరాబాదరగా ప్రధాని ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై ఎఫ్‌డిఐలకు మరింతగా ద్వారాలు వెడల్పు చేసింది. ఈ దెబ్బతో అదీ ఇదీ అనే తేడా లేకుండా దేశంలోని దాదాపు అన్ని రంగాల్లోకీ ఎఫ్‌డిఐలు చొరబడేందుకు ఆస్కారం కల్పించింది. ప్రపంచంలోనే అత్యధిక బహిరంగ మార్కెట్‌ కలిగిన దేశంగా భారత్‌ను అంగట్లో నిలిపింది. కీలకమైన రక్షణ రంగం సహా ఔషధ, పౌర విమానయానం, ఆహార ప్రాసెసింగ్‌, సింగిల్‌ బ్రాండ్‌ వర్తక నిబంధనలు, బ్రాడ్‌కాస్టింగ్‌ క్యారేజి సేవలు, ప్రైవేటు సెక్యూర్టీ ఏజెన్సీలు, పశుసంవర్ధక సేవల నిబంధనలను సరళతరం చేసింది. కాగా ఎఫ్‌డిఐలను విరివిగా ఆహ్వానించేది ఉద్యోగ కల్పన కోసమేనంటూ మోడీ, ఎన్‌డిఎ పెద్దలు పలుకుతున్న చిలక పలుకులు తమ హేయమైన విధానాలకు సమర్ధనలే తప్ప వాస్తవాలు ఎంతమాత్రం కాదు. ఎఫ్‌డిఐలకు ఎర్ర తివాచీ పరిచేది మన తయారీ రంగాన్ని పరుగులు పెట్టించడానికో, యువతకు ఉద్యోగాల కల్పనకో కాదు. ముమ్మాటికీ విదేశీ కార్పొరేట్లకు మన సహజ వనరులను, ఇక్కడి శ్రమశక్తిని యధేచ్ఛగా దోచిపెట్టడానికే. అందుకే ఎఫ్‌డిఐల కోసం నిబంధనలను, చట్టాలను సరళీకరిస్తూ మోడీ సర్కారు ప్రకటించడంతోనే అప్పటి వరకు బ్రెగ్జిట్‌ ఉదంతం, రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలతో నేల చూపులు చూసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొంత మేర పైకెగసి లాభాలు నమోదు చేశాయి. ఈ పరిణామాన్ని బట్టి బిజెపి ప్రభుత్వ విధానాలు ఎవరికి ఉపయోగ పడతాయో తెలుస్తూనే ఉంది. 
రక్షణరంగంలో ఎఫ్‌డిఐలను మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ప్రతిపాదించ నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకొచ్చాక ఇప్పుడేమో యుపిఎ సర్కారును తలదన్నేలా విచ్చలవిడిగా ఎఫ్‌డిఐలను ప్రోత్సహిస్తోంది. ప్రతిపక్షంలో ఒకలా, అధికారపక్షంలో వేరొకలా మాట మార్చడం బిజెపి రాజకీయ దిగజారుడు తనానికి, అవకాశవాదానికి పరాకాష్ట. రక్షణరంగం అనేది ఎంతో సున్నితమైంది. నిబంధనలు, చట్టాలు కఠినంగా ఉన్నప్పుడే ఈ రంగంలో చోటు చేసుకున్న స్వల్ప ఘటనలు మన రక్షణ రంగానికి చేటుగా పరిణమించాయని విశ్లేషకులు బుగ్గలు నొక్కుకోగా ఏకంగా నూరు శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తే దేశ భద్రతను విదేశీ ప్రైవేటు బహుళజాతి సంస్థల చేతుల్లో పెట్టడమే. ఇది అత్యంత ప్రమాదకరమని పలు వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలను బిజెపి సర్కారు నిర్ద్వంద్వంగా తోసిపారేసి తాను అనుకున్నట్లు చేయడం అత్యంత ఆందోళనకరం. ఇంతకుముందు వరకు ప్రపంచంలో ముందుకొస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోడానికే ఎఫ్‌డిఐలనేవి ప్రభుత్వాలు. తాజాగా ఆ నిబంధనను సైతం మోడీ సర్కారు తొలగించి ఆధునిక, ఇతర కారణాల కోసం అని చేర్చడం ఘోరం. అంటే ఎఫ్‌డిఐల వలన మనకు పరిజ్ఞానం కూడా అందదన్నమాట. అంతేనా చిన్న ఆయుధాలు, ఆయుధ సామగ్రి తయారీ రంగంలో విదేశీ కంపెనీలు అడుగుపెట్టేందుకు అడ్డుగా ఉన్న ఆయుధ చట్టం 1956లోని నిబంధనలను సవరించి మరీ ఎఫ్‌డిఐలను ఆహ్వానించడం దారుణం. 
మోడీ అమెరికాకు వెళ్లేముందో, తిరిగొచ్చాకనో ఎఫ్‌డిఐలపై నిర్ణయాలు చేస్తుండటం గమనార్హం. దీన్నిబట్టి ఆయన అమెరికాకు, ఆ దేశ కార్పొరేట్లకు ఎంతగా బరితెగించి ఊడిగం చేస్తున్నారో అర్థమవుతుంది. మొన్న ఒబామాతో జరిపిన భేటీలో ముందుకొచ్చిన రక్షణ, అణు తదితర ఒప్పందాలు అమెరికా ప్రాపకంకోసమే. ఎఫ్‌డిఐలను ఆకర్షించేందుకు చేసిన 'సంస్కరణలు' సైతం ఆ కోవలోకి చెందినవే. ఇప్పటికే ప్రజారోగ్యం ప్రైవేటు ఆసుపత్రుల చేతుల్లో బందీకాగా, ఔషధరంగంలో నూరుశాతం ఎఫ్‌డిఐలు ప్రజలను మరింత గుల్ల చేస్తాయి. ప్రాణాధార మందులు సైతం పేదలు, సామాన్యులకు అందని విషాద పరిణామాలు సంభవిస్తాయి. స్వదేశీ కార్పొరేట్లతోనే విమాన ఛార్జీలు గూబల్లోకొస్తుండగా ఆ రంగంలో విదేశీ పెట్టుబడులొస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. కేబుల్‌రంగంలో ఎఫ్‌డిఐలతో ప్రజలకు సమాచారం, వినోదం మరింత భారం అవుతుంది. సమాచార వ్యవస్థ విదేశీయుల చేతుల్లోకి పోవడం దేశ భద్రతకు ప్రమాదకరం. ఎఫ్‌డిఐలతో మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతం వస్తుందని, ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలొస్తాయనడం భ్రమే. జన బాహుళ్యం బతుకులు మారాలంటే వారి గిరాకీని పెంచాలి. అందుకు చిత్తశుద్దితో చర్యలు చేపట్టకుండా ఎఫ్‌డిఐలు, మేక్‌ ఇన్‌ ఇండియాలు అనడం కంటి తుడుపు వ్యవహారాలే. పైగా అమెరికాకు, అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడికి యావత్‌ దేశాన్నీ పాదాక్రాంతం చేయడానికే. దేశ భద్రతకు ముప్పు, ప్రజల మనుగడకు హాని కలిగించే ప్రమాదకర విధానాలను ఇక ప్రజా ఉద్యమాలే తిప్పికొట్టాల్సి ఉంది.