దేశంలోఫాసిస్టుపోకడలు:MAబేబీ

భారతదేశంలో ఉన్నది పాసిస్టు ప్రభుత్వం కాకపోయినా పాసిస్టు పోకడలు కనిపిస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆలిండియా విప్స్‌ సదస్సులో పాల్గొనటానికి విశాఖ వచ్చిన బేబీ బుధవారం సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అగ్రవర్ణాల సహకారంతో బడుగు, బలహీన వర్గాలను అణచివేయాలని చూస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లు తీసేయాలని ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రకటన చేయడం అందులో భాగమేనన్నారు. వారి చేష్టలతో భారత సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇటీవల కర్నాటకలో కుల్బర్గిని, గోవింద్‌ పన్సారే, మహారాష్ట్రకు చెందిన నరేంద్ర దబోల్కర్‌ అనే రచయితలను దుర్మార్గంగా చంపడమే ఇందుకు నిదర్శనమన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు చట్టసభల్లో కొంత ప్రాధాన్యత తగ్గినప్పటికీ రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశాలున్నాయన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఢిల్లీ ఎన్నికల్లో 3 సీట్లకు పరిమితం అయిందని వివరించారు. అలాగే 1984లో రాజీవ్‌ గాంధీ హయాంలో 400 పైగా ఎంపీలు గెలుచుకున్న కాంగ్రెస్‌ తర్వాత చిత్తుగా ఓడిపోయిందన్నారు. నవంబరులో బెంగాల్‌లోని హౌరాలో సిపిఎం ప్లీనంలో పార్టీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడంపై పార్టీ కార్యకర్తలు దృష్టి పెట్టాలన్నారు.