దివీస్‌ విస్తరణ పనుల నిలిపివేతకు ఆందోళన

 విశాఖ జిల్లా, భీమిలి మండలంలో వున్న  దివీస్‌ కంపెనీ మూడో యూనిట్‌ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమై దివీస్‌ కంపెనీ వరకు సాగిన ప్రదర్శనలో ఆశపాలెం, కొసవానిపాలెం, కంచేరుపాలెం, చిప్పాడ, మూలకొద్దు, నమ్మివానిపాలెం, పెదనాగమల్లిపాలెం, అన్నవరం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను చీల్చి తమ పనులు చక్కదిద్దుకోవాలన్న యాజమాన్య కుయుక్తులను పసిగట్టిన ఉద్యమ కమిటీ అడ్డుకుంది. ప్రదర్శన చినసాయిబాబా గుడి దగ్గరకు చేరుకొనేసరికి ప్రదర్శనకారులతో యాజమాన్య అనుకూలురు వాదనకు దిగారు. చిప్పాడ పంచాయతీ సర్పంచ్‌ భర్త అప్పన్న తన సహచరులను వెంటబెంటుకొని వచ్చి ప్రదర్శనను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ప్రదర్శనకారులు సంయమనం కోల్పోకుండా ముందుకుసాగారు. కంపెనీ విస్తరిస్తే మీ కేంటని వారు చేసిన మొండివాదనలను, దాడి చేయడానికి చేసిన ప్రయత్నాలను పట్టించుకోకుండా దివీస్‌ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ప్రదర్శన, ధర్నాను భగం చేయడానికి గ్రామాల్లో తమ చెప్పుచేతల్లోవుండేవారికి ఎరవేసి రానీయకుండా యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎటువంటి అనుమతుల్లేకుండా మూడో యూనిట్‌ నిర్మాణ పనుల్లో భాగంగా చేపడుతున్న గోడ నిర్మాణాన్ని నిలిపివేయాలని దివీస్‌ కంపెనీ ముందు జరిగిన ధర్నాలో డిమాండ్‌ చేశారు. నిర్మాణ పనులు నిలిపివేతపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఏకోన్ముఖంగా నినదించడంతో దివీస్‌ డిజిఎం కోటేశ్వరరావు వచ్చి సమాధానమిచ్చారు. దీనికి సంతృప్తి చెందని ఆందోళనకారులు మండుటెండలో ఆకలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా కొనసాగించడంతో సిఐ జోక్యం చేసుకొని యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడారు. నిర్మాణ పనులు నిలిపివేయకపోతే అడ్డుకుంటామని ఆందోళనకారులు తేల్చిచెప్పారు. అనంతరం సంస్థ డిజిఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం తమకున్న స్థలంలో ప్రహరీ మాత్రమే నిర్మిస్తున్నామని, అన్ని అనుమతులు వచ్చాక ప్లాంటు నిర్మించే విషయమై ఆలోచిస్తామని బదులిచ్చారు. ఆ సమాధానంపైనా ఆందోళనకారులు సంతృప్తి చెందలేదు సరికదా దివీస్‌ గో బ్యాక్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
స్ధానిక ప్రజలకు ఉపాధి కల్పించకుండా, కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టకుండా కొంతమంది చేయితడిపితే తమ పనులు జరగవన్న విషయం యాజమాన్యానికి అర్ధమయ్యేలా ఈ పోరాటం ఊపిరిలీదుకుంటోంది. 
ఈ ప్రదర్శన, ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు. సిపిఎం భీమిలి డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, వైఎస్‌ఆర్‌సిపి మండల అధ్యక్షుడు వెంపాడ శ్రీనివాసరెడ్డి, చిప్పాడ మాజీ సర్పంచ్‌ శరగడ రఘునాధ్‌రెడ్డి, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.నాగరాణి, ఎఐటియుసి నాయకులు వెంకటరెడ్డి తదితరులు ప్రసంగించారు. దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ కన్వీనర్‌ రవ్వ నర్సింగరావు, రవ్వ అప్పలరాము, తెడ్డా రమేష్‌, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు భాగం లక్ష్మి పాల్గొన్నారు.