దివీస్‌ విస్తరణ ఆపకుంటే పోరు తీవ్రం

చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌ మూడో యూనిట్‌ విస్తరణ పనులను ఆపకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం హెచ్చరించారు. యూనిట్‌ 3 నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో చిప్పాడ పంచాయతీ పరిధిలోని సిటీనగర్‌ జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం లోకనాధం దీక్షాశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివీస్‌ యాజమాన్యం చర్చలు ద్వారా డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సంధానకర్తలు, దళారులు యాజమాన్య అనుకూలురుతో చర్చలు జరపాలనుకుంటే అంగీకరించబోమని తెలిపారు. దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీతో మాత్రమే చర్చలు జరపాలని స్పష్టం చేశారు. యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా విశాల ఐక్య వేదికగా జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కమిటీ వెనుక లక్షలాదిమంది ఉన్నారన్న విషయాన్ని యాజమాన్యం గ్రహిస్తే మంచిదన్నారు. సంబంధిత స్థలంలో ప్రహరీ మాత్రమే నిర్మిస్తున్నామని ఒకసారి, బ్లాకులను ఆధునీకరిస్తున్నామని మరోసారి చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. రైతుల సాగుభూములకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం యాజమాన్యానికి కారుచౌకగా వాటిని కట్టబెట్టిందని విమర్శించారు. చిప్పాడ పంచాయతీ మాజీ సర్పంచి సరగడ రఘునాధరెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనను పోలీసుల బలప్రయోగంతో అణచాలనుకోవడం అవివేకమన్నారు. సిపిఎం డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, ఎపి మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొవిరి అప్పలరాజు, నగర కార్యదర్శి కర్రి శేఖర్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాసరావు, డివిజన్‌ కన్వీనర్‌ శ్రీనివాసవర్మ తదితరులు దీక్షా శిబిరంలో పాల్గొన్నవారికి సంఘీభావం తెలిపారు. 
.