దళితులు - భూమి - అంబేద్కర్‌

డాక్టర్‌ బిఆర్‌ అంబే ద్కర్‌ ప్రధానంగా ఆర్థిక శాస్త్రవేత.్త 1915లో కొలంబి యా యూనివర్సిటీలో 'ప్రాచీన భారత వాణిజ్యం'పై పరిశోధ నా పత్రాన్ని సమర్పించి ఎంఎ డిగ్రీని పొందారు. ఆయన అత్యంత శ్రమతో పరిశోధించిన 'నేషనల్‌ డివిడెండ్స్‌ ఆఫ్‌ ఇండియా' అనే పరిశోధనా గ్రంథాన్ని 1916 జూన్‌లో పిహెచ్‌డి కోసం కొలంబియా యూనివర్సిటీకి సమర్పించారు. ఈ గ్రంథం 'ది ఎవల్యూషన్‌ ఆఫ్‌ ప్రిన్సిపుల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా' అనే పేరు మీద ప్రకటించబడింది. తరువాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్సులో 1916 జూన్‌లో చేరారు. ఈ డిగ్రీలో ఎక్కువ భారత ఆర్థిక వాణిజ్య శాస్త్రాలకు సంబంధించినవి కావడం వల్ల భారతదేశంలో ఆయన ఆర్థికంగా ప్రతిపాదించిన అంశాలు చాలా ముఖ్యమైనవి. మానవ హక్కుల పోరాటంలో కూడా ఆయన అద్వితీయుడు. అంబేద్కర్‌ తన రాజకీయ ప్రణాళికలో ప్రధానాంశాలను ఇలా చెప్పారు. 'భారతీయులందరికీ హక్కుల సమానత్వం ఉండాలి. ప్రతి పౌరుడూ తనను తాను అభివృద్ధి చేసుకోవ డానికి ప్రభుత్వం సోపానం కావాలి. మత, ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రాలు ప్రతి భారతీయుడి హక్కు. సమాన అవకాశాలు ప్రతి భారతీయుడి హక్కు. మనిషిని మనిషి, ఒక వర్గాన్ని మరో వర్గం, ఒక దేశాన్ని మరో దేశం దోచుకోవడం, అణచివేయడాన్ని నా రాజకీయ ప్రణాళిక వ్యతిరేకిస్తూ ఉంది.'
అంబేద్కర్‌ ఆలోచనల్లో ప్రధానమైంది దళితులకు చదువుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కల్పించాలని ఇలా కోరారు. 'దళితులకు చదువుతో పాటు సేవల విషయం శ్రద్ధ చూపడం ద్వారా మాత్రమే సమాజంలో వారి ఆర్థిక స్థాయి పెంచగలమని నా నమ్మకం. అయితే, షెడ్యూల్డ్‌ కులాల వారి ఆర్థిక స్థోమత పెంచే మార్గాలేమిటి? ఆర్థిక పురోగతి సాధింపజేయాలంటే లాభదాయకమైన వృత్తులు చేపట్టే అవకాశాలు వారికి కల్పించాలన్నది సుస్పష్టం. లాభదాయకమైన వృత్తులలో ప్రవేశించేందుకు వారికి ద్వారాలు తెరిచేదాకా వారు ఆర్థికంగా బలపడే అవకాశమే లేదు. అప్పటిదాకా వాళ్ళు బానిసలుగానే మిగిలిపోతారు లేదా గ్రామాల్లో భూస్వాముల దగ్గర వెట్టి కార్మికులుగా ఉండిపోతారు. ఇందులో అనుమానానికి తావే లేదు. ఈ లాభదాయకమైన ఆదాయ మార్గాల విషయానికొస్తే అన్నిటి కంటే ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాల వారికి భూమి ఇవ్వడం మీద ప్రభుత్వం దృష్టి సారించాలనేది నా అభిప్రాయం.' దళితులు కేవలం ఓటర్లుగానే కాదు వారికి భూమిని ఇవ్వడం చాలా ముఖ్యమని ఆయన ఇలా అన్నారు. 'దళితులకు భూమి మీద హక్కు కల్పిస్తే స్వతంత్ర జీవనోపాధికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. తలెత్తుకుని నిర్భయంగా, ధైర్యంగా జీవించగలుగుతారు. ఈ విషయంలో మంత్రులం దరూ ఏకాభిప్రాయంతో ఉన్నారనుకుంటాను. అందువలన షెడ్యూల్డ్‌ కులాలవారికి భూ పంపిణీ అనేది ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. అయితే, ముందుగా పరిశీలించాల్సిన విషయం.. షెడ్యూల్డ్‌ కులాలకు పంచడానికి భూమి అందుబాటులో ఉన్నదా? పెద్ద భూస్వాముల చేతుల్లో భూమిని తీసుకొని వీరికి పంచడానికి ప్రభుత్వానికి అధికారాలున్నాయా? అవసరమైతే భూమి కొనుగోలు చేయడానికి ప్రభుత్వమే షెడ్యూల్డ్‌ కులాల వారికి ఆర్థిక సాయం అందించే వీలుందా? షెడ్యూల్డ్‌ కులాల వారికి భూమి ఇవ్వాలంటే ముందుగా ఈ మూడు కోణాలను మనం పరిశీలించాల్సి ఉంది. భూస్వాముల చేతుల్లో ఉన్న భూమికి ఒక పరిమితి విధించి, వారి దగ్గరున్న అదనపు భూమిని వీరు కొనుక్కొనే విధంగా ప్రభుత్వమే వీరికి ఆర్థిక సాయం అందించవచ్చు.' భూమి ఇవ్వకపోగా వారికి తరతరాలుగా ఇచ్చిన అసైన్డ్‌ ల్యాండ్స్‌ కూడా లాక్కొంటున్నారు. షెడ్యూల్డ్‌ కులాల ప్రజలకు ఇవ్వడానికి భూమి అందుబాటులో లేకపోతే కొని ఇవ్వమని అంబేద్కర్‌ ప్రతిపాదించారు. దళితుల జీవన వ్యవస్థను ఆర్థికంగా పునరుజ్జీవం చేయాలంటే భూమి సమస్య ప్రధానమైందిగా ఆయన ముందుకు తెచ్చారు. భూమి సమస్య ఎప్పుడు ముందుకొచ్చినా భూస్వాములు ఉలిక్కిపడటం, ఆ చట్టాలను నిరోధించటం పరిపాటి. అయితే ఆయన లోతైన ఆర్థిక శాస్త్ర అధ్యయనాల వల్ల సమస్య మూలాలను తెలుసుకోగలిగారు. భూమిని కొని ఇవ్వడం అనే పథకాన్ని ఈనాడు అనేక లొసుగుల వల్ల నీరుగార్చు తున్నారు. ఎకరా భూమి రేటు పది లక్షలుగా ఉంటే ఈనాడు లక్ష రూపాయలుగానే నిర్ణయించడం వల్ల భూమిని అమ్మడానికి రైతులు ముందుకు రావడం లేదు. రైతులు దళితులకు భూములను అమ్మడానికి కూడా నిరాకరిస్తు న్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భూమి సమస్య ఒక ఘనీభవించిన సమస్యగా మిగిలిపోయింది. అనేకచోట్ల ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా భూమిని లబ్ధిదారులకు చూపించలేదు. పట్టా కేవలం కాగితంగా మిగిలిపోయింది. కేటాయించిన భూమిలోకి ప్రవేశించడానికి భూస్వామి ఒప్పుకోవడం లేదు. భూమిలోకి వెళ్ళాక నీరు అందనివ్వడం లేదు. బెదిరింపులు, హత్యలు జరుగుతున్నాయి. ఎందరో దళితులు ఈ భూమి సమస్య మీదనే హతులయ్యారు. చిత్తూరు జిల్లా బండ్లపల్లి గ్రామంలో అర ఎకరం భూమి కోసం ముగ్గురు తమ్ముళ్ళను, వారి అక్కను భూస్వాములు హత్య చేశారు. నలుగురూ ఒకే భూమిలో హత్యకు గురైన సంఘటనను నేను కళ్ళారా చూశాను. నన్ను చూసి పిల్లలు తల్లడిల్లిపోయారు. గొర్రెలను, గేదెలను పెంచుకోవడానికి కూడా వీలులేకుండా భూస్వాములు కట్టడి చేస్తున్నారని దళితులు వాపోయారు. అస్పృశ్యత వల్ల భూమి మీద దళితులకు హక్కు లేదనే భావం అగ్రకులాల్లో బలపడింది. 'మాకు ఊడిగం చేయవలసిన వారికి భూమి మీద ఆధిపత్యం ఉండడానికి వీల్లేదు' అనే సామాజిక అణచివేత ధోరణే గ్రామాలలో వారి హత్యాకాండకు దోహదం చేస్తోంది. దీనంతటికీ వ్యవసాయ కార్మికులుగా ఉన్న ప్రజలు వ్యవసాయదారులుగా మారడం మీద పాలకవర్గానికి, భూస్వామ్య వర్గానికి తీవ్రమైన కుల ద్వేషం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక సామాజిక వర్గానికి 80 శాతం భూమి ఉండడమేమిటి? ఆ భూమి ఎలా వచ్చింది అని నిలదీస్తే సమాధానం లేదు.
ఈ విషయంగా పార్లమెంటులో మాట్లాడుతూ అంబేద్కర్‌ ఇలా అన్నారు. 'అధ్యక్షా, ఇప్పుడు నేను నా మిత్రునికి ఒక సూచన చేయబోతున్నాను. అదేమిటంటే ప్రణాళికా సంఘం నివేదికలో నేనొక విషయం చదివాను. ఈ దేశంలో వ్యవసాయానికి అనువైనప్పటికీ వృథాగా ఉన్న భూమి 9 కోట్ల 80 లక్షల ఎకరాలుందని ఆ నివేదికలో ఉంది. నా మిత్రునికిచ్చే సలహా ఏమిటంటే, ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు రాజ్యాంగాన్ని సవరించాలని అనుకుం టోంది. వారానికోసారి సవరించటమే పనిగా పెట్టుకుంటే అసలు రాజ్యాంగం ఎందుకు? సరే మీరు ఎలాగూ సవరించా లనుకుంటున్నారు కాబట్టి నాదొక సలహా. నిరుపయోగంగా ఉన్న భూమిని సాగులోకి తీసుకురావటమనేది మొదటి జాబితాలో చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టండి. అప్పుడది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల బెడద వదులుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు గడ్డివామి దగ్గర కుక్కలాగా ఆ భూముల్ని అభివృద్ధి చెయ్యడం లేదు. చేసేవాళ్ళకు ఇవ్వటమూ లేదు. అందువల్ల రాజ్యాంగ సవరణ ద్వారా వృథా భూమిని మొదటి జాబితాలోకి చేర్చి స్వాధీనం చేసుకోవటం తప్పేమీ కాదని నా అభిప్రాయం' అని అన్నారు.
పాలక వర్గాలు దళితులను వ్యవసాయదారు లుగా ఎదగనివ్వడం లేదు. బంజరు భూములు 15 లక్షల ఎకరాలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. 25 లక్షల ఎకరాలకు పైగా తెలంగాణలో ఉన్నాయి. కెసిఆర్‌ మూడెకరాలు దళితులకు ఇస్తానన్నారు. ఆచరణలో అమలు జరగడం లేదు. చంద్రబాబైతే ఒక అడుగు ముందుకేసి 155 జీవోతో దళితుల అసైన్డు భూములన్నీ కొల్లగొట్టాలని చూస్తున్నారు. దళితుల్లో కొందరికి నామమాత్ర పదవులిచ్చి వారి చేత భజనలు చేయించుకుంటూ వారికి బ్రిటీష్‌ నాటి కాలంలో ఇచ్చిన భూములు కూడా లాక్కొంటున్నారు. మరోపక్క దళితవాడల్లో ఎప్పుడో మిషనరీలు పెట్టిన స్కూళ్ళను విద్యార్థుల సంఖ్య లేదనే పేరుతో ఎత్తివేస్తున్నారు. ఎలిమెంటరీ పాఠశాలల్లో, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎక్కడా పిల్లలకు బెంచీలు లేవు. వాళ్ళు కటిక నేల మీద కూర్చొంటున్నారు. లక్షా ముప్పై ఆరు కోట్ల వార్షిక బడ్జెట్‌ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బెంచీలు ఇవ్వలేదా! పేద పిల్లలు చదువుకోకూడదనే అక్కసు ప్రభుత్వంలో కనిపి స్తోంది. దేవాదాయ, ధర్మాదాయ భూములు అగ్రవర్ణాలకే కౌలుకిస్తున్నారు. మిగులు భూములు ఏదో ఒక పేరుతో అగ్రవర్ణాలే చేసుకొంటున్నాయి. భూమిలేనివారు పిల్లల్ని ఏమి చదివించుకొంటారు. గేదెల్ని ఎలా మేపుకొంటారు? భూమిలేని వారికి బ్యాంకు లోన్లు ఎవరిస్తారు. అందుకే అంబేద్కర్‌ భూమి మీద ఎక్కువ నొక్కి పెట్టారు. ఆయన దళితులకు భూమి ప్రధానమైన వనరు అని ప్రతి సమావేశంలోనూ నొక్కి వక్కాణించారు. అంబేద్కర్‌ చాలా నిశితంగా ఆనాడు పార్లమెంటులో దళితుల భూమి గురించి ఇలా మాట్లాడుతూ రాష్ట్రాలు భూస్వామ్య కులాధిపత్య ధోరణిలో ఉంటాయి కాబట్టి అంబేద్కర్‌ ఈ విషయాన్ని కేంద్రమే నిర్వహించడం మంచిదని చెప్పారు. ఆయన తన స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌ గ్రంథంలో భూములను, పరిశ్రమలను జాతీయం చేయండి అని పిలుపునిచ్చారు. కుల సమస్య, అస్పృశ్యతా నివారణ సమస్య భూమి సమస్యతో ముడిపడి ఉందని అంబేద్కర్‌ బలంగా చెప్పారు. భూమి సార్వత్రికం అవడం వలన సంపద పెరుగుతుంది. శ్రామికులకు జీవన భద్రత వస్తుంది. వ్యవసాయ సంస్కృతి విస్తరిస్తుంది. క్షీర విప్లవం వర్థిల్లు తుంది. నీలి విప్లవం పరిఢవిల్లుతుంది. అశోకుడు, అక్బర్‌, కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు వంటి చక్రవర్తుల్లా నీటి వనరుల కోసం చెరువులు, కుంటలు, కాల్వలు, అడవులను వర్థిల్లజేయాలి. అంబేద్కర్‌ నదులను అనుసంధానం చేసినప్పుడే వ్యవసా యం పెరుగుతుందని చెప్పారు. వీటన్నింటికీ ప్రజల్లో చైత న్యం రావాల్సి ఉంది. ప్రజలు ఓట్లు అమ్ముకోవడం మానేసి దళిత, బహుజన, మైనారిటీ రాజ్యాన్ని స్థాపించుకోవడంలోనే భూ సమస్య పరిష్కారం ఉంది. ఆనాడే అంబేద్కర్‌ ఆశయాలు నెరవేరుతాయి.
- డా|| కత్తి పద్మారావు