తొలగించిన 'ఓలం' కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

               ఓలం జీడిపిక్కల ఫ్యాక్టరీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన 9 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అమలాపురం ఫ్యాక్టరీ కార్మికులు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నర్సీపట్నం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రాజు మాట్లాడుతూ నర్సీపట్నం మండలం అమలాపురంలోని ఓలం జీడిపిక్కల కర్మాగారంలో 13 సంవత్సరాల నుండి మహిళలు, అనేక మంది కార్మికులుగా పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో 9 మందిని మార్చి 20వ తేదీ నుండి ఫ్యాక్టరీలో పని చేయడానికి ప్రవేశం లేకుండా సెక్యూరిటీ సిబ్బందితో ఆటంకపర్చారని చెప్పారు. ఎటువంటి కారణం లేకుండా ఈ 9 మంది కార్మికులను తొలగించారని, దీనిపై ప్రశ్నిస్తే వయస్సు మీరిందని, అందువల్ల రానివద్దని యాజమాన్యం తెలిపిందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ 9 మంది వయస్సుకు సంబంధించిన వివరాలు ఓలం యాజమాన్యం వద్ద లేనప్పటికీ ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. యాజమాన్యం ఏవో ఖాళీ పత్రాల మీద సంతకాలు చేయాలని కార్మికులను బలవంతం చేయగా, వారు అందుకు నిరాకరించారని, ఆ కాగితాలను తెలిసిన వారికి చూపిస్తామని అడగ్గా ఆ కాపీలు ఇవ్వకుండా సిబ్బందితో దౌర్జన్యంగా బయటకు నెట్టి వేస్తూ మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించారని తెలిపారు. ఇదే ఆధారంగా బతుకుతున్న ఈ కార్మికులు రెండు నెలల నుండి ఎటువంటి ఆదాయం లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లో తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆర్‌డిఒ కె.సూర్యారావుకు తమ గోడును వినిపించారు. తిరిగి పనుల్లోకి తీసుకొనే విధంగా యాజమాన్యానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన ఆర్‌డిఒ ఓలం యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడారు. తొలగించిన కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.