టిప్పు సుల్తాన్‌ జయంతిపై సంఘ్ పరివార్‌ రగడ..

చరిత్రను సంఫ్‌ు పరివార్‌ మతోన్మాద కళ్లద్దాలతో పరిశీలిస్తే అన్నీ తల్లకిందులుగానే కనిపిస్తాయి. దేశ రక్షణ కోసం పోరాడి యుద్ధభూమిలో నేలకొరిగిన వీరుడు ముస్లిం అయితే ఆయన దేశ భక్తుడు కాదు. విదేశీయులతో కుమ్మక్కయి దేశానికి ద్రోహం చేసిన వాడు హిందువు అయితే అతను మహా దేశభక్తుడవుతాడు. ప్రస్తుతం కర్ణాటకలో టిప్పుసుల్తాన్‌ జన్మదిన వేడుకలను వ్యతిరేకిస్తూ మత ఘర్షణలు సృష్టిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి-సంఫ్‌ు పరివార్‌ శక్తుల ధోరణి చూస్తుంటే కేంద్రంలో అధికారం చేపట్టిన ఈ శక్తులు దేశాన్ని తాలిబానీకరించడానికి ఎంతగా తాపత్రయ పడుతున్నాయో అర్థమవుతుంది. 
మైసూర్‌ టైగర్‌గా పేరుగాంచిన టిప్పు సుల్తాన్‌ భారత దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాద ముష్కరులతో పోరాడి యుద్ధరంగంలోనే నేలకొరిగిన మొట్టమొదటి యోధుడు. తాను వ్యక్తిగతంగా ఎంతటి ఇస్లామ్‌ మతారాధకుడో పరిపాలనలో అంతటి లౌకికవాది. తన పరిపాలనా కాలంలో టెక్నాలజీ అభివృద్ధికీ, వాణిజ్య పారిశ్రామికాభివృద్ధికీ కృషి చేసిన వ్యక్తి. ఈ మంచి లక్షణాలన్నీ ఉన్నప్పటికీ ఆయన ఒక రాజు. ఫ్యూడల్‌ రాజరిక పాలకులకు ఉండే లక్షణాలు ఆయనకూ ఉన్నాయన్న విషయం మరచిపోకూడదు.
1750లో జన్మించిన టిప్పుసుల్తాన్‌ తన తండ్రి హైదర్‌ ఆలీ నాయకత్వంలో 15వ ఏటనే యుద్ధ రంగంలోకి దిగి యుద్ధవ్యూహాల్లో రాటుదేలాడు. 1782లో హైదర్‌ ఆలీ మరణం తరువాత ఆయన మైసూర్‌ రాజ్యానికి సుల్తాన్‌ అయినాడు. నిజానికి హైదరాలీ రాజరిక వంశం నుంచి వచ్చినవాడు కాదు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి మైసూర్‌ రాజు సైన్యంలో మెట్టుమెట్టు ఎదిగి చివరికి పాలకుడైనాడు. తన తండ్రిలాగే రాజ్యాన్ని విస్తరించే క్రమంలో టిప్పుసుల్తాన్‌... భారత దేశాన్ని ఆక్రమించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బ్రిటిష్‌ వారితో మూడు యుద్ధాలు చేశాడు. చివరికి 1799లో బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ సేనలు మైసూరు రాజధాని శ్రీరంగపట్టణం కోటను దిగ్బంధనం గావించినప్పుడు టిప్పుసుల్తాన్‌ కోటను రక్షించుకునే క్రమంలో యుద్ధరంగంలోనే చనిపోయాడు. బ్రిటిష్‌ సైన్యం నగర ప్రాకారాలను పగులగొట్టి లోపలికి ప్రవేశిస్తుంటే టిప్పుకు సలహాదారుగా ఉన్న ఫ్రెంచ్‌ సైనికాధికారి ఆయనను రహస్య మార్గం గుండా తప్పించుకోవాలని సలహా ఇచ్చాడు. ''గొర్రెలాగా వెయ్యేళ్లు బతికే కన్నా పులిలా ఒక్క రోజు బతికితే చాలు'' అని చెప్పి ఆయన యుద్ధంలోకి దిగాడు.
బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడాడు గనుక బ్రిటిష్‌వారు టిప్పు సుల్తాన్‌ను విపరీతంగా ద్వేషించారు. బ్రిటిష్‌ చరిత్రకారులు ఆయనను దుర్మార్గునిగా, హిందూ, క్రిస్టియన్‌ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. బ్రిటిష్‌వారితో కుమ్మక్కయిన సంఫ్‌ు పరివార్‌ ఇప్పుడు ఆ బ్రిటిష్‌ వారి విద్వేషపూరిత రాతల నుంచి కొన్ని పేజీలను అందుకుని ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ దేశంలో హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మత ఘర్షణలకు పాల్పడుతున్నారు.
టిప్పుసుల్తాన్‌ హిందూ వ్యతిరేకి కాబట్టి ఆయన జన్మదిన వేడుకలు జరపకూడదని బిజెపి-విశ్వహిందూపరిషత్‌లు పిలుపునిచ్చాయి. అంతేకాదు కర్ణాటకలో మతఘర్షణలు కూడా రెచ్చగొడుతున్నాయి. 255 ఏళ్ల క్రితం చనిపోయిన టిప్పుసుల్తాన్‌ జన్మదిన వేడుకలను కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా జరపడం వెనుకనున్న ఉద్దేశం ముస్లిం ఓటు బ్యాంకు కోసమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు పక్కనబెడితే టిప్పుసుల్తాన్‌ లౌకికతత్వాన్ని ప్రశ్నిస్తున్న సంఫ్‌ు పరివార్‌ దురుద్దేశాన్ని మాత్రం ప్రశ్నించక తప్పదు. టిప్పుసుల్తాన్‌ లౌకిక వాది అనడానికి అనేక దృష్టాంతాలు చెప్పుకోవచ్చు : 1791లో మరాఠా సైన్యం శృంగేరీ శంకరాచార్య మఠంపై దాడి చేసి అనేక మందిని చంపేసింది, క్షతగాత్రులను చేసింది. మఠంలోని విలువైన వస్తువులను దోచేసింది. వాస్తవానికి ఆ రోజుల్లో గెలుపొందిన రాజులు హిందువులైనా, ముస్లింలైనా చేసే పని అదే. సర్వం కోల్పోయిన శంకరాచార్యులవారు టిప్పుసుల్తాన్‌ సహాయం కోరారు. శృంగేరీ శంకరాచార్యులకూ, టిప్పుసుల్తాన్‌కూ ఈ మేరకు కన్నడ భాషలో జరిగిన 30 ఉత్తర ప్రత్యుత్తరాలు 1916లో మైసూర్‌ పురాతత్వ డైరెక్టర్‌ కనుగొన్నారు. మరాఠా సైనికుల దాడి పట్ల టిప్పుసుల్తాన్‌ తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు : ''ఇటువంటి పవిత్ర స్థలం మీద పాపానికి ఒడిగట్టిన వారు ఈ కలియుగంలో ఫలితాన్ని అనుభవించే రోజు ఎంతో దూరంలో లేదని ''హసద్భిహి క్రియతే కర్మ రుదద్భిర్‌ అనుభుయతె (నవ్వుతూ (పాపాలు) చేసేవారు ఏడుస్తూ ఫలితాలు అనుభవిస్తారు) శ్లోకం తెలియజేస్తోంది'' అని టిప్పుసుల్తాన్‌ పేర్కొన్నాడు. వెంటనే శంకరాచార్యులకు 200 రహతిల డబ్బు, ఇతర వస్తువులు అందజేయాలని బెద్నూరు అషఫ్‌ను ఆయన ఆదేశించాడు. టిప్పుసుల్తాన్‌ హిందూ మతాచారాలను గౌరవించేవాడని చరిత్ర కారుడు బిఎ సాలెతారె పేర్కొన్నారు. మెల్కోటేలోని శ్రీవైష్ణవ ఆలయాన్ని సకల విధాల పోషించడమే కాకుండా అక్కడ వైష్ణవ కీర్తనలను సంప్రదాయ పద్ధతిలో పఠించాలన్నాడు. మెల్కోటె దేవాలయంలో ఇప్పటికీ టిప్పు సుల్తాన్‌ బహూకరించినట్లు రాసి ఉన్న బంగారు, వెండి పాత్రలున్నాయి. 1782 నుంచి తను చనిపోయే వరకు ఆయన తన రాజ్యంలో ఉన్న దేవాలయాలకు 34 అగ్రహారాలు ఇచ్చినట్లు రికార్డులున్నాయి. అనేక గుడులకు బంగారు, వెండి బహుమతులిచ్చాడు. నంజన్గుడిలో శ్రీకంఠేశ్వర దేవాలయానికి ఆయన బహూకరించిన విలువైన రాళ్లు పొదిగిన కప్పు ఇప్పటికీ ఉంది. శ్రీరంగపట్నంలోని రంగనాథాలయానికి ఆయన ఏడు వెండి కప్పులు, వెండి హారతి పళ్లెం బహూకరించాడు. ఈ గుడి ఆయన నివాసానికి దగ్గరలోనే ఉంది. ఆయన ఒకవైపు గుడి గంటలూ, మరోవైపు మసీదులోని ప్రార్థనలు వినేవాడని చెబుతారు. కలాలెలోని లక్ష్మీకాంత గుడికి ఆయన నాలుగు వెండి కప్పులు, ఒక పళ్లెం వగైరా బహూకరించాడు. టిప్పుసుల్తాన్‌ 156 దేవాలయాలకు నిత్యం వార్షిక చెల్లింపులు చేసేవాడని మైసూర్‌ గెజెట్‌ ఎడిటర్‌ ప్రొఫెసర్‌ శ్రీకాంతయ్య చెప్పారు.
టిప్పుసుల్తాన్‌ ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో హిందువులు ఉండేవారు. ఆయన కోశాధికారి కృష్ణారావు, ఆయన తపాలా, పోలీసు శాఖా మంత్రి శామయ్య అయ్యంగార్‌. ఆయన సోదరుడు రంగ అయ్యంగార్‌ ప్రభుత్వంలో ముఖ్యమైన అధికారి. టిప్పుసుల్తాన్‌ జమానాలో ముఖ్యమైన ''మిర్‌ అషఫ్‌'' పదవిని పూర్ణయ్య నిర్వహించేవారు. మొఘల్‌ దర్బారులో టిప్పుసుల్తాన్‌ ఏజెంట్లుగా మూల్‌చంద్‌, సుజన్‌ రారు ఉండేవారు. ఆయన సైనికాధికారి ''పేష్కార్‌''గా ఉన్న సుబ్బారావు హిందువే.
శాస్త్ర, సాంకేతిక రంగంలో కూడా టిప్పుసుల్తాన్‌ తన కాలానికి మించిన ఆవిష్కరణలు చేశాడు. ముఖ్యంగా సైనిక రాకెట్ల రూపకల్పనలో ఆయన గొప్ప అద్భుతాలు సాధించాడు. ఆయన హయాంలో రూపొందించబడిన కాంగ్రీవ్‌ రాకెట్లు ఆ నాడు బ్రిటిష్‌ టెక్నాలజీకి మించిపోయాయి. రాకెట్‌ లాంచర్లు గల అనేక రకాల యుద్ధ నౌకలను రూపొందించాడు. యుద్ధ రంగంలోనే కాదు పారిశ్రామికంగా కూడా ఆయన అనేక విధాలా పరిశోధనలకు ప్రోత్సాహమిచ్చాడు. టిప్పుసుల్తాన్‌ హయాంలో మైసూర్‌లో పట్టు పరిశ్రమ పెద్ద ముందడుగు వేసింది. టిప్పు సుల్తాన్‌లోని ఈ సానుకూలాంశాలన్నిటినీ విడిచిపెట్టి సంఘపరివార్‌ ఆయనను ఒక మతదురహంకారిగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం వెనుక వారికి స్వార్థ ప్రయోజనం ఉంది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాద దురాక్రమణను వ్యతిరేకించినందుకు తొలి తరం బ్రిటిష్‌ చరిత్రకారులు టిప్పుసుల్తాన్‌కు వ్యతిరేకంగా రాసిన రాతల వెనుక కూడా సంఫ్‌ు పరివార్‌కున్నట్లే ఒక స్వార్థ ప్రయోజనం ఉంది.
దేశ ద్రోహం విషయంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు, సంఘ పరివార్‌ శక్తులు రెండూ ఒకటే కాబట్టి ఈరోజు ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిలు ఆ బ్రిటిష్‌ చరిత్రకారుల రాతలను ఉపయోగించుకుంటున్నాయి. టిప్పుసుల్తాన్‌ స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించినందునే నాటి బ్రిటిష్‌ చరిత్రకారులైన కిర్క్‌పాట్రిక్‌, విల్కిస్‌ వంటివారు ఆయనకు వ్యతిరేకంగా లేనిపోనివి రాశారని తదుపరి చరిత్రకారులైన బ్రిట్ల్‌బాంక్‌, మొహిబుల్‌ హసన్‌, ఎఎస్‌ చెట్టి, ఇర్ఫాన్‌ హబీబ్‌ వంటి వారు తెలియజేశారు. నిజానికి టిప్పుసుల్తాన్‌కు వ్యతిరేకంగా రాసిన కిర్క్‌పాట్రిక్‌, విల్కిస్‌లు టిప్పుసుల్తాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాల్లో బ్రిటిష్‌ తరఫున పాల్గొన్నారని, వారిద్దరూ టిప్పుతో పోరాడిన లార్డ్‌ కార్న్‌వాలిస్‌, రిచర్డ్‌ వెల్లెస్లేలకు అతి సన్నిహితులని ప్రఖ్యాత చరిత్రకారిణి బ్రిట్ల్‌బాంక్‌ రాశారు.
అందువల్ల దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టడానికి సంఫ్‌ు పరివార్‌ శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్న చర్యల్లో భాగమే టిప్పుసుల్తాన్‌కు వ్యతిరేక ప్రచారం. నాడు మన దేశాన్ని పాలించడానికి బ్రిటిష్‌ వారు 'విభజించు పాలించు' అనే ఎత్తుగడను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సంఫ్‌ు పరివార్‌ కూడా బ్రిటిష్‌వారి అడుగుజాడల్లోనే ప్రజలను 'విభజించు పాలించు' అన్న కుట్రకు పాల్పడుతోంది.
- ఎస్‌ వెంకట్రావు