జాతి వ్యతిరేకులెవరు?

ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యా లయంలో వారం రోజుల క్రితం జరిగిన కొన్ని ఘటనలను ఆధారం చేసుకొని విద్యార్థి ఉద్యమాలపైనా, వామపక్షాలపైనా ఆర్‌యస్‌ యస్‌ నాయకత్వంలోని సంఘపరివారం భౌతికంగా, భావజాలపరంగా దాడులు చేస్తోంది. మరో నాలుగురోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్‌ మరణంతో ఉత్పన్నమైన సమస్యల నుంచి తమను తాము కాపాడుకోడానికి ఒక రాజకీయ ఎత్తుగడగా జెఎన్‌యు ఘటనలకు మసిపూసి మారేడుకాయ చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోం ది. తనను కాదన్న ప్రతి ఒక్కరినీ దేశద్రోహులుగా ముద్రవేసి, తమకు తాము దేశభక్తులుగా ముద్రవేసుకొంటోంది. వారిచ్చే సర్టిఫికెట్‌తోనే ఈ దేశంలో ఎవరైనా దేశభక్తులుగా చెలామణి కావాలని శాసించడానికి చూస్తోంది. దీని కోసం ఒక పథకం ప్రకారం ఒకదాని వెంట ఒకటి ఘటనలను సృష్టించి ఈ మంటలను ఆరకుండా చేయాలని చూస్తోంది. తప్పుడు ప్రచారంతో 'దున్నపోతు ఈనిందంటే దూడను గాటన కట్టెయ్యమన్న' సామెతగా మీడియాలోని ఒక సెక్షన్‌ కూడా ఈ ప్రచారంతో కొట్టుకుపోయి వాదిస్తోంది. తప్పుడు సమాచారంతో జాతిని తప్పుదారి పట్టిస్తోంది. అందువల్ల వాస్తవాలు తెలుసుకునే హక్కు ప్రజలకుంది.
ఆరోజు ఏం జరిగింది?
ఫిబ్రవరి 9న అఫ్జల్‌గురును ఉరితీసి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొంతమంది స్వతంత్ర కాశ్మీర్‌వాదులు సబర్మతీ హాస్టల్‌లో సాంస్కృతిక సాయంత్రం పేరుతో సభ జరుపుకోడానికి అడ్మినిస్ట్రేషన్‌ దగ్గర అనుమతి తీసుకున్నారు. దీనికీ, ఎస్‌ఎఫ్‌ఐ లాంటి సంఘాలకూ ఎలాంటి సంబంధం లేదు. అయితే సభకు పదిహేను నిముషాల ముందు ఎబివిపి ఫిర్యాదుపై దాన్ని రద్దు చేశారు. అయినా వారు సభ జరుపుకోడానికి పూనుకున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో ఎన్నో ఏళ్ళుగా వివిధ రకాల అభిప్రాయాలు కలిగిన వారు వాదోపవాదాల ద్వారా చర్చించుకోవడం ఒక సంప్రదాయం. భావ వ్యక్తీకరణకు, చర్చలకు ఇక్కడ పెద్దపీట వేస్తారు. విచ్ఛిన్నవాదాలకు ఎప్పుడూ ఇది కేంద్రంగా లేదు. ఈ యూనివర్శిటీ నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో మేధావులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తయారయ్యారు. ఏ చర్చా ఇంతవరకు-అది ఏ తరహాకు చెందినదైనా-భౌతిక ఘర్షణలకు దారి తీయలేదు. అదే దీని ప్రత్యేకత. కానీ ఈ ఉదంతంలో ఆర్‌యస్‌యస్‌కు చెందిన విద్యార్థి సంఘం ఎబివిపి ఎదుటి వారిపై దాడికి పూనుకుంది. ఆ విషయం తెలుసుకున్న యూనియన్‌ నాయకులు, అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌ (ఎఐఎస్‌ఎఫ్‌) నాయకత్వంలో అక్కడకు చేరుకొని ఘర్షణను నివారించడానికి ప్రయత్నించారు. రెండు మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తుల మధ్య ఘర్షణ అనివార్యంగా వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. దాన్ని నివారించినందుకు వారిని అభినందించాల్సింది పోయి కేసులు పెట్టి వేధిస్తున్నారు. అక్కడి నుంచి వారంతా ఊరేగింపుగా గంగా డాభా(ప్రాంగణంలోనే చర్చల బహిరంగ కూడలి) వద్దకు వచ్చారు. అక్కడే కన్నయ్యకుమార్‌ ప్రజాస్వామిక హక్కులు, సామాజిక న్యాయం, మతోన్మాద ప్రమాదం గురించి ఉపన్యసించాడు. అది యూట్యూబ్‌లో దొరుకుతుంది. ఎవరైనా చూడొచ్చు. తమ పథకాన్ని చెల్లుబడి కాకుండా చేశాడన్న అక్కసుతో బిజెపి, ఎబివిపి నాయకులు స్థానిక యంపీని తీసుకొని వెళ్లి కేసు పెట్టారు. రాజద్రోహ నేరం కింద కన్నయ్యకుమార్‌ను అరెస్టు చేశారు. ఇదీ జరిగిన ఘటన. ఈ ఘటన జరిగిన వెంటనే ఎస్‌ఎఫ్‌ఐ ఈ రెండు ఘటనలను ఖండించింది. ఒకటి జాతి వ్యతిరేక, విచ్ఛిన్నకర నినాదాలివ్వడం తప్పు, రెండు వారిపై దాడి చేయడం, భావ వ్యక్తీకరణను అణచివేయాలనుకోవడం తప్పు. ఎబివిపి దాడికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో అశాంతి సృష్టించొద్దని వేలాది మంది విద్యార్థులు అప్పటికప్పుడు పోగై ఊరేగింపు తీశారు. దీనికీ, మొదటి సభకూ సంబంధం లేదు. ఇది ప్రజాస్వామిక హక్కుల కోసం సాగిన సభ. ఈ వైఖరి తీసుకున్నందుకే ఎస్‌ఎఫ్‌ఐపై జాతి వ్యతిరేకులన్న ముద్రవేసి డార్జిలింగ్‌, డెహ్రాడూన్‌, లక్నో కార్యాలయాలపై, ఆఖరికి ఢిల్లీ సిపియం ఆఫీసుపై దాడులకు దిగారు. ఎవరో కొంతమంది దారితప్పిన యువకులు నినాదా లిచ్చారన్న పేరుతో మొత్తం జెఎన్‌యుపైనే దాడికి పూనుకో వడం, క్యాంపస్‌నంతా పోలీసులతో నింపడం తప్పు కాదా?
తప్పెవరిది? శిక్ష ఎవరికి?
ఇందులో ఎవరి తప్పిదం ఎంత? నిజంగా సంఘపరివారానికి జాతి పట్ల గౌరవం, దేశభక్తి ఉంటే రెండు ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలి. ఒకటి, ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారని అంటున్నారో వారిపై కేసులు పెట్టకుండా, వారిని అరెస్టు చేయకుండా దాన్ని నివారించ డానికి పోయిన వారిపై ఎందుకు కేసులు పెట్టారు? కన్నయ్య ఈ మీటింగును ఆర్గనైజ్‌ చేశాడా? ఉపన్యాసం ఇచ్చాడా? రెచ్చగొట్టాడా? దేని ఆధారంగా చర్య తీసుకుంటారు? టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఆ ఘటన జరిగిన ఏడు నిముషాల వీడియోను పెట్టారు. దాన్ని ఎబివిపి విడుదల చేసింది. అందులో నినాదాలు ఇస్తున్నవారి పక్కన కన్నయ్య లేడు. ఎక్కడో ఉన్నాడు. ఆయన నినాదాలు ఇచ్చాడని కూడా వారు చెప్పడం లేదు. కేవలం అలాంటి నినాదాలు ఇస్తుంటే నివారించకుండా ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఆ నినాదాలు ఇస్తున్నవారెవరో మాత్రం ఇంతవరకు చెప్పలేదు. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న మరో వీడియోలో (అది కూడా ఒక ఛానల్‌ తీసిందే) ఆ నినాదాలిస్తున్నవారు ఎబివిపి వారని స్పష్టంగా కనిపిస్తోంది. మొదట మీటింగు పెట్టుకున్నవాళ్ల స్థలం వేరు... ఇది వేరు... ఈ రెంటిని కలగలిపి నినాదాలిస్తున్న గుంపులో కన్నయ్య ఉన్నాడు కాబట్టి అతను కూడా దేశద్రోహే అని ముద్ర వేశారు. వారు నినాదాలిస్తున్నప్పుడు పోలీసులు కూడా ఉన్నారు. వారేం చేస్తున్నారు? ఎందుకు గుర్తు పట్టి అరెస్టు చేయలేదు? ఇలాంటి వారి మీటింగుకు అడ్మినిస్ట్రేషన్‌ ఎలా అనుమతిం చింది? ఎబివిపి లెక్కల ప్రకారం వీరు కూడా దేశద్రోహులే కదా? ఆ తర్వాత మూడు రోజులకు క్యాంపస్‌లో పోలీసులు జొరబడి అణువణువూ గాలించి విద్యార్థులను ఎందుకు భయభ్రాంతులకు గురి చేశారు? ఎవరి ప్రయోజనాల కోసం? క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులంతా ఉగ్రవాదులూ, జాతి వ్యతిరేకులనేగా వారి భావం. మొత్తం జెఎన్‌యు క్యాంపస్‌నే మూసివేయాలని ఇప్పుడు వారు డిమాండు చేస్తున్నారు. ఆ లెక్కన భారతదేశంలో ఉగ్రవాదులున్నందుకు మొత్తం దేశాన్నే మూసేస్తారా?
ఆర్‌యస్‌యస్‌ దేశభక్తి ఎంత?
సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో (1962 కేదార్‌నాథ్‌ కేసు నుంచి 2015 శ్రేయా సింఘాల్‌ కేసు వరకు) ప్రత్యక్షంగా హింసాత్మక చర్యలకు రెచ్చగొడితే తప్ప నినాదాలివ్వడం, ఉపన్యాసాలు చేయడం దేశద్రోహ నేరం(ఐపిసి సెక్షన్‌ 124ఏ) కిందకు రాదని తీర్పులిచ్చింది. దాని ప్రకారం వీరు దేశద్రోహులవుతారా? లేక ఆ తీర్పులిచ్చిన సుప్రీంకోర్టును కూడా వీరు దేశద్రోహులుగా ముద్రవేస్తారా? కేవలం తమకు సమ్మతం కాని సభ జరుపుకున్నందుకే జాతి వ్యతిరేకమని దాడి చేసిన ఎబివిపి, ఆర్‌యస్‌యస్‌ గణం నిన్నకాక మొన్న పఠాన్‌కోట సైనిక కేంద్రం మీద ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ప్రత్యక్షంగా వెళ్లి ఉగ్రవాదుల్ని ఎందుకు ఎదుర్కోలేదు. వీళ్లను పక్కన పెడదాం. నేరుగా ప్రభుత్వంలో ఉన్న బిజెపి మంత్రులు-ప్రధానిని పక్కన పెట్టండి, కనీసం రక్షణ, హోం మంత్రులైనా వెళ్లి స్పాట్‌లో ఉండి కనీసం వీర జవాన్లకు నైతిక మద్దతునైనా ఇవ్వొచ్చు కదా? తీరిక లేదా? అయిదు రోజులు దేశమంతా ఉత్కంఠతో ఉంటే ఈ మంత్రులు దేశాటనకు బయలు దేరారు. ఇదేనా వీరి దేశభక్తి? దీనికి వారం ముందు ప్రధాని మోడీ చెప్పాపెట్టకుండా హఠాత్తుగా లాహోర్‌లో దిగి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను కౌగలించుకొని విందారగించి రాలేదా? దానికేమంటారు. వారిది దేశభక్తి. ఇతరులది దేశద్రోహమూనా? 168 మంది ప్రాణాలు బలిగొన్న ముంబయి ఉగ్రవాద దాడికి ఆది పురుషుడు హెడ్లే. ఇతను అమెరికా, పాకిస్తాన్‌కు ఉమ్మడి ఏజెంటు. అతన్ని అమెరికా నుంచి ఇక్కడకు తీసుకొచ్చి ఎందుకు ఉరి తీయలేక పోయారు? అతనికి ఆశ్రయమిచ్చిన అమెరికాపై మాట కూడా పడనీయడం లేదు. పైగా అతన్ని అప్రూవర్‌గా ప్రకటించి క్షమాభిక్ష పెట్టారు. నిందితుణ్ణి సాక్షిగా మార్చారు. అతన్ని అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారిస్తున్నారు. అతనిచ్చిన సమాచారంతో గుజరాత్‌ ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమన్నా ఉంటుందా? కాశ్మీర్‌ వేర్పాటువాదులకు అమెరికా మద్దతిస్తోంది. అలాంటి అమెరికాతో బిజెపి ప్రభుత్వం ఎలా దోస్తీ చేస్తోంది. అంతెందుకు. 1999లో వారు అధికారంలో ఉండగా కాందహార్‌ హైజాక్‌ కేసులో ఉగ్రవాదులను చెర నుంచి విడిపించి గౌరవమర్యాదలతో సాగనంపలేదా? అప్పు డేమైంది వీరి దేశభక్తి? వామపక్షాలను పాక్‌ పంచమాం గదళం (గూఢచారులు) అంటున్నారు. పాక్‌ పాలకులతో, మతపెద్దలతో, సైన్యంతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న దెవరు? కమ్యూనిస్టులకు ఇలాంటి చరిత్ర ఉందా? బిజెపి నాయకులే ఒకరిపై ఒకరు నిందలేసుకొని వీధిన పడలేదా? 
విచ్ఛిన్నవాదానికి బలైందెవరు?
గాంధీని చంపిన గాడ్సేకు గుడులు కట్టించి పూజలు చేస్తుంటే అది వారికి తప్పుగా కనిపించదు. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటే నేరంగా కనిపిస్తుంది. రోజూ విదేశాలకు సాగిల పడితే అది దేశభక్తి. ఈ దేశం సమైక్యంగా ఉండాలి. హిందూ ముస్లిం ఘర్షణలొద్దు అంటే దేశద్రోహం. ఇది వారి ద్వంద్వ నీతి. స్వాతంత్య్రోద్యమంలో ఏ మాత్రం పాత్ర లేనివారు, పంజాబ్‌, అస్సాం విచ్ఛిన్నకర ఉద్యమాలను ఎదుర్కోవడంలో వెన్నుచూపినవారు దేశభక్తిని గురించి ఉపన్యసిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంటుంది. పైగా అస్సాంలో దేశాన్ని విడగొట్టాలని ఉద్యమించిన వారితో కలసి ఎన్నికల్లో పోటీ చేసింది బిజెపి. ఎబివిపి ఆ ఉద్యమంలో ముఖ్యపాత్రధారి. ఈరోజు జమ్మూకాశ్మీర్‌లో పిడిపితో కలసి వారు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు. అఫ్జల్‌గురు ఉరి ఉదంతంలో పిడిపి పాత్ర ఏమిటి? వారు దాన్ని వ్యతిరేకించారా? కాశ్మీర్‌ ఉగ్రవాదం పట్ల పిడిపి వైఖరి ఏమిటి? అవేమీ తెలియకుండానే వారితో కలసి పాలన చేస్తారా? వారి సిద్ధాంతం ప్రకారం జాతి వ్యతిరేకులకు మద్దతిచ్చేవారంతా జాతిద్రోహులే. మరి పిడిపితో స్నేహం నెరిపిన బిజెపి ఏమవుతుంది? ఇలాంటి వారు కమ్యూనిస్టు లను దేశద్రోహులని నిందిస్తున్నారు. 1980లలో పంజాబ్‌, అస్సాంలలో, నేడు కాశ్మీర్‌లో విచ్ఛిన్నకర వాదాన్ని ఎదుర్కొని బలవుతున్నది కమ్యూనిస్టులు. వారికి ఆర్‌యస్‌యస్‌ దేశభక్తి గురించి పాఠాలు చెప్పడం సాహసమే.
రాజకీయ కుతంత్రం
ఈజాతి వ్యతిరేక రాగాలు తీస్తున్నది దేశంపై ప్రేమతో కాదు. గద్దెపై శాశ్వతంగా కూర్చోవాలన్న మోజు. దానికి ప్రతిపక్షాలను దెబ్బతీయాలి. తాము తప్ప అందరూ దేశద్రోహులేనని ముద్రవేసి దెబ్బతీయాలి. మోడీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తవుతున్నాయి. ఇంతవరకు ఒక్కటంటే ఒక్క వాగ్దానమూ అమలు చేయలేదు. పైగా ఆర్థిక పరిస్థితి అడ్డదిడ్డంగా తయారైంది. నిరుద్యోగం ప్రబలు తోంది. యువతలో నైరాశ్యం ముంచుకొస్తోంది. అది క్రమంగా మోడీకి ఎదురు కొడుతుంది. అనేక ఎన్నికల్లో ఓటములెదుర్కొన్నారు. అభివృద్ధి మంత్రం గాలికెగిరి పోయింది. ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికే వారీ అస్త్రం బయటకు తీశారు. అంతేకాదు రోహిత్‌ ఘటన తర్వాత సామాజిక న్యాయం, దళితోద్ధరణపై వారి నిజస్వరూపం బట్టబయలైంది. దాన్నుండి తమను తాము కాపాడుకోవాలి. అందుకే ఈ నాటకమంతా. ఉన్నవి, లేనివి సృష్టించి ప్రతిపక్షాలపై, ప్రత్యేకించి వామపక్షాలపై కక్షగట్టి వ్యవహరిస్తున్నారు. రానున్న కేరళ, బెంగాల్‌ ఎన్నికల్లో ఎలాగైనా వామపక్షాలను అధికారానికి రానీయకూడదన్న దుగ్ధ కనిపిస్తోంది. దాని కోసం అబద్ధాలు సృస్టిస్తున్నారు. కొత్త సంస్థల పేరుతో దాడులు సాగిస్తున్నారు. జెఎన్‌యులో వారే నినాదాలిచ్చి వాటిని వామపక్ష విద్యార్థి సంఘాలకు ఆపాదించారు. ఆప్‌ సేన పేరుతో కొందరు దుండగులను ప్రోత్సహించి సిపియం ఆఫీసుపై దాడికి ఉసిగొల్పారు. కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్‌సయ్యద్‌ పేరుతో దొంగ ట్విట్టర్‌ అకౌంటు సృష్టించి ఆ పేరుతో విద్యార్థి ఉద్యమాన్ని అతను సమర్థిస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. అది వట్టిఫేక్‌ అని తేలడంతో నోరు మూసుకున్నారు. దాన్ని మొదట ట్వీట్‌ చేసింది అగర్వాల్‌ అనే అతను. కానీ అతన్నింత వరకు పట్టుకోలేదు. దాన్ని రీ ట్వీట్‌ చేసి మోగించింది ఢిల్లీ పోలీసు, కేంద్ర హోం మంత్రి. ఇలాంటి దేశ వ్యతిరేక ప్రచారానికి పాల్పడినందుకు వీరిపై చర్య తీసుకోనవసరం లేదా? సోమవారం పాటియాలా కోర్టులో కన్నయ్య కుమార్‌ను ప్రవేశపెట్టే సమయంలో నల్లగౌన్లు వేసుకొని టీచర్లు, విద్యార్థులు, జర్నలిస్టులపై దాడికి దిగింది ఆర్‌యస్‌యస్‌ కార్యకర్తలు. వారికి ప్రత్యక్షంగా తోడ్పడింది బిజెపి ఎమ్మెల్యే శర్మ. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కనీసం కోర్టుల్లోనైనా ప్రశాంతతను కాపాడాలన్న ఇంగితజ్ఞానం కూడా వారికి లోపించింది. ఈ ఘటనలన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవే. దేశం మొత్తాన్ని జాతి వ్యతిరేక-అనుకూల పేరుతో చర్చల్లోకి దించి తమ వైఫల్యాన్ని కప్పెట్టుకోవడం, ప్రతిపక్షాలను దెబ్బతీయడం అనే ద్విముఖ వ్యూహంతో బిజెపి సాగించిన రాజకీయ కుతంత్రం ఇది. దేశం యావత్తూ వాస్తవాలు తెలుసుకొని ఇలాంటి శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వారెంత గీపెట్టుకున్నా కమ్యూనిస్టుల దేశభక్తిని ఈ దేశ ప్రజలెవ్వరూ శంకించరు. సూర్యుడి మీద ఉమ్మెయ్యాలనుకుంటే అది తిరిగొచ్చి వారి మొహాన్నే పడుతుంది.
(వ్యాసకర్త సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు)
- వి శ్రీనివాసరావు