ఛార్జీల బండ..

ముఖ్యమంత్రిగా కాక మాంచి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా మన్ననలందుకోవాలని తాపత్రయ పడుతున్న చంద్రబాబు ఏలుబడిలో ప్రజల పరిస్థితి చెంప దెబ్బ గోడ దెబ్బ అన్నట్లు తయారైంది. అమరావతి శిలాన్యాస్‌ సంరంభంలో ప్రత్యేక హోదాపై స్పష్టత రాక నిరాశ చెందిన ప్రజలు తమ నెత్తిన పడేందుకు వరుస కట్టిన సర్కారీ ఛార్జీల బండలపై మరింతగా కలత చెందుతున్నారు. రాజధాని శంకుస్థాపన మరుసటి రోజే ఆర్టీసి బస్‌ ఛార్జీలు బాది ప్రయాణీకుల తల బొప్పి కట్టించగా, అతి త్వరలోనే ట్రూ అప్‌ పేరుతో వినియోగదారులకు విద్యుత్‌ షాక్‌ ఇచ్చేందుకు బాబు ప్రభుత్వం సిద్ధమైంది. సర్కారు వాలకం చూస్తుంటే ఎప్పుడు ఏ రూపంలో ఏ భారం పిడుగుపాటు అవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా అలముకున్నాయి. జనాన్ని ఇబ్బంది పెట్టకూడదన్న మనసు సర్కారుకు ఉంటే విద్యుత్‌, బస్సు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారం వెలగబెట్టిన రోజుల్లో బాబు తన 'మనసులో మాట'గా రాసుకున్నారు. నాటి మాటపైనే ఉన్నానని రూఢ చేస్తున్నారు. త్వరలో బాదడానికి సిద్ధం చేసుకున్న రూ. వేల కోట్ల ఎలక్ట్రిసిటీ ట్రూ అప్‌ ఛార్జీల వ్యవహారం మరీ దారుణం. ట్రూ అప్‌ అంటే వినియోగదారుల నుంచి పాత బకాయిలను ఒకేసారి ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమం. అప్పుల వసూళ్లకు ఆర్థిక సంస్థలు ఇచ్చే వన్‌ టైం సెటిలిమెంట్‌ ఆఫర్‌లో రాయితీ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఛార్జీల విషయంలో అలాంటిదేం లేదు. ఐదేళ్ల కాలంలో వాడుకున్న విద్యుత్‌ బిల్లుల్లో లోటును ఒకేసారి కట్టి తీరాలి. ఎప్పుడో ఒక వస్తువు అమ్మి అప్పుడొచ్చిన నష్టానికి ఇప్పుడు పరిహారం చెల్లించమనే అసంబద్ధ చర్య ఇంధన సర్దుబాటు సర్‌ ఛార్జీ (ఎఫ్‌ఎస్‌ఎ). రూ.వేల కోట్ల ఎఫ్‌ఎస్‌ఎలను గత ప్రభుత్వం వసూలు చేసింది. మళ్లీ పాత బకాయిలంటూ 2009-10 నుంచి 2013-14 సంబంధించి ట్రూ అప్‌ పేర ఏకంగా రూ.ఏడు వేల కోట్ల వడ్డనకు బాబు సర్కారు సిద్ధపడటం దుర్మార్గం.
ప్రపంచబ్యాంక్‌ విధానాల పరంపరలో బాబు హయాంలో విద్యుత్‌ నియం త్రణ మండలి (ఇఆర్‌సి) వచ్చింది. ఛార్జీలు పెంచేది సర్కారు కాదు ఇఆర్‌సి అని తప్పించుకోడానికి తప్ప ఆ సంస్థ ఏనాడూ ఛార్జీలు తగ్గించమని చెప్పలేదు. సర్కారు భరించే నిధులను బట్టి ఇఆర్‌సి తీర్పులుంటాయి, అది నిర్వహించే బహిరంగ విచారణలు కంటి తుడుపు కోసమేనని గత అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కం) ప్రతిపాదించిన ట్రూ అప్‌ ఛార్జీలపై జరుగుతున్న బహిరంగ విచారణ తంతు ఆ కోవలోనిదే. ప్రభుత్వ కనుసన్నల్లో డిస్కంలు నడుస్తాయన్నది దాచినా దాగని సత్యం. ప్రైవేటు రంగంలో సౌర, పవన విద్యుత్‌ డెవలపర్లకు వీలింగ్‌ ఛార్జీలు, ట్రాన్స్‌మిషన్‌ ఖర్చులూ తానే భరిస్తానం టోంది సర్కారు. రైతుల ఉచిత విద్యుత్‌ సరఫరా ఛార్జీలను భరించకుండా ట్రూ అప్‌లో కలిపి ప్రజల నెత్తిన వేయడం దారుణం. హైకోర్టు తీర్పుతో నిలిచిపోయిన 2009-10 ఎఫ్‌ఎస్‌ఎ కూడా ట్రూ అప్‌లో వేశారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎ), బొగ్గు దిగుమతుల్లో అవకతవకలు, అక్రమాల వాటా ట్రూ అప్‌లోనే. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రైల్వేల నుంచి వసూలు కావాలిన బకా యిలూ, విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలు పెంచడం వలన కలిగిన నష్టం అందులోనే. అదనపు ఆదాయం వస్తే ఆ ఫలాలను వినియోగదారులకు పంచాల్సింది పోయి ఆదాయపు ఖర్చు కూడా ట్రూ అప్‌ రూపంలో ప్రజలపైనే. ఉద్యోగుల వేతనాలూ అందులోనే. తరుగుదల లెక్కింపులో సిఇఆర్‌సి మార్గదర్శకాలు పాటించడం లేదు. డిస్కంల కాకి లెక్కలు, అశాస్త్రీయ, అనాలోచిత విధానాలే ఛార్జీల పెరుగుదలకు హేతువులు. అయినా డిస్కంలు చెప్పిందే సర్కారుకు వేదం. 
శుక్రవారం అర్థరాత్రి నుంచి పెరిగిన బస్సు ఛార్జీలదీ ఇదే వరస. కేంద్రం డీజిల్‌ ధర పెంచింది కనుక మేం ప్రయాణీకుల టిక్కెట్‌ ఛార్జీలు పెంచుతున్నామని ఆర్టీసి చెప్పడం ఆనవాయితీ. డిజీల్‌ రేటు పది రూపాయలు తగ్గినా ఆర్టీసి రూ.350 కోట్ల మేర ఛార్జీలు మోదింది. వెన్నెల స్లీపర్‌ తప్ప అన్ని బస్సుల్లో మోత మోగించింది. గ్రామీణ రూట్లలో తిరిగే తెలుగు వెలుగు ధరలూ ఐదు శాతం పెంచి పల్లె జనం జేబులకు చిల్లులు పెట్టడం ఘోరం. ప్రభుత్వ సాయం సంగతేమో కనీసం ఆర్టీసి వినియోగిస్తున్న డీజిల్‌పై వ్యాట్‌, సర్‌ఛార్జి, మోటార్‌ వెహికిల్‌, టోల్‌ ట్యాక్స్‌లను రద్దు చేయాలని, రాయితీ ఇవ్వాలని సంస్థ, కార్మికులు కోరినా సర్కారులో స్పందన లేదు. ప్రైవేటు అక్రమ రవాణాను అరికడితే ఆర్టీసి బాగు పడుతుందని నిపుణులు మొత్తుకుంటున్నా చలనం లేదు. ప్రైవేటు ఆపరేటర్లకు లాభం చేకూర్చేందుకు, ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు సర్కారు కంకణం కట్టుకుంది కనుకనే ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలు పెంచింది. గతంలో ఆర్టీసీని ప్రైవేటీకరించాలని ప్రయత్నించిన బాబు కార్మికులు, ఉద్యోగుల ప్రతిఘటనతో వెనక్కి తగ్గారు. మళ్లీ ప్రైవేటు బాట ఎంచుకున్నట్టున్నారు. ఎలక్ట్రిసిటీ సహా వేటి ఛార్జీలూ పెంచేది లేదని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బాబు ఒకసారి విద్యుత్‌, బస్‌ ఛార్జీలు మోపారు. ట్రూ అప్‌ రూపంలో వేల కోట్ల బండను రెడీ చేశారు. అన్ని హామీలకు మాదిరిగానే దీన్నీ తుంగలో తొక్కడం నమ్మక ద్రోహమే.