'చోడవరం సుగర్స్‌' పాలకవర్గం రాజీనామా చేయాలి

        చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీలో జరిగిన అవినీతి బాధ్యత వహించి పాలకవర్గం రాజీనామ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. హుదూద్‌ తుపాన్‌ పంచదార అమ్మకాల్లో ఫ్యాక్టరీలో చోటు చేసుకొన్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. హుదూద్‌ తుపాన్‌లో రూ.100 కోట్లు నష్టం వచ్చినట్లు అప్పట్లో సుగర్స్‌ చైర్మన్‌ చెప్పారని, వెనువెంటనే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అంత నష్టం వాటిల్లలేదని, నష్టంపై స్పష్టత లేదని తెలిపారు. పంచదార అమ్మకాల్లో చోటుచేసుకున్న అవినీతిపై చేపట్టిన విచారణ కేవలం ఇన్సూరెన్స్‌ నేపథ్యంలోనే జరిగిందని చెప్పారు. అలా కాకుండా పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి పంచదార అమ్మకాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పాలకవర్గం అనుమతులు లేకుండా ఫ్యాక్టరీలో ఏ ఒక్క పనిచేసే అవకాశం లేదని, అందువల్ల విచారణలో అధికారులే బాధ్యులని తేల్చడం సరికాదు. అలాగే పాలకవర్గం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే రాజీనామా చేయాలన్నారు. 
జిల్లాలో ప్రధాన పంట చెరకు అని, దీని ఆధారంగా రైతులు జీవిస్తున్నారని తెలిపారు. పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే అందరూ అధికార పార్టీకి చెందిన వారేనని, ఫ్యాక్టరీని ఆదుకోవాలంటే వారికి ఏమంత పని కాదని చెప్పారు. గత ప్రభుత్వం టన్ను చెరకుకు రూ.200 ప్రోత్సాహకం అందించిందని, టిడిపి ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించడం లేదని పేర్కొన్నారు. సహకార ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తుందని విమర్శించారు. అందులో భాగంగా వీటిని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్‌ చేయలేదని, కొత్తగా ఫ్యాక్టరీలో తమ పార్టీకి చెందిన వారిని నియమించుకుంటున్నారని తెలిపారు. దీనిలో ఎక్కడా అర్హతకు చోటులేదన్నారు. ఫ్యాక్టరీని లాభాల్లో నడిపించి, వాటి ద్వారా రైతు, కార్మికుల ప్రయోజనాలను కాపాడవలసి ఉందన్నారు. గతేడాది పంచదార అమ్మకాల కంటే ఈ ఏడాది క్వింటా రూ.3,300 అమ్ముతుందని, దీని ద్వారా ఫ్యాక్టరీకి కొంత డబ్బు అధనంగా సమకూరే అవకాశముందని వెల్లడించారు. దీంతోనైనా ఇప్పటి వరకు ఉన్న పాత బకాయిలను పూర్తిగా చెల్లించాలని కోరారు. సుగర్స్‌లో చోటు చేసుకుంటున్న అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.