గురజాడ పఠనమందిరం ప్రారంభం

సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, అందుకు గ్రంథాలయోద్యమం మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద పిలుపునిచ్చారు. విజయవాడ ఆకుల వారి వీధిలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాకవి గురజాడ పఠన మందిరాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎంతటి సమాచారం ఉన్నా అది గ్రంథాలయాల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తుం దన్నారు. మహాత్మాగాంధీ నుంచి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వరకు గొప్ప నాయకులంతా గ్రంథాలయాల్లోనే ఎక్కువ సమయం గడిపారన్నారు. చిన్నతనం నుంచి తమకు నచ్చిన పుస్తకాలను చదవనిస్తే, పిల్లలకు పుస్తక పఠనం అల వాటుగా మారుతుందని చెప్పారు. పాఠకుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుందే కానీ, గ్రంథాలయాల్లో సౌక ర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయ న్నారు. ఈ దీన స్థితి నుంచి గ్రంథాలయాలను మెరుగు పరచాలని చెప్పారు.