కౌలు రైతుల భవితవ్యం ..?

రాజధాని గ్రామాల్లో కౌలు రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాల్లో వ్యవసాయం ఉపసంహరణతో కౌలు రైతుల జీవనం అగమ్యగోచరంగా మారింది. రాజధాని ప్రాంతంలో మొత్తం 22 వేల మంది భూమి ఉన్న రైతులు ఉండగా వీరిలో 40 శాతం మంది రైతులు నేరుగా వ్యవసాయం చేయరు. వీరు ఎక్కువగా భూములను కౌలుకు ఇస్తారు. కొందరికి ఈ గ్రామాల్లో భూములు ఉన్నా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివశిస్తూ ఏడాదికి ఒకటి రెండు సార్లు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారు. అలాగే మరికొందరు రైతులు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో స్థిరపడి వారి భూములను కౌలుకు ఇస్తుంటారు. మొత్తం మీద 29 గ్రామాల పరిధిలో 4,230 మంది కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు గత కొన్నేళ్లుగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే రాజధాని నిర్మాణం వల్ల ఈ గ్రామాల్లో వ్యవసాయం లేక కౌలు రైతులు ఎక్కడికి వెళ్లాలనే అంశంలో ఏటూ తేల్చుకోలేక పోతున్నారు. అలాగే గతంలో బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని భావించిన రైతులకు ఇంత వరకూ మాఫీ జరగకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. సాధారణ రుణ మాఫీ ఇంత వరకూ పూర్తి కాలేదు. కౌలు రైతులు కేవలం బంగారం తాకట్టుతోనే తీసుకున్న రుణాలు ఎప్పటికి మాఫీ అవుతాయన్నదీ ప్రశ్నార్ధకంగా మారింది. అంతేగాక ఇతర ప్రాంతాలకు వెళ్లి కౌలుపై వ్యవసాయం చేసేందుకు మెజార్టీ రైతులు తటపటాయిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే స్థిరపడి ఇతర ప్రాంతాలకు వెళ్లలేక, ఇతర రంగాల్లోకి వెళ్లేందుకు పెట్టుబడులు లేక తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ వల్ల ఇతర ప్రాంతాల్లో కూడా కౌలు ధరలు పెరగడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజధాని గ్రామాల్లో మెట్ట భూములకు ఎకరాకు ఏడాదికి రూ.30వేలు, జరీబు భూములకు ఎకరాకు రూ.50 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో జిల్లాలోని ఇతర వివిధ ప్రాంతాల్లో మెట్టకు ఎకరాకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు, మాగాణి భూములకు ఎకరాకు రూ.18 నుంచి రూ.25 వేల వరకూ ఉంది. దీంతో రాజధాని రైతులను ఒప్పించేందుకు ఇచ్చిన ప్యాకేజీ ఇతర ప్రాంతాల్లోని కౌలు రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో 29 గ్రామాలకు చెందిన కౌలు రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి అదనపు కౌలు చెల్లించి సేద్యం చేసేందుకు ఇష్టపడటం లేదు. ఇతర ప్రాంతాల్లో బంధువర్గం ఉన్న వారు మాత్రం స్వల్ప సంఖ్యలో రాజధాని గ్రామాల నుంచి తరలివెళ్లి భూములను కౌలుకు తీసుకుని సేద్యానికి ఉపక్రమిస్తున్నారు. అయితే 90 శాతం మంది రైతులు ఈ గ్రామాల్లోనే ఎటువంటి పనులు లేక అల్లాడుతున్నారు. చేసేందుకు పనిలేక కుటుంబాలు పోషించలేక తీవ్ర ఇబ్బందులను చవి చూస్తున్నారు. గతంలో భూస్వాములతో ఉన్న సాన్నిహిత్యం వల్ల అవసరమైన సందర్భంలో వీరికి అప్పులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రుణాలు ఇవ్వడం మానేశారు. అంతేగాక ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు రూ.2500 పింఛన్‌ ఇస్తామని చెప్పినా ఇంత వరకూ దానిని కూడా విడుదల చేయలేదు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి పింఛన్‌ ఇస్తామనీ, మొత్తం బకాయిలు కూడా చెల్లిస్తామనీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వారం క్రితం ప్రకటించారు. కానీ ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. గత మూడు నెలలుగా సామాజిక, ఆర్థిక సర్వే కొనసాగుతోంది. సర్వే, రీ సర్వే పేరుతో తీవ్ర కాలయాపన జరుగుతోంది. ఈ సర్వే కూడా తప్పుల తడకగా ఉందని విమర్శలు వస్తున్నాయి.