కెకెలైన్‌తో కూడిన రైల్వే జోన్‌ ప్రకటించాలి- సిపియం

విశాఖకు కెకె లైన్‌తో కూడిన రైల్వేజోన్‌ ప్రకటించాలని సిపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం విశాఖ రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, రైల్వేజోన్‌పై జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చడానికి కమిటీల పేర నాన్చుతూ బిజెపి కుట్ర పన్నిందని విమర్శించారు. రైల్వేజోన్‌పై జాప్యం ఒడిశా అభ్యంతరాల వల్ల కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పారిశ్రామిక హబ్‌, ఆర్థిక రాజధాని కావాలంటే రైల్వే జోన్‌ అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈస్ట్‌కోస్ట్‌ డివిజన్‌లోనే కాకుండా దేశంలోని రైల్వే డివిజన్ల అన్నింటా వాల్తేరు డివిజన్‌ ఆదాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. బిజెపి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దాదాలను అమలు చేసేలా తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఎపికి స్పెషల్‌ కేటగిరి స్టేటస్‌ ఇవ్వడంలో ఇలాగే నీరుగార్చారని విమర్శించారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌, హెచ్‌పిసిఎల్‌, గంగవరం పోర్టు, విశాఖ పోర్టు, ఎన్‌టిపిసి, బిహెచ్‌పివి, షిప్‌యార్డు, ఎస్‌ఇజెడ్‌లు వంటివి అనేక భారీ పరిశ్రమలు ఉన్నాయని, అత్యద్భుతమైన రోడ్డు, నీటి కనెక్టివిటీ కూడా విశాఖకు ఉందని, రైల్వే జోన్‌ వస్తే విశాఖ సహా ఉత్తరాంధ్ర అంతటికీ మేలు జరుగుతుందని అన్నారు. ఈ ధర్నాలో సిపిఎం జగదాంబ జోన్‌ కార్యదర్శి జిఎస్‌ రాజేశ్వరరావు, ఉత్తరాంధ్ర అభివృద్ధిక నాయకులు పిబి గణేష్‌, సిపిఎం నాయకులు వై అప్పారావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు చలపతిరావు, పోలేశ్వరరావు, సుబ్బారావు, ఆర్‌కెవిఎస్‌ కుమార్‌, అనపర్తి అప్పారావు, నరేంద్రకుమార్‌, ఆర్‌పి రాజు, చిట్టిరాణి, కుమారి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖకు రైల్వేజోన్‌పై సిపిఎం చేపట్టిన ఆందోళనకు పేద, మధ్యతరగతి, ధనికులు, వ్యాపారవేత్తలు, మేథావులు అందరూ సంఘీభావాన్ని తెలిపారు. నగరం నడిబొడ్డున రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం ఉండడంతో వచ్చి పోయే వాహనదారులంతా సిపిఎం చేస్తోన్న కార్యక్రమాన్ని పెద్దఎత్తున హర్షించారు. పలువురు రోడ్డున వెళుతూ 'మీ (సిపిఎం) పుణ్యానైనా మనకు జోన్‌ వస్తే చాలా సమస్యలు తీరిపోతాయని, రైళ్ల సంఖ్య, లైన్ల సంఖ్య పెరిగి ఇబ్బందులు తొలగిపోతాయంటూ' ఆందోళనకు మద్దతు తెలిపారు.