కుహనా దేశభక్తుల ఆట కట్టించాలి..

కుహనా దేశభక్తి పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి కూటమి సాగిస్తున్న ఏడుపులను, గగ్గోలును సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు ఇంత హంగామా చేస్తున్న ఈ హిందూత్వ ప్రచారకులకు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న రికార్డు లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ పేర్కొన్నారు. పైగా దీనికి విరుద్ధంగా తనను వదిలిపెడితే బ్రిటీష్‌ పాలకులకు అవసరమైన సాయాన్ని అందిస్తానంటూ హిందూత్వ సిద్ధాంత వ్యవస్థాపకుల్లో ఒకరైన వీర్‌ సావర్కార్‌ ముందుకొచ్చారని విమర్శించారు. సామ్రాజ్యవాదాన్ని బుజ్జగించే విధానాన్ని అనుసరించే శక్తులు నిజమైన జాతీయవాదులు కాదని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు గానూ ఈ బూటకపు జాతీయవాదాన్ని ఓడించేందుకు చివరి వరకు తమ పోరాటాన్ని సాగించేవారే నిజమైన జాతీయవాదులు కమ్యూనిస్టులని కరత్‌ పేర్కొన్నారు. ఈ నెల 15న ఇక్కడ ప్రముఖ కమ్యూనిస్టు నేత, స్వాతంత్య్ర పోరాట యోధుడు కామ్రేడ్‌ హరి కిషన్‌ సింగ్‌ సూర్జీత్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రకాష్‌ కరత్‌ ప్రసంగించారు. ఈ సభకు విజన్‌ ధర్‌ అధ్యక్షత వహించగా, మరో పొలిట్‌బ్యూరో సభ్యుడు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించిన సూర్జిత్‌ తమ యావత్‌ జీవితాన్ని కార్మిక, కర్షక, బడుగు వర్గాలు అభ్యున్నతి కోసం ధారపోశారని కొనియాడారు. సామాజిక పరివర్తిన కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారన్నారు. జెఎన్‌యులో ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్న దాడులు, చెన్నైలోని ఎఫ్‌టిఐఐ, ఐఐటిల్లో, హైదరాబాద్‌ యూనివర్శిటీల్లో జరిగిన ఘటనలను ఉదహరిస్తూ కరత్‌, హేతుబద్ధమైన అభిప్రాయ సరళిని అణచివేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ఒక ప్రణాళిక ప్రకారం పాల్పడుతున్న ఎత్తుగడలేనని విమర్శించారు. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
దేశ మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడుతున్నవారు కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు. సామ్రాజ్యవాదం, నయా ఉదారవాదం, హిందూత్వ దూకుడు వైఖరులకు కళ్ళెం వేయాలంటే మనం మరింత పటిష్టంగా ఉద్యమాలు నిర్మించాలని, పోరాటాలు సల్పాలని అదే ఆయనకు మనం అందించే ఘనమైన నివాళి అని కరత్‌ పేర్కొన్నారు. సూర్జీత్‌ విశిష్ట వ్యక్తిత్వాన్ని, ఆయన గుణ గణాలను మాణిక్‌ సర్కార్‌ తన ప్రసంగంలో సవివరంగా పేర్కొన్నారు. విజన్‌ధర్‌ అధ్యక్షపన్యాసం చేస్తూ సూర్జిత్‌ సేవలను గుర్తు చేసుకున్నారు.