కార్మిక సంఘాల ఐక్యగళం:CITU

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ఆగస్టు 17న హిందూ పురం నుంచి బయలుదేరిన బస్సు జాతా శనివారం రాత్రి రాజమండ్రికి చేరుకుంది. ఈ సందర్భంగా బొమ్మన రామచంద్రరావు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్ట్‌ హాల్లో జరిగిన సభలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సమాఖ్య నాయకులు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. ఈ విధానాలను సమ్మె ద్వారా తిప్పికొట్టాలన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం సెప్టెంబర్‌ 2న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. ఈ కుట్రను భగం చేయాలని కోరారు. కార్మిక చట్ట సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు, కార్మికులు ఇళ్లల్లో కూర్చోకుండా రోడ్డుపైకి రావాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ సింగపూర్‌ టీమ్‌ను రాష్ట్రంలో తిప్పి వారికి రాయితీలు ఇచ్చేందుకు చంద్రబాబు నానా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు