కార్మిక చట్టసవరణలు సహించం.

కార్మిక సంఘాలు, కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సాధించు కున్న కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు అన్నారు. పోరాటాల ఫలితంగా 44 కార్మిక చట్టాలు సాధించుకున్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 11 రాష్ట్రాలలో కార్మిక చట్టాలలో సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా చట్టాల్లో సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలో పాలిషింగ్‌ యూనిట్‌లలో పనిచేసే కార్మికులు 70 వేల మంది ఉన్నారు. కార్మిక చట్టాలలో సవరణ చేస్తే 30 వేల నుంచి 40 వేల మంది కార్మికులు హక్కులను కోల్పోతారు. అసంఘటిత రంగ కార్మికులు నాలుగు లక్షల మంది జిల్లాలో ఉన్నారు. వీరికి పని గంటలు ఉండవు, సామాజిక భద్రత లేదు. ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు 28 వేల మంది ఉన్నారు. వీరికి డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్నా బ్యాడ్జీ లేదు. రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బిల్లులో కేవలం ఐదు వేల మంది నమోదయ్యారు. కార్మికుల సమస్యల కోసం సెప్టెంబర్‌ రెండున జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలి.