కార్పొరేట్‌ విధానంతో రైతులే కూలీలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ రంగంలో సన్నకారు రైతులను కూలీలుగా మారుస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసదస్సులో పాల్గొనేందుకు బుధవారం నరసరావుపేట వచ్చిన ఆయన స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో విలేకరులతో మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయాల పట్ల సిపిఎం జేజేలు పలుకుతుందన్నారు. వేముల రోహిత్‌ ఎస్‌సిగా సర్టిఫికెట్‌ ఇచ్చిన గుంటూరు కలెక్టర్‌ నేడు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల బీసీనా, ఎస్‌సినా అనే అంశాన్ని లేవనెత్తుతున్నారన్నారు. నిలకడ లేని నష్టదాయక విధానాలు చాలా ప్రమాదకరమని తెలిపారు. చేతికొచ్చిన మినుము, కంది, పెసర పంటలకు మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. రైతాంగం ఇబ్బందులను తొలగించేందుకు మద్దతు ధరలు కల్పించాలని కోరారు. రూ.7,500లకు మినుమును కొనాలని కోరారు. ధరల స్థిరీకరణ నిమిత్తం రూ.ఐదు వేల కోట్ల నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామన్న మోదీ, బాబులు రైతాంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పంట ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం తోడుచేసి ధరని నిర్ణయించాలని స్వామినాథన్‌ కమిషన్‌ తెలిపిందన్నారు. సుప్రీంకోర్టు ప్రభుత్వాలని ఈ విషయమై అమలు చేయాలని కోరగా తమ వద్ద డబ్బులేదంటూ అసత్యాలను వల్లివేస్తున్నాయన్నారు. మద్దతు ధర రాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. బ్యాంకుల్లో రుణాలను కూడా అందించేందుకు శ్రద్ధ చూపడం లేదన్నారు. నోట్ల రద్దుతో బ్యాంకుకు జమ అయిన రూ.ఆరు వేల లక్షల కోట్లను రైతాంగానికి రుణాలు, రాయతీల రూపంలో అందించాలని కోరారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ, ఇంటికొక ఉద్యోగమన్నా బాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని డిమాండ్‌ చేశారు. చైనాలో రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం కోటిమందికి ఉద్యోగాలు కల్పించినట్లుగా బహిరంగ పరచినట్లు పేర్కొన్నారు. నల్లధనం వెలికితీసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్న మోడీ ఆచరణలో ఆ హామీని అమలు చేయలేదన్నారు. మహిళా పార్లమెంట్‌ సభ్యుల సమావేశం పేరుతో కనీసం మహిళా రిజర్వేషన్‌పై తీర్మానం కూడా చేయలేదని ఎద్దేవ చేశారు. అమెరికాలో ట్రంప్‌ కల్పిస్తున్న అడ్డంకులను ఎదుర్కొనేందుకు కనీసం బాబు, మోదీలు మాట్లాడటం లేదని విమర్శించారు. దీంతో పెళ్లిళ్లు జరగకా, ఉద్యోగ భద్రత కోల్పోయి ఆయోమయంలో అమెరికాలో ఉన్న విద్యార్థులు బాధపడుతున్నారన్నారు.