కమ్యూనిస్టులు బలపడితేనే దేశ పురోగతి

కమ్యూనిస్టులు బలపడితేనే భారతదేశ పురోగతి, అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. పెదనందిపాడు మండలంలోని పాలపర్రులో ఆదివారం పాత బాపట్ల తాలూకా మృతవీరుల స్మారక సభ నిర్వహించారు. ముందుగా జడ్‌పి పాఠశాల నుంచి అమరవీరుల స్థూపం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరతెలంగాణ సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం బడుగు, బలహీనులు సాగించిన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జంపని వెంకటేశ్వర్లు కళావేదికపై నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ కార్మికులు, శ్రామికులు, పేద బడుగు వర్గాల హక్కుల కోసం పోరాడే కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆయా వర్గాల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కమ్యూనిస్టులుంటే తమ ఆటలు సాగవనే భయంతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా ధర్నాలు, నిరసనలు, ప్రశ్నించేవారు లేకుండా అణచివేయాలని కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసులను ఆదేశించారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో మతోన్మాద పోకడలతో కూడిన పరిపాలన కొనసాగుతుందని, మైనార్టీ వర్గాల ప్రజలపై హిందూత్వవాదులు దౌర్జన్యకరమైన విపరీత పోకడలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అసహన పరిస్థితులు పెరిగాయని, అంబేద్కర్‌ వాదులు, అభ్యుదయ వాదులు, యూనివర్సీటీల్లో విద్యార్థులపై దాడులు చేయడం ఆందోళనకరమన్నారు. ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నా చంద్రబాబు గానీ, జగన్‌ గానీ కేంద్రంలోని బిజెపి ప్రశ్నించలేకపోతున్నారన్నారు. బిజెపి అధికారం చేపట్టాక దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై సిఎం చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని ఒకసారి, కేంద్రం ఇవ్వట్లేదని మరోసారి ప్రకటనలు చేస్తున్న సిఎం వైఖరి కారణంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగుతుందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరిట పచ్చటి పంటపొలాలను లాక్కుని రైతులను, కూలీలను, వృత్తిదారులను సంక్షోభంలోకి నెట్టివేశారని విమర్శించారు.