కడపలో రాయలసీమ బస్సుయాత్ర..

బాబొస్తే జాబొస్తుందంటూ కల్లబొల్లిమాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అడ్డం తిరిగారు.. బాబుకేమో వాస్తవంగా జాబొచ్చింది.. ఇక్కడ ఎంఎల్‌ఏగా ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడుకీ ఎంఎల్‌సిగా చోటు దక్కింది.. జాబ్‌ ఇస్తారని నమ్మి ఓటేసిన జనానికేమో కష్టాలొచ్చాయి' అంటూ వామపక్ష నాయకులు ఉద్ఘాటించారు. రాయలసీమ బస్సు యాత్రకు మూడో రోజు చిత్తూరు జిల్లాలో అడుగడుగునా ఆదరణ లభించింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి గాలేరు-నగరి వస్తే తప్ప ఇక్కడ ప్రజల మనుగడ సాధ్యం కాదన్నారు. కండలేరు తాగునీటి పథకాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకొస్తే జిల్లావాసిగా ఉండి చంద్రబాబు రద్దు చేయడం ఈ ప్రాంతం పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నారో అర్ధమవుతుందన్నారు. ప్రతిదానికీ రాయలసీమ బిడ్డనని చెప్పుకోవడం తప్ప ఈ ప్రాంతానికి ఏం చేశారో నిరూపించాలన్నారు. రూ.6,500 కోట్ల విలువ చేసే మన్నవరం పరిశ్రమ తరలిపోతుంటే కనీసం బాబు మాట కూడా మాట్లాడలేదన్నారు. అందుకే వామపక్షాలు బాధ్యతగా ప్రజలను చైతన్యపరచి ప్రభుత్వ తప్పిదాలను చూపించి ఐక్య ఉద్యమాలను నిర్మించేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు వివరించారు. ఈ యాత్ర చిత్తూరు జిల్లా సరిహద్దు మామండూరు వద్ద కడప జిల్లాలోకి ప్రవేశించింది.