ఎమర్జెన్సీ ముందు రోజులకన్నా ఘోర పరిస్థితి..

బెంగాల్‌లో ప్రస్తుతం 1970వ దశకం నాటి దారుణ పరిస్థితులు నెలకొని వున్నాయని రాష్ట్ర వామపక్ష సంఘటన చైర్మన్‌ బిమన్‌ బసు చెప్పారు. కోల్‌కతాలో ఆయనను ఇటీవల ప్రజాశక్తి విలేకరి సందీప్‌ చక్రవర్తి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సమకాలీన జాతీయ, రాష్ట్ర పరిస్థితులపై ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు.
బెంగాల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తారా?
పశ్చిమ బెంగాల్‌లో గత నాలుగున్నరే ళ్ళుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. 'ప్రతీకారం లేదు, మార్పే ఉంటుంది' అన్న నినాదంతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన తృణమూల్‌ ఆ తర్వాత ఆ మాటే మర్చి పోయి వ్యవహరించసాగింది. సిపిఎం, వామపక్షవాదులపై దాడులు ప్రారంభిం చింది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది కమ్యూనిస్టు, వామపక్ష కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వేలాదిమంది ప్రజలు గాయపడ్డారు. ప్రజాస్వామ్యంపై ఎడతెగని దాడులు సాగించడం ద్వారా ప్రజల ప్రజాస్వామిక హక్కులను లాక్కున్నారు. వామపక్షాలపై ముఖ్యంగా సిపిఎం నేతలు, కార్యకర్తలపై వేలాది తప్పుడు కేసులు బనాయించారు.
తృణమూల్‌ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలను విస్మరించి డబ్బు ఆశచూపి ప్రజలను కొనడం ఆరంభిం చింది. ఈ రకంగా ప్రభుత్వం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. పాలక పార్టీ, ప్రభుత్వం ఆటపాటల్లో, ఉత్సవాల్లో మునిగితేలుతూ వాస్తవిక సమస్యల నుంచి పక్కదారి పడుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన 200 రోజుల్లోగా పశ్చిమ బెంగాల్‌ను స్వర్గధామంగా మార్చివేస్తామంటూ హామీలు గుప్పించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ వాటిల్లో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. దానికి బదులు పేదల్లోనే తేడాలు సృష్టించే ఎత్తుగడలకు పాల్పడింది. కొంతమందికి చిన్న చిన్న మొత్తాలను ఆశచూపి తనవైపుకు లాక్కుని పేద ప్రజల మధ్య అభిప్రాయ బేధాలు సృష్టించింది. దీంతో పాటు గ్రామీణ బెంగాల్‌లో మతోన్మాదాన్ని చాప కింద నీరులా అనుసరించే వ్యూహానికి పాల్పడింది. పైగా పార్టీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయింది. కోటి ఉద్యోగాలు సృష్టించేస్తామని, పారిశ్రామిక రంగంలో హరిత విప్లవాన్ని తెస్తామని హామీలివ్వడమే తప్ప ఆ దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. పైగా ఉన్న పరిశ్రమలు నెమ్మదిగా మూతపడుతున్నాయి.
విద్యారంగం పరిస్థితి ఏమిటి?
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విద్యా రంగం పూర్తిగా కుప్పకూలింది. మొత్తంగా అరాచక పరిస్థితులు రాజ్యమేలు తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. 70వ దశకంలో చోటు చేసుకున్న కొన్ని విపరీత సంఘటనలను మించి మరీ ఇప్పటి పరిస్థితులు ఆందోళన కరంగా తయారయ్యాయి. కాంగ్రెస్‌, నక్సలైట్ల తప్పులను, పొరపాట్లను ప్రస్తుత పరిస్థితితో పోల్చలేం.
పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి?
తృణమూల్‌ కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. దీంతో అనేకమంది సొంతపార్టీ కార్యకర్తలే హత్యకు గురయ్యారు. పరిస్థితి ఊహించనల వికానిదిగా ఉంది. మహిళల హక్కులు అణచివేయ బడుతున్నాయి. వారి మానమర్యాదలు మంటలో కలుసు ్తన్నాయి. రాష్ట్రంలో అత్యాచారాలు, అవమానాలు మహిళలకు నిత్యకృత్యంగా మారాయి. ఫలితంగా, నేరాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో బెంగాల్‌ పై స్థానానికి ఎగబాకింది. మహిళలు, చిన్నారులు లక్ష్యంగా మారారు. మహిళలు, పిల్లల అక్రమ తరలింపునకు సంబంధించి కూడా బెంగాల్‌ అగ్రస్థానంలో ఉంది. ఇదీ కొత్త పశ్చిమ బెంగాల్‌ తీరు!
కుంభకోణాల పర్వం గురించి వివరిస్తారా?
పెద్ద పెద్ద అవినీతి కుంభకోణాలకు ప్రభుత్వ అండదండలు దక్కుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అవినీతిని అణచివేస్తున్నానని చెబుతోంది. పేరుమోసిన చిట్‌ఫండ్‌ కుంభకోణంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు తృణమూల్‌ కాంగ్రెస్‌కు సంబంధముంది. కుంభకోణాలతో సంబంధమున్న పలువురు మంత్రులు, ఎంపీలు నెలల తరబడి జైల్లో మగ్గుతున్నారు. ఇకపోతే మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపం, టెట్‌ కుంభకోణాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పరీక్ష, నియామకం క్రమం అవినీతితో ముడిబడి ఉంది. 
ఏక బాటలో మోడీ-మమత?
బెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో రహస్య అవగాహనకు వచ్చాయి. దీనికి సంబంధించిన వాస్తవాలు భవిష్యత్తులో మాత్రమే వెల్లడవుతాయి.
ఉత్సవాల సమయంలో మీ పనితీరు గురించి చెబుతారా?
శరద్రుతువు ఉత్సవాలు రాష్ట్రంలో జాతీయ ఉత్సవంగా జరుగుతాయి. ఈ సమయంలో ప్రజలు ఆనందోత్సాహాలతో గడుపుతారు. అందుకే మేము కూడా మార్క్సిస్ట్‌ బుక్‌ స్టాళ్ళను నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్రంలో 20 జిల్లాల్లో 15 వందలకు పైగా మార్క్సిస్ట్‌ బుక్‌ స్టాళ్ళను నిర్వహించాం. ఈ ఉత్సవాల కోసం బయటకు వచ్చిన ప్రజల అవసరాలను తీర్చడం కోసమే మా ఈ ప్రయత్నం. ఏ మాత్రం హేతుబద్ధత లేని వాదనలు, విధానాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలడంలో ఈ స్టాళ్ళు విస్తృతంగా కృషి సల్పుతున్నాయి. శాస్త్రీయ, హేతువాద భావనలకు ప్రజల మనస్సుల్లో స్థానం కల్పించేలా ఈ పుస్తకాలు దోహదం చేస్తాయి. అందుకే మేము మార్క్సిస్ట్‌ సిద్ధాంత భావజాలంపైనా, ఆర్థిక విధానాలు, రాజకీయాలు, సామాజిక శాస్త్రాలు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఈ ఉత్సావాల్లో పెడుతున్నాం. ఏటా ఈ సమయంలో లక్షలాది రూపాయల విలువ చేసే పుస్తకాలు ఈ స్టాళ్లలో అమ్ముడుపోతాయి. ఈ ఉత్సవాల సమయంలో అనేకమంది సామాన్యులతో సంబంధాలు పెంపొందించు కోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో, నేను బుక్‌స్టాళ్ళకు వెళ్ళి పుస్తకాలను విక్రయించేవాణ్ణి, అనేకమందితో మాట్లాడేవాణ్ణి. ఇప్పటికీ ఈ స్టాళ్ళకు వస్తూనే ఉంటాను. అయితే ఇప్పుడు పుస్తకాలు విక్రయించకపోయినా స్టాళ్ళ ప్రారంభోత్సవంలో పాల్గొంటూ ఉంటాను. ఆ రకంగా ఈ పుస్తక స్టాళ్ళలో కొంచెం సేపైనా ఉండే అవకాశం వస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడకు వచ్చిన ప్రజలతో మాట్లాడటమంటే నాకెంతో ఇష్టం.
దేశంలో పచ్చి మితవాద ప్రభుత్వ ఏర్పాటుపై మీ స్పందన ఏమిటి?
గత ఏడాది బిజెపి చాలా స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 543 మంది సభ్యులున్న పార్లమెంటులో ఎన్‌డిఎకు 336 సీట్లు వచ్చాయి. అయితే ఎన్‌డిఎకు లభించిన ప్రజా మద్దతు కేవలం 31 శాతమే. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిజెపి కేంద్ర కమిటీ తన రాజకీయ తీర్మానంలో పచ్చి మితవాద ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినట్లు, దానితో పాటు తీవ్రమైన మత కార్యక్రమం ఉన్నట్లు పేర్కొంది. గత ఏడాదిన్నర కాలంలో బిజెపి పాలనలో జరిగిన సంఘటనలు చూస్తే బిజెపి ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా విధానాలు, వారి కార్యాచరణలన్నీ పచ్చి మితవాద భావజాలంతో, మతోన్మాదపు పోకడలతో ఉన్నాయి.
మారిన విదేశాంగ విధానంపై చెబుతారా?
దేశ విదేశాంగ విధానంలో కూడా మార్పు చోటు చేసుకుంది. భారత్‌ స్వతంత్ర విదేశాంగ విధానం బాటను వీడి సామ్రాజ్యవాద శక్తులతో కుమ్మక్కైంది. పశ్చిమాసియాకు సంబంధించిన విధానంలో ఈ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ మార్పుతో ఆయా ప్రాంతాల్లో సమస్యలు ఇప్పటికే తలెత్తాయి. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పాలస్తీనా పర్యటనలో ఆ విషయం స్పష్టమైంది. పాలస్తీనాలో భారత ప్రప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించాల్సి ఉంది. అయితే, ఆ సందర్భంగా ఆ దేశ విద్యార్థులు, యువత నుంచి ప్రణబ్‌ తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. పాలస్తీనా ప్రజలకు మద్దతిచ్చే భారత్‌ ఎందుకు తన విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని వారు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఫలితంగా జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే ఆయన ఇజ్రాయిల్‌కు వెళ్ళాల్సి వచ్చింది. ఈ సంఘటన భారత ప్రజలకు సిగ్గుచేటైన విషయం. భారత విదేశాంగ విధానం మారినందున భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మరిన్ని తలెత్తే అవకాశాలున్నాయి.
మేక్‌ ఇన్‌ ఇండియా ముసుగులో జరుగుతున్నదేమిటి?
'మేక్‌ ఇన్‌ ఇండియా' అంటూ పదే పదే నినదిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ నినాదం ముసుగులో దాగున్నారు. ఈ నేపథ్యంలో ఈ నినాదపు మరో పార్శ్వాన్ని చూస్తే అంతర్జాతీయ సంస్థలకు భారతదేశ విస్తారమైన మార్కెట్‌ను కట్టబెట్టాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఈ చర్య ప్రత్యక్ష ఫలితం దేశ ఉమ్మడి ప్రయోజనాలను నేరుగానే దెబ్బతీస్తుంది. మరోవైపు వ్యవసాయ రంగ సంక్షోభం దిశగా దేశం పయనిస్తోంది. 
నిర్హేతుకమైన విధానాల మాటేమిటి?
నిర్హేతుకమైన, అశాస్త్రీయమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ విద్య, సంస్కృతీ రంగ సిలబస్‌ను పునర్నిర్వచించడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల సామాన్యులు ఏ మాత్రం హేతుబద్ధంకాని ఆలోచనలు, మూఢ విశ్వాసాలతో ప్రభావితమయ్యే ప్రమాదముంది. ఆధునిక, హేతువాద ధోరణి గల భారత పౌరుణ్ణి రూపొందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పాల్పడే ఇటువంటి చర్యలు ప్రత్యక్ష అవరోధాలే. మత, మూఢ విశ్వాసాల ప్రాతిపదికతో కూడిన భ్రమల ప్రపంచంలోకి ప్రస్తుత తరాన్ని తీసుకెళ్ళేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆర్‌ఎస్‌ఎస్‌ , బిజెపి సంబంధాల గురించి వివరిస్తారా?
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) బిజెపి ఆత్మగా, ప్రధాన ఆధారంగా ఉంది. బజరంగ్‌ దళ్‌, విశ్వ హిందూ పరిషత్‌ వంటి సంస్థలు కూడా వీటితో జత కలిశాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాలైన హిందూ ఛాందసవాద శక్తులు వేర్పాటువాద విధానాలను అనుసరించేందుకై ప్రజల మీద ఒత్తిడి తెస్తున్నాయన్నది వాస్తవం. ఈ క్రమంలో కులతత్వపు ధోరణులు, మత పోకడలు పెచ్చరిల్లిన ఫలితంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల దాదాపు వెయ్యి వరకు చిన్నా, పెద్దా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భారత్‌ వంటి భిన్నత్వంతో కూడిన దేశంలో దుందుడుకు ధోరణితో సాగుతున్న మత ప్రచారం, పెద్ద ఎత్తున అసహనపు ధోరణులు తలెత్తడానికి అవకాశమిచ్చింది. ఈ మతపరమైన అసహనమే కట్టలు తెంచుకుని డాక్టర్‌ నరేంద్ర దభోల్కర్‌, గోవింద్‌ పన్సారే, డాక్టర్‌ ఎంఎం కల్బుర్గి వంటి హేతువాదులను, అభ్యుదయ రచయితలను బలి తీసుకుంది. ఇటువంటి సంఘటనలు మన వంటి లౌకిక దేశానికి మాయని మచ్చలు. మరోవైపు ఇటీవలనే చోటు చేసుకున్న దాద్రి సంఘటన మన దేశానికే సిగ్గు చేటు. 
ఉద్యమాలే ఏకైక మార్గమా?
దేశ కార్మిక వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కుల, మత, వర్గాలను బిజెపి ఉపయోగించుకోవడాన్ని నిరసిస్తూ విస్తృతమైన ప్రచారోద్యమాన్ని చేపట్టాల్సి ఉంది. నిరుపేదల ఐక్యతను పెంపొందించేందుకు అన్ని రకాలుగా కృషి చేయాల్సి ఉందనేది తెలుసుకోవాలి.