ఎపిఎన్‌జిఒ సంఘ రాష్ట్ర మహాసభల పోస్టరావిష్కర‌ణ‌

   ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని కార్మికశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎపిఎన్‌జిఒ సంఘ 19వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఆ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌జిఒల రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. సుదీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న కాంట్రాక్టు, కంటింజెంట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిందన్నారు. ఉపసంఘం సిఫార్సుల మేరకు ఆయా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఉద్యోగులు కూడా పనివేళలకు అదనంగా మరో గంటో, రెండు గంటలో విధులు నిర్వర్తించి రాష్ట్రాభివద్ధికి సహకరించాలని కోరారు. ఎపిఎన్‌జిఒ సంఘ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు మాట్లాడుతూ ఈ నెల 12, 13 తేదీల్లో ఎచ్చెర్లలోని శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మహాసభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతప్తికరంగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమానికి కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం హాజరై, ఎన్‌జిఒలకు అభినందనలు తెలిపారు.