ఉర్దూ పట్ల నిర్లక్ష్యం తగదు

భారతదేశం గుర్తించిన రెండవ అధికార భాష అయిన ఉర్దూను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఇంగ్లీషు తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష ఉర్దూ. కావున ఉర్దూనే మరింత అభివృద్ధి చేయాలి. అయితే ఉర్దూ భాష ఎక్కువగా ముస్లింలకే అనే ముద్రపడింది. కానీ ఉర్దూ అంతర్జాతీయ భాష. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం జపనీస్‌ భాషను కోర్సుగా పెట్టి నేర్పించాలని ప్రయత్నిస్తున్నది. కానీ ఇప్పటికే వాడుకలో ఉన్న ఉర్దూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. గతంలో ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉండేది. కానీ నేడు ముస్లిం సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఉర్దూ పాఠశాలలు అధికంగా ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో సచార్‌, రంగనాథ్‌ మిశ్రా కమిటీలు విద్యాపరంగా, ఉపాధి పరంగా ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నాయి. ప్రభుత్వ విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్బంధ ఉచిత విద్యను అమలుపరచాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఉర్దూ మీడియం ప్రైమరీ, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల ఉర్దూ మీడియం చదివే విద్యార్థులు తెలుగు మీడియం పాఠశాలల్లో విధిలేక చేరాల్సి వస్తోంది. దీనిని బట్టి చూస్తే ఉర్దూ భాష, ఉర్దూ మీడియం పాఠశాలల ప్రోత్సాహానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దీనిపై విద్యాశాఖాధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ శ్రద్ధ చూపకపోవడం ఉర్దూను నిర్లక్ష్యం చేయడమే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు విద్య ఎలా అందుతుంది. కొద్దో, గొప్పో డబ్బులున్నవారు తమ పిల్లలను ట్యూషన్లకు పంపుకొని చదిస్తారు. కానీ తినడానికి తిండిలేని, పూటగడవని నిరుపేదల పిల్లలు ఎలా చదువుకోగలరో మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాలి. ప్రభుత్వ ప్రోత్సాహం లేనందునే ఇతర వర్గాలతో పోలిస్తే డిగ్రీ వరకు కేవలం 4 శాతం మంది ముస్లిం విద్యార్థులు మాత్రమే చదవగలుగుతున్నారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లకు ఎంపికైన ముస్లింలు చాలా తక్కువ. ఐఎఎస్‌ 2.4 శాతం, ఐపిఎస్‌ 2.3 శాతం, ఐఎఫ్‌ఎస్‌ 1.8 శాతం మాత్రమే ఉన్నారని సమాచారం. దీనికి కారణం ఉపాధ్యాయుల కొరత. చదువుకోలేక వెనకబడటానికి రాజకీయంగా వెనుకబడి ఉండటం, పరిపాలనా విభాగంలో ముస్లింల భాగస్వామ్యం లేకపోవడం కూడా ప్రధాన కారణం. ఉర్దూను రెండవ అధికార భాష అని అంటూనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, ఉర్దూ బోధించే ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు సక్రమంగా నింపకపోవడం మరి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ఖాళీలు సక్రమంగా నింపి ఉంటే ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం ఉండి ఉండేది.రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం మినహా ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజుకు కూడా 491 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడం కోసం మనమందరం చేతులు ముడుచుకొని కూర్చోకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం, ఉర్దూ అభివృద్ధి కోసం, ఉర్దూ ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ప్రభుత్వంతో పోరాటం చేయాలి. పోరాటం చేయకపోతే ఈ ప్రభుత్వాలు దిగిరావు. లౌకికవాదులను కలుపుకొని అన్ని ముస్లిం మైనార్టీ సంఘాలు పోరాటం నిర్వహించాలి. అన్ని పార్టీల రాజకీయ నాయకులను నిలదీయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగలిగితే ముస్లిం యువతలో అత్యధికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఇందుకోసం చేయి చేయి కలపాలి.
-ఎస్‌ మగ్బుల్‌ బాష, ఆవాజ్‌ రాష్ట్ర సహాయక కార్యదర్శి, కర్నూలు.