ఉపాధి పనుల కల్పనలో ప్రభుత్వం విఫలం

రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు ఉపాధిపనులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎం.రవి, ఆర్‌. చంద్రశేఖర్‌ విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. సోమవారం సంఘం నాయకులు రాజధాని ప్రాంత గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరులో పర్యటించారు. మల్కాపురం నర్సరీల్లో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ఆరు, ఏడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడంలేదని మహిళా కార్మికులు సంఘం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఫారెస్ట్‌ డిపార్టుమెంటు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తమ కడుపులు మాడుస్తున్నారని, అదేమని అడిగితే పనులు మానుకోవాలని బెదిరిస్తున్నారని వాపోయారు. గత్యంతరంలేక నర్సరీల్లో పనులు చేస్తున్నామని, తమకు తక్షణమే సొమ్ములు చెల్లించాలని కోరారు. సంఘం నాయకులు రవి, చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం నర్సరీల్లో పనిచేస్తువారికి వేతనాలు చెల్లించడంలోనూ వైఫల్యం చెందిందని అన్నారు. ఉపాధిహామీ నిధులను దారిమళ్ళిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు, సిమెంట్‌రోడ్లు, ఆట స్థలాలకు ఉపాధిహామీ నిధులను మళ్ళిస్తూ అధికార పార్టీ నాయకుల జేబులు నింపుతోందని అన్నారు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు పనులు లేక వలసలు పోతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని చెప్పారు. ప్రపంచస్థాయి రాజధాని అంటూ గొప్పలు చెప్పుకుంటూ కూలీల పొట్టగొట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని, అందరికీ పనులు కల్పించే చర్యల్లో భాగంగా నూతనంగా నర్సరీలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మికులు తమగళం విన్పించేందుకు ఈనెల 20న విజయవాడలో తలపెట్టిన ధర్నాకు రాజధాని ప్రాంత వ్యవసాయ కార్మికులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.