'ఉపాధి' పనులు తక్షణమే ప్రారంభించాలి.

జిల్లాలోని పేదలు కూలి పనుల నిమిత్తం వలసలు పోతున్నారని, వాటిని అరికట్టేందుకు తక్షణమే ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కరువు విలయతాండం చేస్తుందని, ఈ పరిస్ధితుల్లో కూలి పనులు లేకపోవడంతో వేలాది మంది ఇతర జిల్లాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఉపాధి హామీ నిధుల్లో 50శాతం సిసి రోడ్లకు ఖర్చు చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో చేపట్టే పనుల్లో యంత్రాలు ఉపయోగించ రాదనే నిబంధన ఉందని, కాని ఈ నిధులు సిసి రోడ్లకు ఖర్చు చేయడం నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి పనుల్లో పాల్గొంటున్న కూలీలకు పనిముట్లు, టెంట్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పించవలసి ఉండగా ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ఇటీవల బడ్జెట్‌ను పరిశీలిస్తే అర్థమవుతుందని తెలిపారు. ఈ పథకానికి కేవలం రూ.4,500 కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, తొలగించిన విఆర్‌పిలు, టెక్నికల్‌ అసిస్టెంట్ల స్ధానంలో కొత్తవారిని నియమించడం లేదని, దీంతో సిబ్బంది చాలక కూలీలకు పే స్లిప్పులు సైతం పంపిణీ చేయడం లేదని తెలిపారు. ఉపాధి పనుల్లో జన్మభూమి కమిటీల ప్రమేయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వేసవి సమీపిస్తుండడంతో జిల్లాలోని అనేక ప్రాంతాలలో నీటి ఎద్దడి స్పష్టంగా కనిపిస్తుందని, తాగు, సాగు నీటి సమస్యలను తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.