ఉపాధిని చూపి వలసలను అరికట్టాలి : సిపిఎం

గ్రామాల్లో వెంటనే కూలిపనులు లేని పేదలందరికీ ఉపాధి హామీ పనులు చూపించి వలసలను అరికట్టాలని సిపిఎం పార్టీ డివిజన్‌ కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఏడో రోజు సత్తెనపల్లి మండలంలోని కట్టావారిపాలెం, పెదమక్కెన, గుడిపూడి, నందిగం, భీమవరం గ్రామాల్లో సోమవారం పర్యటించింది. ఈ సందర్భంగా కూలీలు వ్యవసాయ పనులు లేకపోవడంతో పస్తులు ఉండాల్సి వస్తుందని, తమకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చూపించాలని గ్రామస్తులు పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. పెదమక్కెనలోని ఎస్సీకాలనీవాసులు రాజకీయ కక్ష్యతో దళితులకు ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఇవ్వలేదన్నారు. వెంటనే తమకు జాబ్‌కార్డులు మంజూరు చేసి వలసలను అరికట్టాలని వార ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా విజరుకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పథకాలు ఏమీ అమలుకావడంలేదని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కా గృహాలు నిర్మిస్తామని అధికారులు చెప్పడంతో ఉన్న గుడిసెలను పీకివేసుకున్నారని, పక్కా గృహాలు మంజూరు కాకపోవడంతో చెట్లకిందనే నివాసముంటున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో వృద్ధాప్య, వితంతు పింఛన్లు సక్రమంగా అందడంలేదని, డ్వాక్రా గ్రూపు పొదుపు డబ్బులు బ్యాంకర్లు తీసుకోనివ్వడంలేదని అనేకమంది తమదృష్టికి తీసుకువచ్చారని అన్నారు. పైసమస్యలన్నింటిని ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.