ఉత్సవాలు కాదు... కార్యచరణ కావాలి

వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కావాల్సింది ఉత్సవాలు కాదు... అభివృద్ధిపై కార్యచరణ కావాలి' అని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్‌ చేశారు. రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం నాటితో రెండో రోజుకు చేరుకుంది. పుట్టపర్తిలో ప్రారంభమైన యాత్ర కొత్తచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, ఎస్కేయూ మీదుగా సాయంత్రానికి అనంతపురం నగరానికి చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతిచోటా విద్యార్థులు, యువకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ప్రసంగాలు చేసిన అన్ని ప్రధాన కూడళ్లలోనూ జనం ఆసక్తిగా నాయకుల ప్రసంగాలను విన్నారు. ప్రభుత్వాల తీరును ఎండగట్టినప్పుడు చప్పట్లో తమ మద్దతును తెలియజేశారు. రెండో రోజు జరిగిన యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి, సిపిఎం రామలసీమ సబ్‌ కమిటీ కన్వీనర్‌ జి.ఓబులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కుందారపు మురళీ, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌, సహాయ కార్యదర్శి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు పలుచోట్ల ప్రసంగించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి ఇచ్చిన హామీలు అమలు జరపకుండా 'లేపాక్షి' ఉత్సవాలు వంటివి జరిపి ఏదో చేసేస్తున్నట్టు ప్రజల్లో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోందంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈ జిల్లాకు కావాల్సింది ఉత్సవాలు కాదని, ఇచ్చిన హామీల అమలుకు కార్యచరణ కావాలని నిలదీశారు. హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇవి చేస్తే ప్రాంతానికి ఎంతో కొంత మేలు జరుగుతుందన్నారు. అవి చేయకుండా ఒట్టి మాటలు చెబితే ప్రయోజనం లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాసమస్యలు పరిష్కారం కోసం దృష్టి సారంచకుండా ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై దృష్టి సారించిందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హంద్రీనీవా పూర్తి చేసి సాగునీరివ్వమంటే... పొలాల్లో గుంతలు తవ్వుకొమ్మని చెబుతున్నారని ఎద్దేవ చేశారు. గుంతలో కరువు పోదని పేర్కొన్నారు. ఆ విధంగా పోయేటట్టు అయితే రైతులు ఎప్పుడో గుంతలు తవ్వుకునే వారని తెలిపారు. శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పట్టిసీమ రాయలసీమ కోసమేనన్న చంద్రబాబు ఒక్క టిఎంసి నీరైనా రాయలసీమకు ఇచ్చారని ప్రశ్నించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెలకు ఒక ఈవెంట్‌ చేస్తూ మంచి ఈవెంట్‌ మేనేజర్‌గా మారిపోయారని ఎద్దేవ చేశారు. సిపిఎం రాయలసీమ సబ్‌ కమిటీ కన్వీనర్‌ జి.ఓబుళు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో కరువుతో ఇళ్లలో తద్దినాలు జరిగే విధంగా ఉంటే... ప్రభుత్వం ఆర్భాటంగా ఉత్సవాలు జరుపుతోందని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 164 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. 40 మంది చేనేత కార్మికులు చనిపోయారన్నారు. అంతేకాకుండా ఎప్పుడూలేని విధంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళనకరమైన అంశమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌ మాట్లాడుతూ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపిలను అధికారపార్టీకి ప్రజలు కట్టబెట్టారన్నారు. కాని ప్రయోజనం లేదని విమర్శించారు. రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఉద్యమించక తప్పదని పిలుపునిచ్చారు