ఉగ్రవాదం ఏదైనా బలయ్యేది అమాయకులే...

సామాజిక అంతర్జా లం లో 2016 మే 14న ఒక వీడియో దుమారం రేపింది. అయోధ్యలో బజరంగ్‌దళ్‌ శిక్షణా శిబిరంలో భాగంగా సభ్యులకు మరణాయుధాలు వాడటంలో శిక్షణ ఇస్తున్నారు. వారి ఉద్దేశం దేశంలో ముస్లిం తీవ్రవాదులను ఎదుర్కోవడం, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడమట! ఆ పనులు చేయడానికి మనం పటిష్టమైన భద్రతా యంత్రాంగాన్ని ఏర్పర్చుకున్నామని వారు మర్చి పోయారా? అదే నెల 30న విహెచ్‌పి మహిళా శాఖ 'దుర్గావాహిని' తన సభ్యులకు మారణాయుధాలలో సైనిక శిబిరం లాంటి శిక్షణ ఇస్తుందని వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. ఆత్మరక్షణ కోసం శిక్షణ ప్రతి స్త్రీకీ అవసరమైనప్పటికీ మారణాయుధాలతో శిక్షణ వారికి ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? జూన్‌ 2న మథురలో ఒక నమ్మశక్యం కాని హింసాత్మక ఉదంతంలో ఆజాద్‌ విధిక్‌ వైవారిక్‌ క్రాంతి సత్యాగ్రహి అనే మత సంస్థకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 27 మంది చనిపోయారు. మధుర ఎస్‌పితో సహా మూడు వేల మంది ఉన్మాదులు 200 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెండేళ్ళపాటు కబ్జా క్రింద ఉంచుకొని తమదైన శైలిలో లోపల అరాచకాలు సృష్టిస్తున్నా రెండేళ్ళపాటు ఎవరూ అడ్డుచెప్పలేదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తలెత్తక మానవు. 80 శాతం మంది అవలంబిస్తున్న హిందూ మతంలో కొంత మంది మాత్రం విపరీతమైన అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఇవి పరిస్థితులు సృష్టించినవా లేక మానవ కల్పిత అభద్రతా భావమా? ఆయుధ చట్టం 1959, 1962 భారత ఆయుధ నిబంధనలు మరణాయుధాల తయారీ, అమ్మకం, ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధిస్తున్నాయి. మరి మత ఛాందసవాద సంస్థలు మారణాయుధాలను వేల సంఖ్యలో ఎలా పొందుతున్నాయి? మత ఉగ్రవాదం రోజురోజుకూ పెరుగుతున్నా సరే పీకల మీదకు వచ్చే వరకూ నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నాము ఎందుకు? మత ఛాందస సంస్థలు ఎవరినీ చంపట్లేదని కొంత మంది వాదన. మరి మొన్నకు మొన్న మథురలో జరిగిందేమిటి?
మత ఉగ్రవాదం
మతం పేరుతో ఉగ్రవాదం రాజకీయ హింసకు మరో రూపంగా మారింది. మత సంరక్షణకు హింసను ఆయుధంగా వాడడంలో తప్పులేదని మత ఉగ్రవాదులు గుడ్డిగా నమ్ముతారు. మత ఉగ్రవాదం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తుకు వచ్చేది ముస్లిం ఉగ్రవాదమే. కానీ మత ఉగ్రవాదానికి బీజం మధ్యయుగంలో ఇంగ్లాండ్‌లో పడింది. 'క్రూసేడులు' లేదా పవిత్ర యుద్ధాల పేరుతో రోమన్‌ క్రిస్టియన్‌ చర్చి అనుచరులు ముస్లిం దేశాల మీద దాడి చేసి వారిని ఊచకోత కోశారు. ఆధునిక కాలంలో కూడా మనకు 'కూక్లక్స్‌క్లాన్‌' వంటి ప్రొటెస్టెంట్‌ మత ఛాందస సంస్థలు ఉన్నాయి. వారి అనుచరులు 18వ శతాబ్దం నుంచి మత సంరక్షణ పేరు మీద దోపిడీలు, అత్యాచారాల వంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ వారి అనుచరులు పాశ్చాత్య ప్రపంచంలోని అనేక దేశాలలో వ్యాపించి వారి హింసాత్మక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అమాయక ప్రజల మీద అటువంటి క్రిస్టియన్‌ ఛాందస సంస్థల అనుచరులు దాడిచేసిననప్పుడల్లా దోషిని పాశ్చాత్య మీడియా ఉన్మాదిగానో, హంతకుడిగానో వ్యవహరిస్తుందే తప్ప 'క్రైస్తవ ఉగ్రవాది' అని మాత్రం అనదు. మధ్య ఆఫ్రికాలోని అనేక దేశాలలో సామాజిక అస్థిర పరిస్థితుల్లో క్రైస్తవ ఉగ్రవాదులు మసీదులన్నింటినీ తగులబెట్టినప్పటికీ ఆ వార్తలు మీడియాలో ప్రాచుర్యం పొందలేదు. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు మతంతో సంబంధం లేదని మనం చెబుతున్నప్పుడు ఒక్క ఇస్లామిక్‌ ఉగ్రవాదం గురించే మనం మాట్లాడుకుంటున్నాము. క్రైస్తవ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం గురించి ఎందుకు కాదు? బౌద్ధ ఉగ్రవాదం కూడా ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. ముజాహిద్ధీన్‌, తాలిబాన్‌, అల్‌ఖైదాల పుట్టుపూర్వోత్తరాలు మనకు మీడియాలో రోజు విడిచి రోజు పూస గుచ్చినట్లు చూపిస్తుంది కానీ మన దేశంలో క్రైస్తవ ఉగ్రవాదం ఉనికిని కూడా గుర్తించడానికి ఇష్టపడదు. నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఎన్‌ఎల్‌ఎఫ్‌టి) గత దశాబ్దంలో 30 మందికి పైగా హిందువులను క్రైస్తవ మత సంరక్షణ పేరుతో చంపింది. నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సిఎన్‌) అనే ఒక క్రైస్తవ ఛాందసవాద సంస్థ క్రైస్తవ సమాజ నిర్మాణ ధ్యేయంగా 1992-93 మధ్యకాలంలో కూకీ జాతికి చెందిన 900 మంది గిరిజనులను ఊచకోత కోసింది. లక్ష మందిని వారి ఊరి నుంచి తరిమికొట్టింది. కొందరు మత ఛాందస బౌద్ధ మతస్తులు శ్రీలంక, బర్మాల్లో ఈ మధ్యకాలంలో చాలా మంది ముస్లింలను మత సంరక్షణ పేరుతో హత్య చేశారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మనం ఉగ్రవాదాన్ని ఏదో ఒక మతానికే ఆపాదిస్తే అది మూర్ఖత్వం అవుతుంది.
మత ఉగ్రవాదానికి కారణాలు
విశ్వీకరణ, వలస ప్రపంచంలో నిరంతరం విభిన్న సంస్కృతులు ఒక దానితో ఒకటి కలుస్తుంటాయి. పరస్పర ప్రభావాలకు లోనవుతాయి. ఆలోచనలు, అభిప్రాయాలు మారుతుంటాయి. ఈ ప్రభావాల వల్ల మతపరమైన విశ్వాసాలు వారి అవసరాలకు అనుగుణంగా సరళీకరించబడుతుంటాయి. కొంత మంది ఈ సహజమైన సామాజిక మార్పును సహించలేక మత ఉద్ధరణను తమ భుజాల మీద వేసుకొంటారు. తరతరాల నుంచి వస్తున్న మత విశ్వాసాలకు సవాలుగా నిలుస్తున్న విశ్వీకరణకు ప్రతిఘటనే ఈ మత ఉగ్రవాదం. మత ఉగ్రవాదం ప్రపంచంలోని చాలా భాగాలలో బలంగా ఉండటానికి కారణం అక్కడి వ్యవస్థ, ప్రభావశీల వ్యక్తులు వారి కార్యకలాపాలకు అండదండలు అందివ్వడమే. ప్రాథమికంగా ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు స్వార్థపూరిత కారణాలతో అక్కడి ప్రభుత్వం అండనివ్వగా రాను రాను అవి అండనిచ్చేవారినే మింగేసే దశకు చేరాయి. సోవియట్‌ను తరిమి కొట్టడానికి అమెరికా తాలిబాన్‌లను ప్రోత్సహించిన పర్యవసానాలు మనం ఇప్పటికీ చూస్తున్నాము.
మత ఉగ్రవాద నిర్మూలన
ఎటువంటి ఉగ్రవాదమైనా సరే దాన్ని తుడిచిపెట్టాలనే ప్రభుత్వం, ప్రజల దృఢ సంకల్పం ముందు చిన్నబోవాల్సిందే. అమెరికాకు ఆప్ఘనిస్తాన్‌ నుంచి తాలిబాన్‌ను తరిమికొట్టడానికి అయిదేళ్ళు పట్టింది. దేశం లోపలైనా, దేశం బయటైనా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి కావాల్సింది దృఢసంకల్పం మాత్రమే. మారణాయుధాలు చేపట్టి ఎదురు దాడికి దిగిన రెండు వేల మందిని యుపి ప్రభుత్వం రెండు రోజుల్లో లొంగదీసింది... రెండేళ్ళు చూస్తూ కూర్చున్న తర్వాత. అన్ని మతాల ప్రజలు తమ తమ మత విశ్వాసాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించే స్వేచ్ఛ ప్రభుత్వం వారికి కల్పించాలి. ఎటువంటి అభద్రతా భావానికిలోను కాని సామాజిక పరిస్థితులను సృష్టించాలి. తమ తమ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉన్నప్పటికీ ఇతర మతాలను అవహేళన చేసే చర్యలను ప్రోత్సహించకూడదు. అది మత ఉగ్రవాదానికి పునాది వేస్తుంది. ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా మత ఛాందలవాద సంస్థలకు ఎటువంటి సహాయం అందించకూడదు. ఒక ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మరో ఉగ్రవాదాన్ని ప్రేరేపించుకుంటూపోతే దానికి అంతం ఉండదు. మత ఉగ్రవాదం హిందూ, ఇస్లాం, క్రైస్తవ రూపాల్లో ఉండొచ్చు కానీ దానికి బలయ్యేది మాత్రం ఎల్లప్పుడూ అమాయక ప్రజలే.

- సంజీవని కుసుమ్‌