ఉక్కు పరిశ్రమ సాధన కోసం కడప జిల్లా బంద్

ఎపి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బిబి రాఘవులు డిమాండ్‌ చేశారు. ఉక్కుపరిశ్రమ నిర్మాణంతోనే జిల్లా బతుకు ఆధార పడి ఉందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణకమిటీ ఇచ్చిన నివేదికలో రాష్ట్ర విభజనానంతరం కనీసం ఆరు నెలల్లోపు కడపలో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలని పేర్కొందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా దాని వూసే లేదని పేర్కొ న్నారు. జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 30వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవ కాశం ఉందన్నారు. అనుబంధ పరిశ్రమల ద్వారా దాదాపు లక్ష మందికిపరోక్షంగా ఉపాధి అవకాశం కల్గుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై దాగుడు మూతలాడుతోందన్నారు. నాలుగేళ్లుగా బిజెపితో అధి కారాన్ని పంచుకున్న టిడిపి అధికారంలో ఉన్నంత వరకు పరిశ్రమ ఏర్పాటుపై పల్లెత్తు మాట్లాడకుండా నేడు దీక్షలకు పూనుకోవడం హాస్యా స్పదంగా ఉందన్నారు.