ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఆందోళన

ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఈ నెల 22న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ప్రదర్శన నిర్వహించనున్నారు.గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తామని చెప్పిన టిడిపి ప్రభుత్వం, 21 మాసాలు గడిచినా ఆ హామీని అమలు చేయలేదని వారు విమర్శించారు. 21 మాసాలలో పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలలో ఇళ్ల నిర్మాణం గానీ, స్థలాల కేటాయింపుగానీ జరగలేదని పేర్కొన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉండగా, పట్టాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నవారు కూడా ఉన్నారన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాల కోసం గత మూడు జన్మభూమి కార్యక్రమాలలో పేదలు పెట్టుకున్న లక్షలాది అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.1.5 లక్షలు ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. 13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు బకాయిలను చెల్లించకపోవటంతో ఇళ్ల నిర్మాణం సగంలోనే ఆగిపోయిందన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండు చేశారు.