ఇక ప్రత్యక్ష భూ పోరాటం..

వామపక్ష, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ప్రత్యక్ష భూ పోరాటాలకు సన్నద్ధం కావాలని ఎపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని సంఘాలతో భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29న విజయవాడలో రాష్ట్ర స్థాయి భూ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఇక్కడ దాసరి భవన్‌లో వామ పక్ష రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడాన్ని ఖండించారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్‌, ప్రభుత్వ భూములకు అన్ని హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం, ఇండిస్టియల్‌ కారిడార్‌, పోర్టుల అభివృద్ధి, ఎయిర్‌ పోర్టుల నిర్మాణాల పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పూనుకొందన్నారు. దీనివల్ల దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల పేద రౖతులే ఎక్కువగా భూములు కోల్పోతున్నారన్నారు. భూములు కోల్పోయిన రైతులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించడానికి హామీలు కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.