ఇకపై జపాన్ భాష కూడా..

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జపాన్‌ భాషను ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర, గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయాలను దీనికోసం ఎంపిక చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషపై విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్‌ భాషపై బోధనా తరగతులను చేపట్టడానికి ఈ మూడు విశ్వవిద్యాలయాలకు అనుమతులను మంజూరు చేశారు. జపాన్‌ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో రెండుసార్లు ఆ దేశంలో పర్యటించారు. జపాన్‌కు చెందిన పలు ఎలక్ట్రానిక్‌, ఇంజనీరింగ్‌, సివిల్‌ సంస్థలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే దిశగా పరస్పర అవగాహన ఒప్పందాలను సైతం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే యువతకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండకూడదని ప్రభుత్వం భావించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్యా స్థాయిలో విశ్వవిద్యాలయాల్లో జపాన్‌ భాషను బోధించడం వల్ల ఉపయోగం ఉంటుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా గత ఏడాది డిసెంబర్‌ 24న ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్నత విద్యాశాఖకు లేఖ రాశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, కార్యదర్శి కూడా వేర్వేరుగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో ఉన్నత విద్యాశాఖతో సంప్రదింపులు జరిపారు. ప్రతిష్ఠాత్మక శ్రీవేంకటేశ్వర, ఆంధ్రా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషను బోధించేలా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదనలను అందజేశారు. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన అనంతరం ఉన్నత విద్యాశాఖ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ మూడు విశ్వవిద్యాలయాల్లో జపాన్‌ భాషను ప్రవేశపెడుతూ ఉత్తర్వులను జారీ చేసింది.