ఆంధ్రాకు అణు ప్రమాదం..

అణు కేంద్రాలు సీసాలో బంధించిన పెను భూతాలని, ఎప్పుడు ప్రమాదమొస్తుందో తెలియదని, ప్రమాదం సంభవిస్తే ఎవరూ రక్షించలేరని భారత ఆర్థిక, ఇంధన వనరుల శాఖ విశ్రాంత కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ అన్నారు. కొవ్వాడ అణుపార్కు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్వాన శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో కొవ్వాడ అణుపార్కుపై అణు నిపుణులతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన సోమవారం చర్చా వేదిక జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శర్మ మాట్లాడుతూ, అణు వ్యర్థాలు అత్యంత విషతుల్యమని, ప్రమాదకరమని, సాంకేతికంగా వాటికి పరిష్కారం లేదని తెలిపారు. జపాన్‌లోని ఫుకుషిమాలో అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఆ దేశంలోని అణు ప్రాజెక్టులను మూసివేశారన్నారు. పర్యావరణ అనుమతుల్లేకుండా భూసేకరణ చేయరాదని కర్నాటకకు చెందిన ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదన్నారు. కొవ్వాడ అణు ప్రాజెక్టుకు సంబంధించి సైట్‌ సెలక్షన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టడం లేదని తెలిపారు. అణు ప్రాజెక్టుకు ఉద్దేశించిన ప్రాంతం భూకంపాల జోన్‌లో ఉందన్నారు. ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలోని 300 కిలోమీటర్ల పరిధిలో అధ్యయనం చేయాలని అణు ఇంధన మంత్రిత్వ శాఖ సూచించినా అదీ జరగలేదన్నారు. కొవ్వాడలో తొలుత నాలుగు వేలనుంచి ఆరు వేల మెగావాట్ల అణుపార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి, అమెరికన్‌ బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం పది వేల మెగావాట్లకు పెంచేశారని తెలిపారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ కె.బాబూరావు మాట్లాడుతూ, ఆస్ట్రియాలో అణు ప్రాజెక్టును ఆ దేశ ప్రజాభిప్రాయానికి తలొగ్గి మూసివేసిందన్నారు. అటువంటి ప్రమాదకర ప్రాజెక్టును తీసుకురావాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. శోధన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, అణు శాస్త్రవేత్త పిడికె.రావు మాట్లాడుతూ, అణు రేడియేషన్‌ ప్రభావం భావితరాలపైనా ఉంటుందని, కార్పొరేట్ల లాభాల కోసం కార్పొరేట్లకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను బలిష్టం చేసుకోవడానికి కొవ్వాడలో అణు ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. అణు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తి తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు.